-పార్టీ మారే వాళ్లకు మీ తీర్పు గుణపాఠం కావాలి
-నకిరేకల్ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
ఉద్యమ సమయంలో పదవులను పూచిక పుల్లలా విసిరేశామని కేసీఆర్ చెబుతున్నాడని.. నిజానికి పదవులు విసిరినట్లే విసిరి.. ఎలక్షన్లు, కలెక్షన్లు, సెలెక్షన్ల పేరుతో ఆస్తులను దోచుకున్నారని, రాజీనామా తర్వాత కూడా పదవులు వారే తీసుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. అదే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉద్యమం కోసం తన మంత్రి పదవిని విసిరేసి.. తిరిగి ఆ పదవికి తీసుకోలేదన్నారు. పార్టీ ఫిరాయించిన పన్నెండు మందిని అసెంబ్లీ గేటును తాకనివ్వవద్దని రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ మారే వాళ్లకు మీ తీర్పు గుణపాఠం కావాలని కోరారు.
శుక్రవారం నకిరేకల్‌లో నిర్వహించిన విజయభేరి సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన గడ్డ నల్గొండ అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల శ్రమతో గెలిచిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పార్టీ ఫిరాయించి.. దొరల గడిల దగ్గర కాపల కుక్కలా మారారని విరుచుకుపడ్డారు.
పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు తాకనివ్వద్దని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. లక్షా 50 వేలు ఖర్చు పెట్టి మేడిగడ్డను ఇసుక మీద కట్టారని.. ఈ పనిని కేసీఆర్ మతి ఉండే కట్టారా మందేసి చేశారా అని ప్రశ్నించారు. మరో 10 కిలోమీటర్లు ఎస్ఎల్‌బీసీ టన్నెల్ తవ్వితే ఈ నల్గొండ జిల్లా సస్యశ్యామలం అయ్యేదని.. కానీ ఈ పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పని చేయలేదన్నారు. ఉమ్మడి పాలన కంటే కేసీఆర్ పాలనలోనే తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 16 మంది ముఖ్యమంత్రులు అరవై కోట్లు అప్పులు చేస్తే, కేసీఆర్ పదేళ్లలో ఆరు లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు.
కేసీఆర్ వంద రూపాయల నోటు లాంటి వాడని కేటీఆర్ చెబుతున్నాడు. కేసీఆర్ వంద నోటు లాంటి వాడు కాదు దొంగ నోటు లాంటి వాడని రేవంత్ రెడ్డి కౌంటర్ వేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ అడ్డ అని ఇక్కడ బీఆర్ఎస్ గెలవకూడదన్నారు. ఇక్కడ ఉన్న బలమైన కార్యకర్తలు కాంగ్రెస్ కు మరెక్కడా లేరన్నారు. వెయ్యి ఏనుగుల బలంతో డిసెంబరు 3న కల్వకుంట్ల కేసీఆర్ ను బొందపెట్టడం ఖాయమని చెబుతున్నామని అన్నారు.
తెలంగాణలో పదేళ్లుగా ఉద్యోగాలు ఖాళీ భర్తీ చేయలేదని, రెండు లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉన్నా కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని అన్నారు. కేసీఆర్ నౌకరీ ఊడగొట్టే బాధ్యత యువకులదేనని, ఇందిరమ్మ రాజ్యం తెచ్చేందుకు మీరు సహకరించాలని కోరారు.