• వేసవిలో భక్తులకు ఎటు వంటి ఇబ్బందులు కలుగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలి
• సింహాచలంలో మే 3 న జరిగే చందనోత్సవ వేడులకు పట్టిష్టమైన ముందుస్తు ఏర్పాట్లు
• దేవాలయాలు అన్నింటిలో సిసి కెమేరాలు ఏర్పాటు చేసి భద్రతను పటిష్ట పర్చండి
• దేవాలయాల ప్రాంతాల్లో అధికధరలకు తినుబండారాలు,వస్తువుల విక్రయాన్నిఅరికట్టాలి
• బస్టాండ్లు,రైల్వేస్టేషన్లు,పర్యాటక ప్రాంతాల్లో ప్రముఖ దేవాలయాల వివరాల హోర్డింగులు
– ఉపముఖ్యమంత్రి, దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ
అమరావతి, ఏఫ్రిల్ 22 : రాష్ట్రంలోని పలు దేవాలయాలకు దైవ దర్శనానికి వచ్చే సాధారణ భక్తులకు ఎటు వంటి ఇబ్బందులు కల్పించవద్దని, వి.ఐ.పి.ల ప్రొటోకాల్ నెపంతో క్యూ లైన్లను ఆపే విధానానికి స్వస్తి పలకాలని ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఎగ్జిక్యూటివ్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం అమరావతి సచివాలయం నుండి రాష్ట్రంలోని పలు ప్రముఖ దేవాలయాల ఎగ్జిక్యూటివ్ అధికారులతో ఉప ముఖ్యమంత్రి వీడియో సమావేశం నిర్వహించి ప్రస్తుత వేసవిలో భక్తులకు చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, సింహాచలం, అన్నవరం, కాణిపాకం, అరసవిల్లి, విజయవాడ శ్రీ దుర్గా మల్లీశ్వర స్వామి వారి దేవస్థానం, విశాఖపట్నం శ్రీ కనక మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం తదితర దేవాలయాల్లో ప్రస్తుత వేసవిలో భక్తులకు చేస్తున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు, ఆయా దేవాలయాల్లో నెలకొన్న కొన్ని సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు .
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వి.ఐ.పి.ల ప్రొటోకాల్ విధానాన్ని యదావిధంగా అనుసరించాలని, అయితే ఆ సమయంలో దైవదర్శనానికి వచ్చే భక్తులకు ఎటు వంటి ఇబ్బంది కలుగకుండా యదావిధిగా దైవదర్శనాలు కొనసాగించాలన్నారు. ప్రస్తుత వేసవిలో భక్తులకు ఎటు వంటి ఇబ్బందులు కలుగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని, ఆలయ ప్రాంగణాల్లో చలువ పందిళ్లు, చలివేంద్రాలు, కార్పెట్లు, కూలర్లు, ప్యాన్లు, కూర్చునేందుకు కుర్చీలు తదితర సౌకర్యాలను కల్పించాలని ఇ.ఓ.లకు ఆయన సూచించారు.
త్రాగునీరు, మజ్జిగను ప్యాకెట్లలలో కాకుండా గ్లాసుల ద్వారా మాత్రమే సరఫరా చేస్తూ ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రిస్తూ ఆలయ ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. భక్తుల తాకిడికి అనుగుణంగా వసతి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని, ప్రత్యేకించి ఈ సమస్య శ్రీశైలంలో ఎక్కువగా ఉందని, వసతి సమస్య పరిష్కారానికి తగుచర్యలు తీసుకోవాలని ఆలయ ఇ.ఓ.ను ఆదేశించారు. ఆలయాల ప్రాంతాల్లో అధిక ధరలకు తినుబండారాలు, వస్తువుల విక్రయాన్ని అరికట్టాలని, నిర్ణీత ధరలను ఖరారు చేస్తూ అన్ని దుకాణాల వద్ద రేట్లను తెలిపే బోర్డులను ఏర్పాటు చేయించాలన్నారు.
విశాఖపట్నం నుండి రాజమండ్రి వచ్చే భక్తులు అన్నవరం శ్రీసత్యనారాయణ స్వామి వారి ప్రసాదం పొందాలంటే అన్నవరం జాతీయ రహదారిపై డివైడర్ను దాటాల్ని వస్తున్నదని, ఆ సమస్య పరిష్కారానికి ఆ మార్గంలో ఒక ప్రత్యేక ప్రసాదాల కౌంటర్ ను ఏర్పాటు చేయాలని ఆలయ ఇ.ఓ.ను ఆదేశించారు. సింహాచలంలో మే 3 న జరిగే చందనోత్సవ వేడులకు పట్టిష్టమై ముందుస్తు ఏర్పాట్లను చేయాలని ఆలయ ఇ.ఓ. ను ఆదేశించారు. చంధనోత్సవానికి సుమారు లక్షలకు పైగా భక్తులు స్వామి వారి నిజరూప ధర్శనానికి వచ్చే అవకాశం ఉన్నందున, అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లను చేయాలని ఇ.ఓ.ను ఆదేశించారు. కాణిపాకం దేవాలయం మార్గాన్ని సూచించే విధంగా జాతీయరహదారిలో హోర్డింగ్ ను ఏర్పాటు చేయాలని ఆలయ ఇ.ఓ.ను ఆదేశించారు.
దేవాలయాల్లో అగ్నిప్రమాధాలకు ఎటు వంటి ఆస్కారం లేకుండా అగ్నిమాపక శాఖ అధికారుల సహకారంతో తగు ముందుస్తు ఏర్పాట్లు చేయాలని, అగ్నిమాపక పరికరాలను, యంత్రాలను సిద్దంగా ఉంచుకోవాలన్నారు. దేవాలయాలు అన్నింటిలో సిసి కెమేరాలు ఏర్పాటు చేసి భద్రతను పటిష్ట పర్చాలని, వాటి పర్యవేక్షణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కాని పక్షంలో పోలీస్ అధికారులకు ఆ బాద్యతలు అప్పగించాలని సూచించారు. జిల్లాల వారీగా ఉన్న ప్రముఖ దేవాలయాల వివరాలు భక్తులు, పర్యాటకులకు అందరికీ తెలిసే విధంగా ఆయా ప్రాంతాల్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పర్యాటక ప్రాంతాల్లో హోర్డింగ్ లు ఏర్పాటు చేయాలని అన్ని దేవాలయాల ఇ.ఓ.ను ఆదేశించారు.
రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ మాట్లాడుతూ ప్రస్తుతం కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అన్ని దేవాలయాల్లో తీసుకోవాలని, దేవాలయాల సిబ్బంది అందరికీ కోవిడ్ వేక్సినేషన్ వేయించాలని ఇ.ఓ.లను ఆదేశించారు. అదే విధంగా కోవిడ్ వ్యాప్తి నివారణకు భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపే బోర్డులను ఆలయాల ప్రాంగణాల్లో ఏర్పాటు చేయాలన్నారు.
రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు చంద్రకుమార్, ఆజాద్, సూర్యారావు తో పాటు అన్ని ప్రముఖ దేవాలయాల ఎగ్జిక్యూటివ్ అధికారులు ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు.