Suryaa.co.in

Editorial

వైసీపీలో ‘కాపు’తున్న అసమ్మతి!

– కాపు నేతల విమర్శలపై వైసీపీలో అసంతృప్తి
– సొంత కులం వారితో విమర్శలెందుకు?
– పదవులు తీసుకున్న రెడ్లతో మాట్లాడించరేం?
– ‘టీడీపీ ఫార్ములా’తో ప్రమాదమంటున్న సీనియర్లు
– కాపుల దృష్టిలో ముద్దాయిలం అవుతున్నామన్న ఆవేదన
( మార్తి సుబ్రహ్మణ్యం)
జనసేనాధిపతి పవన్ కల్యాణ్‌పై వైసీపీకి చెందిన కాపు నేతలు చేస్తున్న విమర్శలపై కాపు సంఘాలు కన్నెర్ర చేస్తున్నాయి. వైసీపీ నాయకత్వం తమవేలితోనే తమ కంటిని పొడిపించే రాజకీయ వ్యూహం ఫలితంగా.. సొంత సామాజికవర్గంలో తాము ముద్దాయిలుగా నిలబడాల్సిన దుస్థితి ఏర్పడిందని, అటు వైసీపీ కాపు నేతలు కూడా అంతర్మథనం చెందుతున్నారు. ఇప్పటివరకూ టీడీపీ అనుసరిస్తున్న ఇలాంటి ఫార్ములాను తమ పార్టీ కూడా పాటిస్తుండటం వల్ల, కుల ప్రయోజనాలకు నష్టం వాటిల్లే ప్రమాదం తలెత్తిందని, వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు వందల సంఖ్యలో ప్రయోజనం ఉన్న పదవులిచ్చిన రెడ్డి వర్గ నేతలను విడిచిపెట్టి, తమ కులం నేతలపై తమతో తిట్టించడం ఏమిటన్న ఆగ్రహం వైసీపీ కాపు నేతల్లో వ్యక్తమవుతోంది.
జనసేన చీఫ్ పవన్‌పై ఇప్పటిదాకా కాపు వర్గానికి చెందిన మంత్రి పేర్ని నాని, కురసాల కన్నబాబు,అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే అంబటి రాంబాబు, కాపు కార్పొరేషన్ చెర్మన్ అడపా శేషు వంటి వైసీపీ నేతలను ఉసిగొల్పిన వైనం, కాపు సంఘాల ఆగ్రహానికి కారణమవుతోంది. కాపు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై కాపునాడు ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు మాజీ మంత్రి చేగొండి హరిరామయ్య జోగయ్య సారధ్యంలోని కాపు సంక్షేమ సేన సైతం.. పవన్‌ను మంత్రులు-కాపు ఎమ్మెల్యేలు తిట్టడం వెనుక సీఎం జగన్ ప్రోత్సాహం ఉందని ఆరోపించారు. దీని పర్యవసానం అనుభవించక తప్పదని జోగయ్య సీఎంను హెచ్చరించారు.
అయితే కాపు నేత అయిన పవన్‌పై.. అదే కాపు వర్గానికి చెందిన నేతలను ఉసిగొల్పడం ద్వారా, కాపుకులం చీలిపోయిందన్న సంకేతాలకు, తమ నాయకత్వం కారణమవుతోందన్న అసంతృప్తి వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా ఇలాగే వ్యవహరించి, రాజకీయంగా భూస్థాపితం అయ్యారని కాపు నేతలు గుర్తు చేస్తున్నారు. ‘ప్రస్తుతం డ్రగ్స్ కేసు తీవ్రత తగ్గించేందుకు వైసీపీ కాపులను వాడుకుంటోంది. పవన్‌ను కాపులతో తిట్టిస్తున్న వైనం కచ్చితంగా బూమెరాంగవుతుంది. ఇప్పటికే పవన్‌ను తిడుతున్న మమ్మల్ని సొంత కులంవారే శత్రువులుగా చూస్తున్నారు. కావాలంటే దీనిపై వైసీపీ కాపు నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఏమనుకుంటున్నారో ఇంటెలిజన్స్‌తో నివేదికలు తెప్పించుకోమనండి. ఆదాయం వచ్చే 900కి పైగా పదవులు ఇచ్చిన రెడ్లతో కాకుండా, కాపులతో పవన్‌ను తిట్టించడం అంటే కాపులను చీల్చడమే. కానీ కాపులు అంత అమాయకులు కాదు. మాకూ మాకూ జగన్ కొట్లాట పెడుతున్నారన్న సంకేతం ఇప్పటికే క్షేత్రస్థాయిలోని కాపులకు వెళ్లింది’ అని కాపునాడు సీనియర్ నేత ఒకరు విశ్లేషించారు.
అటు వైసీపీలోని కాపు నేతలకూ ఈ వ్యవహారం ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చిన చందంగా మారింది. పవన్‌పై ప్రకటనలు ఇచ్చిన వెంటనే.. తమ నియోజకవర్గంలోని కాపులు తమకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, తామేమీ చేయలేని దుస్థితిలో ఉన్నామని వాపోతున్నారు. సోషల్‌మీడియాలో తమ వీడియోల


