-దళిత గిరిజన జేఏసీ హెచ్చరిక
-27 సంక్షేమ పథకాలు పునరుద్ధరించాలి : బెజవాడ డిక్లరేషన్
-వేల సంఖ్యలో తరలి వచ్చిన దళిత గిరిజన నేతలు
-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక
పాలకుల దివాళాకోరు విధానాల వలన దళిత,గిరిజనుల బ్రతుకులు అత్యంత ఘోరంగా శిథిలమై చితికిపోతున్నాయని దళిత గిరిజన జేఏసీ ఆగ్రహించింది. దళిత, గిరిజన హక్కులన కాలరాసే ప్రభుత్వాలు కుప్పకూలిపోతాయని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఆదివారం విజయవాడ జింఖానా గ్రౌండ్స్ లో జరిగిన జేఏసీ రాష్ట్ర సదస్సులో భారీ ఎత్తున దళిత, గిరిజన నాయకులు హాజరయ్యారు. 26 జిల్లాల నుంచి దాదాపు 3వేల మంది నాయకులు ఈ సదస్సులకు హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ జరిగిన సదస్సులో పలు అంశాలను చర్చించారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించాలని నాయకులు పిలుపునిచ్చారు. దళిత గిరిజన జె ఏ సి చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి.గోపాల రావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.
రాష్ట్రం లోను, దేశం లోను అధికారం లో ఉన్న ప్రభుత్వాలు దళిత గిరిజన ప్రజల రాజ్యాంగ హక్కులు, నిధులు, పథకాలు, ప్రత్యేక చట్టాలు నిర్వీర్యం చేస్తూ, మన ఉనికిని దెబ్బ తీస్తున్నాయని గోపాలరావు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయాలను, దళిత, గిరిజన హక్కులను ఏ మేరకు అన్యాయం చేశారో గణాంకాలను సభలో ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల లో మనల్ని మనం కాపాడు కోవటం కోసం, మన ఉనికిని నిలబెట్టుకోవటం కోసం, మన హక్కులను పరిరక్షించు కోవటం కోసం ఐక్యం గా సమాయత్తం కావాలని టి.గోపాల రావు విజ్ఞప్తి చేశారు. హక్కులు, సబ్ ప్లాన్ నిధులు, పథకాలు, ప్రత్యేక రక్షణ చట్టాలు పరిరక్షణ లక్ష్యం దిశగా దళిత గిరిజన జె ఏసీ రాష్ట్ర సదస్సు కు రాష్ట్రం లోని అన్ని జిల్లాల నుంచి పార్టీలకు అతీతంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు, అన్ని సంఘాల నాయకులు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలి రావాలనిగోపాల రావు అన్ని సంఘాలకు పిలుపు నిచ్చారు.
జేఏసీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పనబాక కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళిత గిరిజన సంక్షేమానికి నిధులు కేటాయించడంలో తీవ్రమైన వివక్ష కొనసాగు తోందన్నారు. బడ్జెట్లో కేటాయించిన నిధులు కూడా పక్కదారి పట్టిస్తూ ఇతర పథకాలకు మళ్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వం ద్వారా దళిత, గిరిజనులకు ప్రణాళిక కానీ, బడ్జెట్ కేటాయింపులు గానీ, సంక్షేమానికి ఖర్చు పెట్టే పరిస్థితి కానీ, సహాయ.కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న పీఎంజీఎస్, ఎన్ఎస్ఎఫ్డీసీ నిధులు బ్యాంకుల నిర్లక్ష్యం మూలంగా ఖర్చు చేయడం లేదు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రాజకీయ ఆర్ధిక విధానాల వలన దళితుల, గిరిజనుల బ్రతుకులుఛిద్రమైపోతూ, దేశంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి దాపురించిందని అన్నారు.
