హైదరాబాద్: కేపీహెచ్‌బీలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తూ విష్ణువర్ధన్ (31) గుండెపోటుతో మృతి చెందాడు. తమ కళ్లముందే ప్రదక్షిణలు చేసిన యువకుడు అంతలోనే మృతి చెందడంతో, భక్తులు విషాదంలో మునిగిపోయారు. సత్యసాయి జిల్లా కదిరికి చెందిన విష్ణువర్ధన్ హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.
ఉదయం 8.30 గంటల సమయంలో ఆలయానికి వచ్చిన విష్ణువర్ధన్ ప్రదక్షిణలు చేస్తుండగా గుండెలో నొప్పి రావడంతో ఆలయంలోని స్తంభాన్ని పట్టుకుని, కుప్పకూలిపోయాడు. అది చూసిన భక్తులు సీపీఆర్ చేసి, ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న అత్యవసర వైద్య సిబ్బంది, ఘటనా స్థలానికి చేరుకునే సరికే విష్ణువర్ధన్ మృతి చెందాడు.