Suryaa.co.in

Editorial

కిషన్‌రెడ్డి తప్పులో కాలేశారా?

– టీడీపీ మద్దతు స్వచ్ఛందమేనన్న కిషన్‌రెడ్డి
– బీజేపీ మద్దతుకోరలేదన్న పరోక్ష వ్యాఖ్యలు
– సోమవారమే బాబుతో మాట్లాడిన అమిత్‌షా
– కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు వైసీపీ మెప్పుకోసమేనా?
– కిషన్‌రెడ్డి తీరుపై టీడీపీ నేతల అసంతృప్తి
– సత్య వ్యాఖ్యలపై స్పందించిన కేంద్రమంత్రి షెకావత్
– మరి ఇప్పుడూ షెకావత్ స్పందిస్తారా? లేదా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు మద్దతు వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో ఒక వివాదంగా మారింది. అధికార వైసీపీ మద్దతును తమ పార్టీ కోరలేదంటూ ఇటీవలే వ్యాఖ్యానించిన, బీజేపీ జాతీయ కార్యదర్శి satyakumar-kishanreddyసత్యకుమార్ వ్యాఖ్యలను కేంద్రమంత్రి షెకావత్ త్రోసిపుచ్చారు. ఈ వ్యవహారం సర్దుమణగకముందే.. తెలుగురాష్ట్రాల్లో ముర్ముకు ఎక్కువ ఓట్లు తెచ్చిపెట్టేందుకు బాధ్యతలు తీసుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన మరో వ్యాఖ్య కూడా, వివాదమయ్యే ప్రమాదం ఏర్పడింది. ‘టీడీపీ మద్దతు స్వచ్ఛందమే’నంటూ కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా.. టీడీపీ మద్దతు బీజేపీ కోరలేదన్న అభిప్రాయం ఏర్పడేందుకు అవకాశం ఏర్పడింది. ఇది చివరకు ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు.. కేంద్రమంత్రి షెకావత్‌కు పితలాటకంగా పరిణమించింది. సత్యకుమార్ వ్యాఖ్యలు ఖండించిన షెకావత్, ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలే చేసిన కిషన్‌రెడ్డి విషయంలో స్పందిస్తారా? లేదా? అన్న అంశం ఆసక్తికరంగా మారింది.

తనను గెలిపించాలంటూ ఆంధ్రాలో కాలుబెట్టిన ద్రౌపది ముర్ము పర్యటన లక్ష్యం దాదాపు నెరవేరినట్లే. అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీ ఓట్లన్నీ గంపగుత్తగా ఆమెకే పోలవుతాయన్న విషయం స్పష్టమయిపోయింది. కారణాలేమైనా.. అటు సీఎం జగన్, ఇటు ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇద్దరూ ఎన్డీఏకు చేయెత్తి జైకొట్టారు. ఆ మేరకు బీజేపీ నాయకత్వం వారిద్దరిపై, తన పలుకుబడి బాగానే వినియోగించినట్లు అర్ధమవుతూనే ఉంది.

అయితే.. ఈ మొత్తం జైత్రయాత్రలో రెండు చేదు పరిణామాలు చోటుచేసుకున్నాయి. అందులో ఇద్దరు బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వైసీపీ మద్దతు తాము కోరలేదని, తమ దృష్టిలో అది అంటరాని పార్టీనే అంటూ బీజేపీ కార్యదర్శి సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు దుమారం సృష్టించగా, కేంద్రమంత్రి షెకావత్ దిద్దుబాటుకు దిగారు. తాము జగన్‌తో మాట్లాడి మద్దతు కోరామని షెకావత్ స్పష్టత ఇవ్వడంతో, ఆ వివాదానికి తెరపడింది. ఆరకంగా వైసీపీ మద్దతు కోరినా, కోరకపోయినా.. ముర్మును గెలిపించేందుకు వేసిన కమిటీకి కన్వీనర్ అయిన షెకావత్ తన పెద్దరికం నిలబెట్టుకోవాల్సి వచ్చింది.

ఆ వివాదానికి అలా తెరపడిందో, లేదో.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మరో కొత్త వివాదానికి తెరలేపారు. ‘టీడీపీ స్వచ్ఛందంగా మద్దతునిచ్చి’ందంటూ ఆయన చేసిన వ్యాఖ్య, టీడీపీని రాజకీయంగా గాయపరిచింది. నిజానికి ముర్ము పర్యటనకు ఒకరోజు ముందు ఎన్డీఏ అభ్యర్ధికి టీడీపీ మద్దతు ప్రకటించింది.

తాజాగా కిషన్‌రెడ్డి వ్యాఖ్యల తర్వాత.. సోషల్‌మీడియాలో టీడీపీపై, వైసీపీ వర్గం ట్రోలింగ్ మొదలయింది. టీడీపీ తనను కోరకుండానే బీజేపీకి మద్దతునిచ్చిందని కొందరు, బీజేపీ ప్రాపకం కోసం టీడీపీ తెగ పాకులాడుతోందన్నది దాని సారాంశం.

సహజంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధికి అందరి ఓట్లూ కావాలి. ఫలానా వాళ్లు తమకు ఓట్లు వేయరని తెలిసినా, హుందాతనం కోసం అభ్యర్ధులు వారి వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్ధిస్తారు. ఇది రాష్ట్రపతి నుంచి సర్పంచ్ ఎన్నికల వరకూ ఎక్కడైనా జరిగేదే. అలాంటిది.. బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు కోసం విపక్షాల ఓటు అడగకుండా ఎందుకు ఉంటుంది? పైగా వైసీపీ-టీడీపీతో బీజేపీకి ఎలాంటి వైరం లేదు. రెండు పార్టీలూ తన ప్రాపకం కోసం పరితపిస్తున్న వాస్తవం బీజేపీకీ తెలుసు. కాబట్టి అదే పద్ధతిలో అటు జగన్‌ను, ఇటు చంద్రబాబును అభ్యర్ధించింది. అందులో తప్పుపట్టాల్సిన పనిలేదు.