కింద, తమను అసభ్యంగా దూషిస్తున్నా ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నామని చెబుతున్నారు. ‘మాకు పార్టీ నుంచి నోట్ వస్తుంది. మేం అదే చదువుతున్నాం. మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా పార్టీ ఆదేశం పాటించాల్సిందే. ఇక్కడేమో మా కాపు కుర్రవాళ్లంతా మాపై బూతులు లంకించుకుంటున్నారు. మేం పవన్‌ను తిట్టిన ప్రతిసారీ స్థానికంగా ఈ బాధ తప్పడం లేదు. ఎన్నికల్లో కాపులు ఎటు ఓటు వేసినా, పవన్‌ను తిడుతుంటే మాత్రం తమనే తిట్టినంత ఫీలవుతున్నారు. ఇలాంటి పరిస్థితి మాకు ప్రజారాజ్యం స్థాపించినప్పుడు, కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కనిపించింద’ని వైసీపీకి చెందిన సీనియర్ నేత విశ్లేషించారు.
అయితే.. పవన్‌ను రెడ్డి వర్గ నేతలతో తిట్టించకుండా, తమతో తిట్టించడం వల్ల తామంతా సొంత కులం వారికి శత్రువులుగా- రెడ్లు మిత్రులుగా మారుతున్న విచిత్ర పరిస్థితి ఏర్పడిందని వైసీపీలోని కాపు నేతలు చెబుతున్నారు. ‘ఇప్పటిదాకా ఒక్క రెడ్డి మంత్రిగానీ, రెడ్డి ఎమ్మెల్యేగానీ పవన్‌ను విమర్శించలేదు. కమ్మకులానికి చెందిన మంత్రి కొడాలి నాని, ఎస్సీకి చెందిన మేకతోటి సుచరిత, బీసీకి చెందిన ఎమ్మెల్యే పార్దసారధి వంటి రెడ్డేతర మంత్రులు-ఎమ్మెల్యేలు మాత్రమే పవన్‌ను విమర్శించారు తప్ప, ఇప్పటివరకూ ఒక్క రెడ్డి నేత కూడా స్పందించలేదు. అంటే ఏమిటి? రెడ్లు, బీసీలు, ఎస్సీ నేతలు మంచివాళ్లు. సొంత కాపులేమో పవన్‌కు శత్రువులన్నట్లు జరుగుతున్న ఈ రాజకీయ డ్రామాలతో అంతిమంగా కాపులే నష్టపోతున్నార’ని ఓ వైసీపీ నేత ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా..ఒకవైపు తమ పార్టీ కాపు నేతలంతా, మూకుమ్మడిగా ఎదురుదాడి చేస్తున్న నేపథ్యంలో.. పవన్ గురించి మాట్లాడటం సమయం వృధా అంటూ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు, వైసీపీలోని కాపు నేతల్లో చర్చనీయాంశమయింది. చంద్రబాబు నాయుడును మాత్రమే విమర్శించిన శ్రీకాంత్‌రెడ్డి, జనసేన అధినేత పవన్ తీరు గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు.. ‘పవన్ గురించి మాట్లాడటం టైం వేస్ట్. చంద్రబాబు పంపించిన స్క్రిప్టునే పవన్-మనోహన్ చదువుతున్నారని’ వ్యాఖ్యానించారు. ఈ వైఖరి పవన్‌పై రెడ్డినేతల ఎత్తుగడ – వైసీపీ నాయకత్వం వ్యూహం ఏమిటన్నది స్పష్టం చేసిందని వైసీపీ కాపు నేతలు చెబుతున్నారు.

LEAVE A RESPONSE