Suryaa.co.in

Andhra Pradesh

అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కులాలను రెచ్చగొడతారా?

  • జోగి రమేష్ పై మంత్రి అనగాని ఫైర్

  • అమర్నాథ్ గౌడ్ ను చంపేసినప్పుడు కులం గుర్తకు రాలేదా?

  • బీసీల అభ్యున్నతికి జోగి కుటుంబం చేసింది శూన్యం

  • రెడ్ బుక్ తెరిస్తే వైసీపీ నేతలు రాష్ట్రంలో తిరగగలరా?

అమరావతి: తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు మాజీ మంత్రి జోగీ రమేష్ కులాలను రెచ్చగొట్టేలా మాట్లాడడం సరైంది కాదని రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం అమరావతిలోని సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అగ్రీగోల్డ్ భూముల కుంభకోణంలో జోగీ కుటుంబం పాత్రపై పూర్తి ఆధారాలు ఉన్నాయని చెప్పారు.

దాదాపు ఐదు కోట్ల రూపాయల ఆస్థిని జోగి కుటుంబం కాజేసిందని, దీనిపై బాధితుడు ఫిర్యాదుచేయడంతో ప్రారంభమైన విచారణలో జోగి కుటుంబం కుంభకోణానికి పాల్పడినట్లు తేలిందన్నారు. తన అవినీతి బయటపడడంతో ఏం చేయాలో అర్ధంకాక జోగి రమేష్ కులాలను రెచ్చగొడుతున్నారని అన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు 14 ఏళ్ల బాలుడు అమర్నాథ్ గౌడ్ చనిపోతే కులం కూడు పెడుతుందా అని అన్న వ్యక్తి జోగి రమేష్ అని, అదే రమేష్ ఇప్పుడు మాత్రం తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కులాల గురించి మాట్లాడుతున్నారని అన్నారు.

జోగి రమేష్ కుటుంబం బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి చేసింది శూన్యమని చెప్పారు. బీసీ సంఘాలేవీ జోగి రమేష్ కు మద్దతివ్వడం లేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడూ జోగి రమేష్ అహంకారంతో విర్రవీగారని, చంద్రబాబు ఇంటిపైకి కత్తులు, కర్రలతో దాడి చేయడానికి ప్రయత్నించారని గుర్తుచేశారు. అయినప్పటికీ తమ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించడం లేదని, జోగి రమేష్ కుటుంబం భూ అక్రమాలకు పాల్పడబట్టే వారిపై కేసు పెట్టామని చెప్పారు. ఈ వ్యవహరంలో అధికారులపై కూడా ఏసీబీ కేసు పెట్టిందని చెప్పారు. జోగీ రమేష్ భూ దాహానికి ఆయన కొడుకే బలయ్యాడని అన్నారు.

ఇప్పటికీ జోగి రమేష్ బుద్ది మారలేదని మంత్రి అనగాని అన్నారు. మీకు పిల్లలు ఉన్నారు…మాకు అవకాశం వస్తుందన్నట్లు బెదిరింపులకు పాల్పడుతున్నారని, వైసీపీ నేతల వైఖరే అలాంటిదని, కానీ వారి బెదిరింపులకు ఎవ్వరూ భయపడేది లేదన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అని జోగి రమేష్ మాట్లాడుతున్నారని, నిజంగా రెడ్ బుక్ తెరిస్తే వైసీపీ నేతలు రాష్ట్రంలో తిరగగలరా అని ప్రశ్నించారు.

తమ ప్రభుత్వం చట్ట ప్రకారమే పరిపాలన సాగిస్తుందని, ప్రతీకార రాజకీయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ ప్రోత్సహించరని అన్నారు. తమ ప్రభుత్వం తప్పు చేసిన వారిని కచ్చితంగా శిక్షిస్తుందని, బాధితులకు అండగా నిలబడి న్యాయం చేస్తుందని చెప్పారు.

LEAVE A RESPONSE