తాజాగా టీడీపీ ఓట్ల కోసం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సోమవారం ఉదయమే, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఫోన్ చేసినట్లు బీజేపీ వర్గాల సమాచారం. ఒకవేళ కిషన్‌రెడ్డి చెప్పినట్లు టీడీపీ మద్దతు స్వచ్ఛందమే అయితే.. ఆ పార్టీ మద్దతు బీజేపీ కోరలేదన్నదే నిజమయితే.. టీడీపీ విజయవాడ హోటల్‌లో నిర్వహించిన సమావేశానికి, రాష్ట్రపతి అభ్యర్ధి హాజరుకావలసిన అవసరం లేదు. అదే సమయంలో వైసీపీ మద్దతు కోరలేదన్నదే నిజమైతే, ఆ పార్టీ సికె కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి ముర్ము వెళ్లాల్సిన పనిలేదు. అంతకంటే ముందు, సీఎం జగన్ ఇంటికి వెళ్లాల్సిన అవసరం అంతకంటే ఉండదు. ఇవన్నీ కొద్దిగా స్పృహ ఉన్న వారికెవరికయినా అర్ధమయి తీరాలి.

కానీ, తమ పార్టీని గెలిపించే పొలిటికల్ పౌరోహిత్యం చేస్తున్న కిషన్‌రెడ్డి.. టీడీపీ మద్దతు స్వచ్ఛందమంటూ వ్యాఖ్యానించడమే ఆశ్చర్యం. వీలున్నంతవరకూ ప్రత్యర్ధుల మనసు గెలవాల్సిన అభ్యర్ధులు- వారి మద్దతుదారులు, ఈ విధంగా విరక్తి కలిగించే వ్యాఖ్యలు చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. మొన్న సత్యకుమార్‌పై వైసీపీ ఫిర్యాదు చేసినట్లు, రేపు టీడీపీ కూడా కిషన్‌రెడ్డిపై ఫిర్యాదు చేస్తే.. యధావిథిగా షెకావత్ కూడా సత్యకుమార్ అంశంలో మాదిరిగా స్పందించి, కిషన్‌రెడ్డి వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని ప్రకటిస్తే, అప్పుడు ‘అమాయక పుష్పం’ అయ్యేదెవరన్నది ప్రశ్న.

shekhavathనిజంగానే రేపు ఇదే అంశంపై టీడీపీ కిషన్‌రెడ్డిపై ఫిర్యాదు చేస్తే… అప్పుడు కూడా షెకావత్ రంగంలోకి దిగి, అవి కిషన్‌రెడ్డి వ్యక్తిగత వ్యాఖ్యలని ఖండిచడంతోపాటు, మా పార్టీ నాయకత్వం చంద్రబాబుతో మాట్లాడారని చెబుతారా? లేక 23 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలున్న పార్టీ కాబట్టి.. కిషన్‌రెడ్డి వ్యాఖ్యలకు ఖండించకుండా లైట్ తీసుకుంటారో చూడాలి. ఒకవేళ షెకావత్ స్పందిస్తే, టీడీపీ ఓట్లు కూడా తమకు అవసరం అన్న సంకేతాలు పంపిస్తాయి. మౌనంగా ఉంటే టీడీపీ మద్దతు తమకు లేకపోయినా ఫర్వాలేదన్న విషయం స్పష్టమవుతుంది.

బహుశా కిషన్‌రెడ్డి కూడా, వైసీపీ కళ్లలో మెరుపులు చూడాలన్న ఆశతోనే ఈ వ్యాఖ్యలు చేసినట్లుందన్న చర్చ టీడీపీ-బీజేపీ వర్గాల్లో జరుగుతోంది. ‘అసలు ముర్ముతో మా పార్టీ భేటీ కాకూడదని వైసీపీ నాయకత్వం మొదటినుంచీ ప్రయత్నించింది. చివరకు ఎయిర్‌పోర్టులోనే ఆమెతో భేటీ ముగించాలని ఒత్తిళ్లు చేశారు. సోమవారం ఉదయమే కేంద్రహోంమంత్రి అమిత్‌షా గారు బాబు గారికి ఫోన్ చేసి, మద్దతు కోరారు. అందుకు బాబు అంగీకరించారు. అప్పుడే ముర్ము పరిచయ కార్యక్రమం ఖరారయింది. బహుశా బాబు గారికి అమిత్‌షా గారు ఫోన్ చేసిన విషయం కిషన్‌రెడ్డికి తెలిసి ఉండకపోవచ్చు. ఒకవేళ మా పార్టీకి బీజేపీ నేతలు ఫోన్ చేయకపోయినా, ఓట్ల కోసం వచ్చినప్పుడు కనీస గౌరవం కోసమయినా తమ పార్టీ కోరగానే అంగీకరించినందుకు కృతజ్ఞతలని చెప్పడం రాజనీతి. లౌక్యం కూడా. కానీ కిషన్‌రెడ్డి ఇవేమీ చేయకుండా, టీడీపీ స్వచ్ఛందంగా మద్దతునిస్తుందని ప్రకటించి మమ్మల్ని అవమానించే ప్రయత్నం చేశారు. కిషన్‌రెడ్డి ఎవరి కోసం పనిచేస్తున్నారో, ఎవరి మెప్పు కోసం ప్రయత్నిస్తున్నారో మొన్నటి భీమవరం ప్రధాని టూరు చూస్తే స్పష్టమవుతుంద’ని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడొకరు వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE