ఎంపీ రఘురామకృష్ణం రాజు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు తెలిపారు. తమ పార్టీని ఉగ్రవాద సంస్థతో పవన్ కళ్యాణ్ పోల్చడం కాసింత బాధనిపించినప్పటికీ, ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఉద్దేశించి తమ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే సోదరుడు చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే పవన్ వ్యాఖ్యలు కరెక్టేనేమో అనిపిస్తుందని అన్నారు. చంద్రబాబును గతంలోనే లేపేసే వాళ్ళమని, లోకేష్ ను కావాలంటే ఇప్పుడు లేపేస్తామన్న ఎమ్మెల్యే సోదరుడి వ్యాఖ్యలు ఉగ్రవాద సంస్థల ప్రతినిధులు చేసే వ్యాఖ్యలకు దగ్గరగా ఉన్నాయన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఎటువంటి తప్పు లేదనే తాను భావిస్తున్నానని పేర్కొన్నారు. సోమవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై పోరాటానికి తనకు ఎవరి పర్మిషన్ అక్కరలేదని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తన మనసుదోచాయన్నారు. రోడ్ మ్యాప్, గూగుల్ మ్యాప్ అడిగారని… పవన్ కళ్యాణ్ ను ఒక బానిస లాగా భావించి ఆయన తమ మాట వినాల్సిందేనని కొంతమంది నాయకులు తమకు తోచినట్లు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
కేంద్ర బిజెపి నాయకత్వం పవన్ కళ్యాణ్ తో ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తుందని, ప్రధానమంత్రి మోడీ సైతం 40 నిమిషాల పాటు సమయాన్ని కేటాయించి ఆయన తో చర్చించారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ దమననీతి పై పోరాడడానికి తనకు ఎవరి అనుమతి అక్కర్లేదని పవన్ కళ్యాణ్ పేర్కొనడం ద్వారా ప్రజలకు తన వైఖరి పై ఆయన మరింత స్పష్టత ఇచ్చినట్లు అయిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలను గెలుచుకోవడానికి తాము నోట్లో ఏమైనా వేలేసుకొని కూర్చున్నామా? అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సమంజసమేనని పేర్కొన్నారు. జనసేన ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రౌడీ సేనగా పోల్చడంపై పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు బాగుందని అభినందించారు. రౌడీలపై పోరాడే వాళ్లను విప్లవసేన అంటారని… తమది విప్లవసేన అని పవన్ కళ్యాణ్ అభివర్ణించిన తీరును రఘురామ కృష్ణంరాజు కొనియాడారు. పవన్ కళ్యాణ్ కేవలం ఒక వర్గానికి చెందిన నాయకుడిగా పరిమితం చేయడానికి తమ పార్టీ నాయకత్వం ఆరాటపడుతోందని విమర్శించారు. పవన్ కళ్యాణ్ అన్ని వర్గాలకు చెందిన నాయకుడని పేర్కొన్నారు. పవన్ ను ఆయన సామాజిక వర్గానికి చెందిన ఒక మాజీ మంత్రి వీకెండ్ పొలిటిషన్ అని సంబోధించడం పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. నెలకు ఒకసారి పరదాల మాటున, భారీకేడ్ల చాటున బుల్లెట్ ప్రూఫ్ బస్సులో వస్తున్న నాయకుడి కంటే… వారానికి, పది రోజులకొకసారి, అయినా ప్రజల మధ్యకు షంషేర్ లా పవన్ కళ్యాణ్ వస్తున్నారని గుర్తు చేశారు. ప్రజల మధ్యకు ధైర్యంగా రావడం మగతనమని, పరదాల మాటున, భారీ కేడ్ల చాటున ప్రజల మధ్యకు రావడం పేడితనం ఎద్దేవా చేశారు . కంటెంట్ ఉన్నవాడు ప్రజల మధ్యకు రోజు రావలసిన అవసరం లేదని, వారానికి ఒక్కసారి వచ్చినా చాలునని అన్నారు. మూడు వేల కిలోమీటర్లు తిరిగా… మూడు లక్షల మందికి ముద్దు పెట్టానని చెప్పుకోవడం కాదని, ప్రజలకు ఎంతగా చేరువయ్యా మన్నది ముఖ్యమన్నారు .
బాబు పర్యటనలకు అనూహ్య ప్రజాస్పందన
ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనల సందర్భంగా ప్రజల నుంచి అనూహ్య ప్రజాస్పందన లభిస్తోందని రఘురామకృష్ణం రాజు తెలిపారు . కర్నూలు, నందిగామలలో బాబు పర్యటన సందర్భంగా గంటలు, గంటలు ఆలస్యం అయినప్పటికీ… ఊర్లకు ఊర్ల ప్రజలు తరలివచ్చి ఆయన ప్రసంగాన్ని వినేందుకు ఆసక్తిని ప్రదర్శించారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభలకు బలవంతంగా ప్రజలను తరలిస్తున్నారని, ఆయన ప్రసంగం ముగిసే వరకు సభా ప్రాంగణంలోనే ఉండే విధంగా నిర్బంధిస్తున్నారన్నారు. నల్ల చున్నీలు ధరించి వచ్చిన మహిళలను, యువతులను చున్నీలు తీసి సభా ప్రాంగణంలోకి అడుగు పెట్టాలంటూ పోలీసులు అభ్యంతరకరంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత ప్రజాభిమానానికి నిదర్శనమైతే, ధైర్యానికి పవన్ కళ్యాణ్ ప్రతీక అని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతల పై నోరు పారేసుకోవడం మాని, ఆత్మ విమర్శ చేసుకోవలసిన అవసరం అధికారపక్షానికి ఉందన్నారు. గతంలో దళిత సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సుధాకర్ ను రెక్కలు విరిచి కట్టి కొట్టారన్న ఆయన, ఎంపీ నైనా తనని కూడా కాళ్లు కట్టేసి కొట్టిన విషయాన్ని గుర్తు చేశారు. వచ్చేనెల 8వ తేదీన తనని కాళ్లు కట్టేసి కొట్టిన పోలీసు అధికారులపై తాను దాఖలు చేసిన పిటీషన్ వాదనలకు రానుందని తెలిపారు. ఎన్ని వశీకరణ విద్యలు చేసినప్పటికీ న్యాయం జరగడం ఆలస్యం కావచ్చునేమో కానీ తప్పక న్యాయం గెలిచి తీరుతుంది అన్నారు . ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడుతున్న పవన్ కళ్యాణ్, ప్రతిపక్షాల ఓట్లు చీలకుండా చూస్తాననడం శుభపరిణామం అని పేర్కొన్నారు. ఈ రాష్ట్రానికి పట్టిన చీడపీడలు తొలగిపోవాలంటే కలువాల్సిన శక్తులను కలుపుకొని పోరాడాలని సూచించారు. ఒకే క్రిమిసంహారక మందు పనిచేసే పరిస్థితి లేనప్పుడు, మిశ్రమ క్రిమిసంహారక రసాయనం ద్వారా రాష్ట్రానికి పట్టిన చీడపీడలను వదిలించాలన్నారు.
అవినాష్ రెడ్డి, విజయ సాయిని విచారణకు పిలవాలని సునీత కోరాలి…
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న శివశంకర్ రెడ్డి భార్య తులసి, వైయస్ వివేకా కుటుంబ సభ్యులను విచారించాలని ఒక చెత్త పిటీషన్ గత పది నెలల క్రితం దాఖలు చేశారని రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులైన నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆయన సోదరులను సిబిఐ విచారించిందన్నారు. తన భర్త కోసం తులసి పోరాడుతున్న తీరును అభినందిస్తూనే, డాక్టర్ సునీత కూడా మరింత గట్టిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా చేర్చిన కడప ఎంపీ, వైఎస్ అవినాష్ రెడ్డిని, గుండెపోటుతో వివేకా మరణించారని తొలుత మీడియాకు చెప్పిన విజయసాయిరెడ్డిని ప్రశ్నించాలని కోరుతూ సిబిఐ కి సునీత లేఖ రాయాలని సూచించారు. ఈ హత్యకు, సాక్షి దినపత్రిక యాజమాన్యానికి సంబంధం ఉందా? అని ప్రశ్నించాలని పేర్కొన్నారు. అసెంబ్లీలో కూడా అనుమానితులను వెనుకేసుకొచ్చిన వారిని కూడా ప్రశ్నించాలని కోరాలన్నారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిజాలను నిగ్గు తేల్చేందుకు సునీత చేస్తున్నా పోరాటం అసామాన్యమైనదని అభినందిస్తూనే, అనుమానితులను ప్రశ్నించాలని సిబిఐ కోరకపోతే ఆమెను తప్పు పట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
