Suryaa.co.in

Telangana

కమ్యూనిస్టులు లేకుండా మునుగోడులో గెలిచారా?

– కమ్యూనిస్టుల మద్దతు లేకుంటే, తెలంగాణలో బిజెపిని నిలవరించడం సాధ్యమయ్యేదా?
-సమస్య ఎక్కడ ఉంటే కమ్యూనిస్టులు అక్కడ
– ప్రశ్నించే ప్రతిఒక్కరూ కమ్యూనిస్టే
– హరీష్‌రావుకు కూనంనేని సూటి ప్రశ్న

అంగన్‌వాడీ కార్యకర్తలను ఉద్దేశించి సిద్దిపేటలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్‌రావు మాట్లాడుతూ కమ్యూనిస్టులను నమ్మొద్దు అంటూ వ్యాఖానించడం పట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.

కమ్యూనిస్టు పార్టీలకు మనుషులు లేరు, కార్యకర్తలు లేరు అనే వ్యాఖ్యలు కూడా చేశారని, హరీష్‌రావు గుండె మీద చెయ్యివేసి ఆ మాట చెప్పగలుగుతారా అని సాంబశివరావు ప్రశ్నించారు. కమ్యూనిస్టు కార్యకర్తలు, మనుషులు లేకుంటే మునుగోడులో ఆనాటి టిఆర్‌ఎస్‌ పార్టీ గెలువగలిగేద అని ప్రశ్నించారు.

మునుగోడు ఎన్నికల తరువాత కమ్యూనిస్టుల మద్దతుతో గెలిచామని, అప్పటి టిఆర్‌ఎస్‌ పార్టీ అధినాయకులు కృతజ్ఞతలు చెప్పిన విషయం వాస్తవం కాదా? ఆనాడు కమ్యూనిస్టుల మద్దతు లేకుంటే, ఈనాడు తెలంగాణలో బిజెపిని నిలవరించడం సాధ్యమయ్యేదా అని అన్నారు. అంగన్‌వాడీ, ఆశ వర్కర్లే కాదు, రాష్ట్రంలోని, దేశంలోని ప్రతి కార్మికుడుకి అండాదండా ఎర్రజెండా అని ఆయన అన్నారు.

ఇల్లు లేని పేదవాడి దగ్గర నుండి, భూమి లేని నిరుపేదల వరకు, విద్యార్థులు, యువజనులు, మహిళలు, రైతులు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, పాత్రికేయులు దుర్భర జీవితం గడిపే ప్రతి మనిషి వెనుకవుండి వారి కోసం పోరాడే పార్టీ కమ్యూనిస్టుపార్టీ అని అన్నారు.తెలంగాణలో ఏ గ్రామం వెళ్ళినా, ఏ నియోజకవర్గం వెళ్ళినా, ఆఖరుకు సిద్దిపేట వెళ్ళినా ఇప్పటికీ కూడా కమ్యూనిస్టులు లేని ప్రాంతం ఒక్కటైన చూపెట్టగలుగుతారా అని ప్రశ్నించారు.

డబ్బు రాజకీయాలలో కమ్యూనిస్టు పార్టీల ప్రాతినిద్యం తగ్గవచ్చునేమోగాని, కమ్యూనిస్టులు లేని సమాజాన్ని హరీష్‌రావు గారు కూడా ఊహించుకోలేరని సాంబశివరావు పేర్కొన్నారు. సమస్య ఎక్కడ ఉంటే కమ్యూనిస్టులు అక్కడ ఉంటారని, ఆ సమస్య పరిష్కారానికై ప్రశ్నిస్తారని వారు అన్నారు. ఆ విధంగా ప్రశ్నించే ప్రతిఒక్కరూ కమ్యూనిస్టే అని కూనంనేని పేర్కొన్నారు.

LEAVE A RESPONSE