Suryaa.co.in

Andhra Pradesh

కమర్షియల్ నష్టాలను తగ్గించేందుకు డిస్కమ్ లు దృష్టి పెట్టాలి

– వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించాలన్నదే సీఎం గారి లక్ష్యం
– సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా అందుకు 7వేల మెగావాట్ల విద్యుత్
– ప్రత్యేక డిస్కమ్ ద్వారా వ్యవసాయానికి విద్యుత్
– రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల మంది రైతన్నలకు మేలు
– చంద్రబాబు హయాంలో విద్యుత్ రంగాన్ని అప్పుల పాలు చేశారు
– అధిక రేట్లకు ప్రైవేటు సంస్థలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేశారు
– ఈ ఒప్పందాలతో రాష్ట్ర విద్యుత్ రంగం దివాళా తీసింది
– సీఎం వైయస్ జగన్ నిర్ణయాల వల్ల విద్యుత్ రంగంలో రూ.4925 కోట్ల మేర ప్రజాధనం ఆదా
– విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు పకడ్బందీ చర్యలు
– సచివాలయంలో డిస్కమ్ అధికారులతో ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష

అమరావతి: పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (డిస్కం ) ల్లో కమర్షియల్ నష్టాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని మూడో బ్లాక్ లో ఎపి పవర్ కోఆర్డినేషన్ కమిటీ (ఎపిపిసిసి), ఎపి సదరన్, సెంట్రల్, ఈస్ట్రన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల సిఎండిలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డిస్కంల పరిధిలో విద్యుత్ నష్టాలు, దుబారా నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అలాగే విద్యుత్ చౌర్యం ను పూర్తిస్థాయిలో అరికట్టాలని సూచించారు . బొగ్గుసరఫరాలో కొరత కారణంగా ప్రస్తుతం థర్మల్ విద్యుత్ కేంద్రాలు పూర్తిస్థాయిలో విద్యుత్ ను ఉత్పత్తి చేయలేకపోతున్నాయని, దీనివల్ల కొంతమేర విద్యుత్ సరఫరాలో ఆంతరాయాలు ఏర్పడుతున్నాయని అన్నారు. ఇటువంటి సంక్షోభాలను పూర్తిగా ఎదుర్కోవడానికి విద్యుత్ రంగ అధికారులు సన్నద్దంగా ఉండాలని అన్నారు. సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వ్యవసాయరంగానికి అందించే ఉచిత విద్యుత్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని ఆదేశించారని, దాని మేరకు రైతులకు నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రైతన్నలకు అండగా నిలవాలనే లక్ష్యంతో వ్యవసాయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి చెందిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI) నుండి మొత్తం 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ ను సమీకరించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 18 లక్షల మంది రైతులకు ప్రత్యేక వ్యవసాయ డిస్కమ్ ద్వారా నాణ్యమైన విద్యుత్ ను అందించే వీలవుతుందని తెలిపారు. ప్రస్తుత డిస్కమ్ లపై ఆర్థికంగా ఎలాంటి అదనపు భారం లేకుండా రాబోయే 25 ఏళ్లపాటు పగటిపూట తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ను అందించాలనే ముందుచూపుతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

గత ప్రభుత్వ అనాలోచిత విధానాల కారణంగా ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న డిస్కం లకు చేయూత అందించడం, ఆర్థిక వెసులుబాటును కల్పించేందుకు ప్రభుత్వం గత 3 ఏళ్లలో అధిక ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. విద్యుత్ కొరత ఉన్నప్పటికీ , వ్యవసాయానికి పగటి పూట 7 గంటలు, గృహ విద్యుత్ సరఫరా కు ఢోకా లేకుండా విద్యుత్ సంస్థలు చర్యలు తీసుకోవాలని కోరారు.

నిజానికి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి విద్యుత్ రంగం తీవ్ర ఒడుదుడుకులు ఎదుర్కుంటోందని అన్నారు. తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో డిస్కం లపై ఒత్తిడి తెచ్చి, వచ్చే 25 ఏళ్లకు విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు చేయించారని, ఇలాంటి ఒప్పందాల ఫలితంగా 2014- 2019 మధ్య రాష్ట్ర విద్యుత్ రంగం పూర్తిగా దివాళా తీసిందని అన్నారు. నష్టాలు రూ 7,000 కోట్ల నుండి రూ 27,200 కోట్లకు చేరుకున్నాయని, అప్పులు రూ 31,000 కోట్ల నుంచి రూ 62,000 కోట్లకు చేరుకున్నాయని తెలిపారు. విద్యుత్ శాఖ వార్షిక ఆదాయ అవసరాలు, వ్యయం అనూహ్యంగా రూ 25,000 కోట్ల నుంచి రూ 48,000 కోట్లకు పెరిగిందని వెల్లడించారు.

2014-19 వరకు చంద్రబాబు ప్రభుత్వం 5 సంవత్సరాలలో ఏడాదికి సబ్సిడీగా సుమారు 4,000 కోట్లు చెల్లిస్తే, సీఎంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తరువాత 2019 నుండి ప్రతి సంవత్సరం 9,000 కోట్లు పైగా సబ్సిడీ భారంను ప్రభుత్వం చెల్లిస్తోందని తెలిపారు. ప్రభుత్వ బకాయిలకు గాను 2014-19 మధ్య కాలంలో కేవలం 24,165 కోట్లు మాత్రమే చెల్లించగా, మా ప్రభుత్వం 2019 నుండి 2021-22 వరకు 35,963 కోట్లు చెల్లించిందని ఆయన పేర్కొన్నారు.

