ఈ ఏడాది ( 2022) చివర్లో మూడు ప్రధానమైన ఎన్నికలు జరిగాయి.
ఢిల్లీ ఒక రాష్ట్రం గా ఉంది. దానికి ఒకే రకమైన భౌగోళిక సరిహద్దులు కలిగిన రెండు ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి శాసన సభ. మరొకటి ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్. రెండింటి పరిధి దాదాపు సమానమే.
శాసన సభకు అయితే 70 స్థానాలు ఉన్నాయి. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ కు అయితే 250 కార్పొరేటర్ స్థానాలు ఉన్నాయి.
ఢిల్లీ రాష్ట్రం, మునిసిపల్ కార్పొరేషన్ పరిధి తో పాటు ఓటర్ల సంఖ్య కంటే ఎక్కువే.
ఈ రెండూ కూడా బీజేపీ గుత్తాధిపత్యం లోనివే.
అయితే, ఒక మామూలు ఐ.ఆర్.ఎస్ అధికారి అయిన అరవింద్ కేజ్రీవాల్… ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టిన తరువాత… ఢిల్లీ లో మొదటి సారిగా బీజేపీ జైత్ర యాత్రకు బ్రేకులు పడ్డాయి.
బీజేపీ అంటే… హంగు, ఆర్భాటాలు. బీజేపీ అంటే.. హై ప్రొఫైల్ నరేంద్ర మోడీ. బీజేపీ అంటే…అపర చాణక్యుడు గా పేరుపొందిన ఎన్నికల స్పెషలిస్ట్ అమిత్ షా. బీజేపీ అంటే…. హిందూ ధార్మిక సంస్థల సైన్య సమూహం. బీజేపీ అంటే… మోడీ ని పొగడడానికి ఒక దానితో ఒకటి పోటీ పడే ఉత్తరాది న్యూస్ ఛానళ్ళు. బీజేపీ అంటే…. ఇంద్ర ధనుస్సులను మరిపించే మోడీ సమ్మోహనోపన్యాస మాయ తెరలు. బీజేపీ అంటే… పైకి కనిపించకుండానే అల్లుకుపోయే ఆర్ ఎస్ ఎస్. సైన్యం.
ఇక, ఢిల్లీ అంటే….130 కోట్ల జనాభా గలిగిన ఈ సువిశాల దేశ రాజధాని. ఢిల్లీ అంటే – మోడీ, అమిత్ షా ల ఇలాకా. వారి నివాస నగరం. ఢిల్లీ అంటే – ప్రపంచ నేతలు ఎవరో ఒకరు రోజూ వచ్చి పోయే అంతర్జాతీయ మహా నగరం. ఢిల్లీ అంటే…. మోడీ హయాం ప్రారంభం కావడానికి ఆరేడేళ్ల ముందు నుంచే బీజేపీ ఏలుబడి లో ఉన్న నగరం. అటువంటి ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ లో …., 15 ఏళ్లగా చెలాయిస్తూ వచ్చిన అధికారాన్ని బీజేపీ కోల్పోయింది. మోడీ, షా, మంత్రులు, బీజేపీ ప్రముఖులు వగైరా ప్రచార హోరు లో పాల్గొన్నప్పటికీ ; బీజేపీ ఓడిపోయింది. మరి, ఢిల్లీ మోడీ గెలిచి నట్టా…. ఓడినట్టా….?
ఓడింది కూడా కాంగ్రెస్ చేతిలో కాదు. ఓ పదేళ్ల కిందటి వరకు రాజకీయం గా తాడూ… బొంగరం లేని కేజ్రీ వాల్ చేతిలో. ఇక,ఎన్నికలు జరిగిన మూడింటిలో హిమాచల ప్రదేశ్ ఒకటి. అక్కడ ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వం ఉంది. ముగ్గురు ముఖ్యమంత్రుల్ని మార్చారు. మోడీ హిమాచల్ ప్రదేశ్ లో సుమారు 15 ఎన్నికల సభల్లో ప్రసంగించారు. అక్కడ ఉన్నది 68 సీట్లు. అంటే…..35 సీట్లు వస్తే, ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. ‘మీ అభ్యర్థి ఎవరు అనేది చూడకండి. నన్ను చూసి బీజేపీ కి ఓటు వేయండి ‘ అని నరేంద్ర మోడీ ఓటర్లకు పదే పదే విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ, ప్రభుత్వం ఏర్పాటుకు కావలసిన 35 స్థానాలను బీజేపీ గెలవలేక పోయింది. దానితో, అక్కడి బీజేపీ….. ప్రతిపక్షం అయిపోయింది. అంటే – ఎన్నికలు జరిగిన మూడింటిలో రెండింటిని బీజేపీ కోల్పోయింది. మరి, మోడీ గెలిచినట్టా…. ఓడినట్టా….?
ఇక, చివరిగా గుజరాత్. అక్కడ గత పాతికేళ్ల నుంచీ బీజేపీ ప్రభుత్వమే ఉంది.
ఇక ముందూ ఉంటుంది. గుజరాత్ సమాజం హిందువులు – మైనారిటీలు గా విడిపోయింది. ఇక, అక్కడ 2002 లో జరిగినగోధ్రా అల్లర్ల మారణ హోమం…. గుజరాత్ లో బీజేపీ కి ప్రతి ఎన్నిక లోనూ ‘శ్రీరామ రక్ష’ గా నిలబడుతూనే ఉంటుంది. దీనికి తోడు, మహారాష్ట్ర లో నెలకొల్పాలని నిర్ణయించిన భారీ పరిశ్రమలను చివరి నిముషం లో గుజరాత్ కు తరలించారు. వీటన్నిటి ఫలితం గా అక్కడ అధికారాన్ని బీజేపీ నిలుపుకోగలిగింది. అయినప్పటికీ క్రెడిట్ మాత్రం ప్రధాని మోడీ దే. ఆయన ప్రభావం ఫలితంగానే అత్యధిక స్థానాలను బీజేపీ గెలుచుకుంది. వరుసగా ఏడో సారి అధికారం చేపట్టింది. ఇక్కడ గెలిచింది మోడీయే.
అయితే….!
2024 లో పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించుకుంటే….. బీజేపీ కి జాతీయ ప్రత్యామ్నాయం అనేది కనుచూపు మేరలో కనిపించడం లేదు. అందువల్ల, ఒకరి ఇష్టాయిస్టాలతో సంబంధం లేకుండా….మోడీయే తిరిగి అధికారం లోకి వస్తారని చెప్పడానికి జ్యోతిష్యం తెలియాల్సిన పని లేదు . దక్షిణ భారత దేశం మొత్తం అంతా కలిపి ; 15,20 లోకసభ స్థానాలు సైతం లభించకపోతే…. లభించకపోవచ్చు గాక!
కానీ, ఉత్తరభారత దేశం చాలు ; బీజేపీ – కేంద్రం లో అధికార పగ్గాలు చేపట్టడానికి. దక్షిణ భారత దేశం లో బీజేపీ బ్రాండ్ పేరు మీద వచ్చే ఆ కొద్దిపాటి స్థానాలు….. ఆ పార్టీ కి బోనస్ మాత్రమే.
2024 ఎన్నికల నాటికి కాంగ్రెస్ కోలుకునే వాతావరణం కనిపించడం లేదు. గుజరాత్ ఎన్నికల ఫలితాలతో,’ జాతీయ పార్టీ ‘ గా అవతరించిన ‘ఆప్’ – ‘ మైసూర్ బోండా ‘ వంటిదే. బొండా లో మైసూర్ ఉండదు కదా! ; ‘ఆప్’ లో కూడా జాతీయ పార్టీ లక్షణం ఉండదు.
కేరళ లో సిపిఎం, తమిళనాడు లో డీఎం కే, ఆంధ్ర లో వైసీపీ / టీడీపీ, తెలంగాణ లో కేసీఆర్, కర్ణాటక లో కాంగ్రెస్, ఒడిశా లో నవీన్ పట్నాయక్, బెంగాల్ లో మమతా బెనర్జీ, బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ పరివారం, యూ పీ లో అఖిలేష్ యాదవ్, మహారాష్ట్ర లో ఉద్ధవ్ ఠాక్రే మొదలైన పార్టీలు / నేతలు గణనీయమైన ఫలితాలు సాధించినప్పటికీ ; జాతీయ స్థాయిలో మోడీ ని, బీజేపీ ని సవాలు చేయగల పరిస్థితుల్లో అవి లేవు. ఎందుకంటే…. ఏ రెండు పార్టీల మధ్య ఏ విషయం లోనూ ఏకాభిప్రాయం కనిపించదు.