మాజీ ఐఆర్ ఎస్ అధికారి ఉప్పులేటి దేవీ ప్రసాద్ ప్రధాన రాజకీయ పార్టీల నాయకులను తూర్పారబట్టారు. దళితులకు, గిరిజనులను అన్యాయం చేయటంలో నాయకులు పోటీ పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి హాయంలో 27 పథకాలను ఎత్తివేశారని తెలిపారు. దళితులకు పథకాలు రాకుండా చేశారని… ప్రత్యేక పథకాలు అన్నింటినీ రద్దు చేసిన ఘనుడు జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రసెడెంట్ జంగా గౌతమ్ మాట్లాడుతూ సజ్జల రామకృష్ణా రెడ్డి రాష్ట్రానికి అసలైన ఒకే ఒక ఉపముఖ్యమంత్రి అని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దళిత గిరిజనులకు తీవ్రంగా అన్యాయం చేస్తోందని అన్నారు.
ఇంకా పలువురు నాయకులు మాట్లాడుతూ దళితులకు కేటాయించిన నిధులు ఖర్చు చేయడంలో నిర్లక్ష్యం చేశారని,గత నాలుగేళ్లుగా ఎస్సీ కార్పోరేషన్ నిధులు సబ్సీడీలు రావడం లేదని అన్నారు. సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు పెరిగిన ధరల ప్రకారం మెనూ పెంచి,బడ్జెట్ కేటాయింపులు చేయాలన్నారు. పెరుగుతున్న ధరలతో సామాన్యులు కొనలేని, తినలేని పరిస్థితి దాపురించిందని, ధరలను నియంత్రించడంలో పాలకులు విఫలం చెందారని ఎద్దేవా చేశారు. కుల దురహంకార హత్యలు నివారించడంలో ప్రభుత్వాలు
ఘోరంగా విఫలం చెందిందని మండిపడ్డారు. దేశంలో,రాష్ట్రంలో ఉన్న దళిత గిరిజనులకు అండగా ఉండివారిని అన్నీ రంగాల్లో రాణించే విధంగా ప్రోత్సాహం అందిస్తాం,వారికి చట్టాల పై అవగాహన,వారికి న్యాయసలహాలు,రాజ్యాంగంలో పొందుపరిచిన అన్నీ హక్కులు వారికి వచ్చేలా దళిత గిరిజన జె ఏ సి కృషి చేస్తుందని తెలిపారు. ఈ సదస్సుకు రాష్ట్ర నలుమూలలనుండి దళిత గిరిజనులు తరలి రావాలి అనీ ఆయన పిలుపునిచ్చారు.
దళిత బహుజన ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు కొరివి వినయ కూమార్ నేతృత్వం వహించిన ఈ కార్యక్రమంలో దళిత, గిరిజన నేతల ఆద్వర్యంలో బెజవాడ డిక్లరేషన్ ప్రకటించారు. ఇందులో 12 అంశాలను ప్రధానంగా ప్రకటించారు. 27 సంక్షేమ పథకాల పునరుద్ధరణ, ఎస్సీ, ఎస్టీ సమగ్రాభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయాలి, సబ్ ప్లాన్ కాలపరిమితి లేకుండా చట్టం రూపొందించాలి, అంబేడ్కర్ పేరు మీద ఉన్న పథకాలను పునరుద్ధరించాలి, ఎస్సీ, ఎస్టీలకు స్కాలర్ షిప్ లకు మంజూరు చేయాలి, కోనేరు రంగారావు సిఫార్సులను అమలు చేయాలి, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి, జోగినీ, సఫాయి కర్మచారీలు, బాండెడ్ లేజర్ల విముక్తికి చట్టాలు… వంటి అంశాలతో బెజవాడ డిక్లరేషన్ విడుదల చేశారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. అవగాహన సదస్సులతో పాటు ప్రభుత్వాలపై తిరగబడే కార్యక్రమాలకు తెర తీయాలని జేఏసీ ప్రణాళిక రూపొందించింది. దీనికి జిల్లాల వారీగా పెద్ద ఎత్తున వ్యూహాన్ని రూపొందించింది.
ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ మేళం భాగ్య రావు, ఏపీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు, రెల్లి కుల పోరాట అధ్యక్షురాలు రెడ్డి రమణమ్మ, దళిత హక్కుల పరిరక్షన సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్ర, సాగే శంకర్, ఇసుకల జయరాజ్, అంగడాల పూర్ణ చంద్రరావు, వేల్పుల జ్యోతి
తథితరులు పాల్గొన్నారు.