తెలుగు దేశం హయాంలో మార్కెట్ లో సౌర విద్యుత్ యూనిట్ రూ 2. 44 లకు లభిస్తుంటే (బాక్డౌన్ చార్జీలతో కలిపి అయితే రూ 3.54), ఏకంగా యూనిట్ రూ 8. 09 లకు కొనుగోలు చేసేలా ఆ ప్రభుత్వం అడ్డగోలుగా ఒప్పందాలు చేసుకుందని విమర్శించారు. ఇలాంటి తప్పుడు చర్యల ఫలితంగా, డిసెంబర్ 31, 2019 నాటికీ డిస్కాములు రూ 29,000 కోట్లకు పైగా నష్టాలలో కూరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ఉత్పత్తి దారులకు అప్పటికి మరో రూ 20,000 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని, రెవిన్యూ గ్యాప్ రూ 3,000 కోట్ల నుంచి రూ. 7,000 కోట్లకు పెరిగిపోయిందని తెలిపారు. ఈ విధంగా అధిక రేట్లకు పవన, సౌర విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల రాబోయే 25 ఏళ్లలో ఏటా రూ 3,500 కోట్లు రాష్ట్రం అదనంగా వ్యయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.

రాష్ట్ర విభజన నాటికీ APPDCL(ఆంధ్ర ప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ ) నిర్వహణ కు సంబందించి ఎలాంటి రుణాలు లేవని, అయితే 2014-19 మధ్య కాలంలో , రూ. 6000 కోట్ల మేర నిర్వహణ రుణాలు (OpEx) తీసుకోవటం జరిగిందని అన్నారు. అలాగే కాపిటల్ రుణాలు రాష్ట్ర విభజన నాటికీ రూ. 7839.60 కోట్లు కాగా 2019 మార్చ్ 31 నాటికీ రూ.13253.68 కోట్లకు చేరాయని అన్నారు.

ప్రస్తుతం APPDCL మొత్తం కాపిటల్ రుణాలు ఈ ఏడాది మార్చ్ 31 నాటికీ రూ 14159. 66 కోట్లు కాగా, నిర్వహణ రుణాలు మొత్తం రూ 5469. 36 కోట్లకు చేరాయని తెలిపారు . ఈ విధంగా చంద్రబాబు హయాంలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా అప్పులపాలు చేసి, చేతులు దులుపుకున్నారని ఆరోపించారు.

ఈ మూడేళ్ళ కాలంలో రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకున్నారని అన్నారు. విద్యుత్ రంగంలో జరుగుతున్న దుబారా, దోపిడీ అరికట్టి గత మూడేళ్ళ లో విద్యుత్ కొనుగోళ్ల , ఉత్తమ యాజమాన్య విధానాల ద్వారా దాదాపు రూ. 4925 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేయటం జరిగిందని తెలిపారు. 24 గంటలు నిరంతర నాణ్యమైన విద్యుత్తును అందించడంలో భాగంగా విద్యుత్ సంస్థలు 2019-20 సంవత్సరంలో 3,393 మిలియన్ యూనిట్లు , అలాగే 2020-21 లో మరో 8,890 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసాయని, రాష్ట్రంలో అప్పటివరకు కొనుగోలు చేస్తున్న విద్యుత్ ఖరీదు సరాసరి యూనిట్ రూ 4.02/- కాగా, మా ప్రభుత్వం బహిరంగ మార్కెట్ ద్వారా సరాసరి యూనిట్ రూ 3.59/- లకే కొనుగోలు చేయగలిగిందని తెలిపారు.

గత తెలుగు దేశం ప్రభుత్వ సంస్కరణలు విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసాయని, ప్రైవేటు కంపెనీలతో అడ్డగోలుగా చేసుకున్న చీకటి ఒప్పందాల వల్ల డిస్కాములు రూ 20 వేల కోట్లకు పైగా అప్పులోమునిగిపోయాయని అన్నారు. కరోనా సంక్షోభంలో కూడా ప్రైవేటు సంస్థల నుంచి కరెంటు తీసుకోకపోయినా, ఒప్పందాల వల్ల వాటికి వందల కోట్లు రూపాయిలు స్థిర చార్జీలు రూపంలో చెల్లింపులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. యూనిట్ రూ. 2 కు దొరికే కరెంటు ను చంద్రబాబు ప్రభుత్వం తమకు నచ్చిన కంపెనీల నుంచి యూనిట్ రూ. 8 కు కొనడం ద్వారా ప్రజల నెత్తిన భారీ భారాన్ని మోపిందని అన్నారు. ఈ అవకతవకలను సరిచేసేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని, అధికారులు సైతం అందుకు పూర్తి సహకారాన్ని అందించాలని కోరారు.

ఈ సమీక్షా సమావేశంలో ఇంధనశాఖ కార్యదర్శి బి.శ్రీధర్, ట్రాన్స్ కో జెఎండి ఐ. పృథ్వితేజ్, డిస్క్ం సిఎండిలు, హెచ్ హరనాథ రావు , జె పద్మ జనార్ధన రెడ్డి , కే సంతోష రావు , డైరెక్టర్ ఫైనాన్స్ , కే ముథుపాండియన్ తదితర అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE