Suryaa.co.in

Devotional

దివ్యత్వం

ఎటువంటి మనిషైనా ఈ భూమ్మీదకు వచ్చి , ఉత్తి చేతులతో తిరిగి వెళ్ళకూడదు. కొద్దో గొప్పో దివ్య శక్తి సంపన్నుడు కావాలి. ఆ శక్తిని ఆత్మలో నిక్షిప్తం చేసి తిరుగు పయనం కావాలి. అదే అతడి శాశ్వత సంపద. వేదాలు పదేపదే చెప్పే విషయం.
దేవుడు, మనిషిని పూర్తిగా తన పనిలో ఉంచుకోవాలని నిత్యం అనుకుంటాడు. మనిషి తాను శరీరం తప్ప మరేమీ కాదన్న భ్రమలో ఉంటూ దేవుడికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు.
శరీరం ఒక ఊబి అంటాడు అరవిందుడు. అందులో కూరుకుపోతే బయటకు రావడం చాలా కష్టం. ఎన్నో జన్మలు అందులోనే ఉన్నాం. ఇప్పుడైనా శరీరాన్ని(శరీర భావాన్ని) వదిలి ఆత్మ వైపు తిరగడం అత్యవసరమని మనిషి గ్రహించిన రోజునే అతడు దివ్యశక్తి సంపన్నుడవుతాడు.
ఏ అవకరం లేని, ఆరోగ్యవంతమైన శరీరాన్ని తల్లిదండ్రులు ఇచ్చారు. ఈ శరీరం నాదని సంతోషంగా చెప్పుకొంటున్నాం. ఈ శరీరాన్ని మనకు ఇచ్చినందుకు ప్రతిఫలంగా వారికి మనం ఏం ఇవ్వాలి? మా పని మేం చేశాం, నీ ధర్మం నువ్వు నెరవేర్చు- అన్నట్లుగా ఉంటుంది ఈ భూమ్మీద మనిషి జన్మ రహస్యం.
శరీరాన్ని చూసి ఆనందపడవచ్చు. అందంగా ఉన్నదైతే మురిసిపోవచ్చు. శరీరాన్ని పోషించి సుఖపెట్టవచ్చు. కాని, ఈ శరీరం దేనికి అని ఎప్పుడైనా నిజాయతీగా ప్రశ్నించుకోవాల్సిందే.
మానవ శరీరం రావడం అదృష్టం. శరీరం గురించి తెలుసుకుంటూ దాని పరిమిత భావాన్ని పోగొట్టుకోవాలి. శరీరం నేను కాదని తెలుసుకోవాలి. శరీర ప్రయోజనం తెలుసుకోవాలి. శరీర బంధం తాత్కాలికమని గ్రహించాలి.
ఈ శరీరం ఉపయోగించి ఇతరులకు సాయపడటం, లోకం కోసం మంచి పనులు చెయ్యడం మంచిదే. సందేహం లేదు. ఇలాంటి వారికి శరీరం ఎక్కువ కాలం ఉండాలి. వాళ్లు దీర్ఘాయు ష్మంతులుగా ఉండాలి.
పుట్టుక కోసం, మరణం కోసం ఈ శరీరం వచ్చినట్లు కనపడుతుంది అందరికీ. శరీరం తప్ప ఇంకేం లేదన్నట్లు బతుకుతారు కొందరు.
శరీరాన్ని ఈడుస్తూ బతుకుతారు మరికొందరు. శరీరం జడం. అది శవం లాంటిది. నీ శవాన్ని నువ్వు మోస్తూ తిరుగుతున్నావు అంటారు రమణ మహర్షి.
నీకిచ్చిన శరీరంతోనే ముక్తిని సాధించి, జీవన పరమార్థం నెరవేర్చుకోవాలి అంటున్నాయి ఉప నిషత్తులు. అందరూ ముక్తిని సాధించలేరు. ఎంతో కొంత ప్రయత్నం చేసి దివ్యశక్తి సంపన్నులయ్యే అవకాశం ఉంది అందరికీ.
జీవితాంతం ఈ శరీరంతో తిరుగుతూ ఉంటాం. దారి మార్చి, ఈ శరీరంతోనే మన అంతరంగ ప్రయాణం మొదలు పెట్టవచ్చు. అప్పుడు దివ్యశక్తి తొలకరి మొదలవుతుంది.
మనసు సారవంతమవుతుంది. కొంతకాలం తరవాత పచ్చటి ఆత్మ పంట పండుతుంది.
దయతో, ప్రేమతో మన అంతరంగ ప్రయాణానికి వాహనంగా ఇచ్చి, ఆత్మను శక్తిసంపన్నం చేసుకోవడానికి ఈశ్వరుడు ప్రసాదించిన అవకాశమే ఈ మానవ శరీరం అని బోధపడుతుంది.
దివ్యత్వం వైపు మనం వేసే ప్రతి అడుగు భగవంతుడికి ఆనందాన్ని ఇస్తూనే ఉంటుంది. మన నేత్రాలు ధ్యానం కోసం మూసినప్పుడు అంతర్నేత్రం తెరుచుకోవడం, హృదయంలో జ్ఞానకమలం వికసించడం ఆయనకు పరమానందం కలిగించే అంశాలు. ఇలాంటి దివ్యానుభవాల ఇంద్రధనుస్సు చిదాకాశంలో వెల్లివిరియాలని ఆయన అభిలాష.

LEAVE A RESPONSE