అందువల్ల ; ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో మోడీ ఓడారా…. గెలిచారా అనే చర్చతో సంబంధం లేకుండా…2024 లోకసభ ఎన్నికల్లో కూడా ఆయనదే ( బీజేపీ ) గెలుపని నిస్సందేహంగా చెప్పవచ్చు.
బీజేపీ కి…. నరేంద్ర మోడీ కి జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి కాక….. ప్రజల బాగోగుల గురించి ఆలోచించే జాతీయ ప్రత్యామ్నాయ నాయకత్వం లేకపోవడం అనేది … నరేంద్ర మోడీ అప్రతిహత రాజకీయ ప్రయాణానికి ప్రధాన సోపానం.
మరో పక్కన…. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావేమో…. తానే మోడీ కి ప్రత్యామ్నాయం అంటున్నారు. అలా అనడానికి కావలసినంత డబ్బు…. దస్కం, దమ్ము, ప్రచార సరంజామా ఆయన కనుసన్నలలో ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటున్న ఈ ఎనిమిదేళ్ళల్లో అవన్నీ సమకూరి ఉంటాయి.
ఆయన ధైర్యాన్ని ఎవరైనా మెచ్చుకోవలసిందే. దేశానికి గుండె కాయవంటి ఢిల్లీ ని పాదాక్రాంతం చేసుకున్న కేజ్రీ వాల్ కూడా…. మోడీ కి తానే ప్రత్యామ్నాయం అనడం లేదు. ప్రధాని పదవి పై వెయ్యి కళ్లేసి ఉంచిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బైటపడి మాట్లాడడం లేదు. మరాఠా వృద్ధ మార్జాలం…. శరద్ పవార్ చప్పుడు చేయడం లేదు. కానీ చంద్రశేఖర రావు మాత్రం బీఆర్ఎస్ అంటూ రంగం లోకి దిగేశారు. ‘ఎర్రకోట పై గులాబీ జండా ఎగుర వేస్తాం’ అంటున్నారు( వచ్చే లోకసభ ఎన్నికల్లో…. మొత్తం 543 లోక సభ స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకున్నప్పటికీ ; ఢిల్లీ ఎర్రకోటపై స్వాతంత్ర్య దినోత్సవం నాడు భారత జాతీయ పతాకాన్నే ఎగురవేయాలి. అధికార పార్టీ పతాకాన్ని కాదు ).
సరే. ఆయన ఆనందం ఆయనది. ఎవరు మాత్రం ఎందుకు కాదనాలి?
మోడీ విషయానికి వస్తే, ఒక్క కేరళ రాష్ట్రాన్ని మినహాయిస్తే ; ఆయన నాయకత్వానికి నయానో… భయానో…. కిక్కురు మనకుండా మద్ధతు ఇచ్చే పార్టీలు దాదాపు అన్ని రాష్ట్రల లోనూ ఉన్నాయి. రాజకీయాలలో పతనమైపోతున్న నైతిక విలువలను అడ్డం పెట్టుకుని ; వాటి నుంచి నరేంద్ర మోడీ 100% ప్రయోజనం పొందుతారానడం లో…. సందేహం అవసరం లేదు. రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీల నేతలు ఎంత భ్రష్టులు అయితే, మోడీ నాయకత్వం అంతగా బలపడుతుంది. ఈ కృషిలో ఆయనకు సీబీఐ, ఐటీ, ఈడీ వంటి శాఖలు దన్నుగా ఉన్నాయి.
అందుకే,(ఆయనకు బోరు కొట్టక పోతే )-మూడో సారీ ఆయనే ప్రధాన మంత్రి. ఇప్పుడు జరిగిన మూడింటి ఎన్నికల్లో… రెండింటిలో ఓడిపోతేనేం?
వచ్చే ఏడాది జరగవలసిన ఉన్న తెలంగాణ, చత్తిస్ ఘడ్, మధ్య ప్రదేశ్, నాగాలాండ్,జమ్మూ & కశ్మీర్, కర్ణాటక, మిజోరాం,మేఘాలయ వంటి రాష్ట్రాల్లో బీజేపీ గెలిస్తేనేం… గెలవక పోతేనేం…?
నరేంద్ర మోడీయే మూడో సారి కూడా మన ప్రధాన మంత్రి.

bhogadirayudu2152@gmail. com