కడప జిల్లా అధికారులనే కాదు… ఇతర జిల్లాల అధికారులకు కూడా ప్రాధాన్యత ఇవ్వండి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డిని నియమించడం పట్ల రఘురామకృష్ణం రాజు తనదైన శైలిలో అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. జవహర్ రెడ్డి సమర్ధుడైన, నిజాయితీ కలిగిన అధికారి అయినప్పటికీ, ఆయన కంటే సీనియర్లు ఎంతోమంది ఉన్నారన్నారు. 12 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను కాదని డీజీపీగా కసిరెడ్డి రాజేంద్ర నాథ్ రెడ్డిని నియమించారన్నారు. ఇక ముఖ్యమంత్రి కార్యాలయ వ్యవహారాలన్నీ మరో ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సకల శాఖామంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తున్నారని, వీరి చేతుల్లోనే రాష్ట్ర పాలనా వ్యవహారాలన్నీ కొనసాగుతున్న అన్నారు. పేరు చివరన రెండు అక్షరాలు, ఊరు చివరన మూడు అక్షరాలు ఉన్న వారికే తమ ప్రభుత్వంలో ప్రాధాన్యత లభిస్తుందని రఘురామకృష్ణం రాజు తెలిపారు . రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా గిరిధర్ అర్మనే అనే నిజాయితీపరుడైన అధికారిని నియమిస్తారని ఊహాగానాలు వినిపించినప్పుడు, అటువంటి అధికారులను తమ ప్రభుత్వం పట్టించుకోదని… అది తమ సిద్ధాంతమని తాను వెల్లడించినట్లు వివరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కలిసి ఆర్థిక నేరాభియోగాల కేసుల్లో సహా నిందితులుగా ఉన్న వారిని కీలక ప్రభుత్వ పదవులు కట్టబెడుతున్నారన్నారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీలక్ష్మి, విజయసాయిరెడ్డి, సజ్జల సోదరుడు సైతం జగన్ సహా నిందితుడే నని గుర్తు చేశారు. తనతో పాటు ఆర్థిక నేరాభియోగ కేసులలో సహా నిందితులుగా ఉన్నవారికి ప్రాజెక్టులు, పదవులు ఇవ్వడం ద్వారా ప్రజలకు మనం ఇస్తున్న సందేశం ఏమిటని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. కడప జిల్లాకు చెందిన అధికారులనే కాకుండా ఇతర జిల్లాలకు చెందిన అధికారులకు కూడా ప్రాధాన్యత కలిగిన పోస్టులు ఇవ్వాలన్నారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ అధికారులతో పాటు, మీ మతం కాని వారికి కూడా కీలక పదవులు అప్పగించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు తెలిపారు.
హైకోర్టు తీర్పుపై స్టే కు సుప్రీం నిరాకరణ…
మూడు రాజధానుల ఏర్పాటుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. నిన్న మొన్నటి వరకు అటార్నీ జనరల్ గా పనిచేసిన వ్యక్తి ని, ఇంకా పెద్ద పెద్ద న్యాయవాదులను వాదనలు వినిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించుకుందని తెలిపారు. అయినా పాలినారీమన్, శ్యామ్ దివాన్, ఆది నారాయణ రావు తమ అద్భుతమైన వాదన పటిమతో రాష్ట్ర ప్రజలను పెను ఉపద్రవం నుంచి కాపాడారని కొనియాడారు. రాష్ట్ర రాజధాని ఏర్పాటు పై అసెంబ్లీకి అధికారం లేదంట మీ లార్డ్ అంటూ… తప్పు చేసేవారు ఎన్ని అబద్ధాలే చెప్పినప్పటికీ, సుప్రీంకోర్టు స్టేకు నిరాకరించిందని తెలిపారు. కేవలం రాజధాని నిర్మాణం పైనే స్టే ఇచ్చిందని వెల్లడించారు. ఆరు నెలల వ్యవధిలో రాజధాని నిర్మాణం అసాధ్యమని, ఇది కోర్టు ధిక్కరనే అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు పేర్కొనగా… సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి అంగీకరించిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరిస్తూ తెలుగులో ఓ అంకె ఉన్న ఛానల్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చిందని వార్తా కథనం ప్రసారం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి దిక్కుమాలిన ఛానల్ ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సంక నాకుతూ… జర్నలిజం ముసుగు తొడుక్కోవడం ఎందుకని ప్రశ్నించారు. కాంట్రాక్టు పనులు చేసుకోవాలని సూచించారు. అంతేకానీ జర్నలిజం విలువలు దిగజార్చవద్దంటూ హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు చాచి లెంపకాయ కొట్టిందన్న ఆయన, సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వానికి ఎదురు దెబ్బ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర మంత్రివర్గంలో చదువుకున్న వారి కంటే, చదువుకొన్న వారే ఎక్కువ అని ఎద్దేవా చేశారు.
సిట్ విచారణ వాయిదా
తెలంగాణ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ ) తనకు జారీ చేసిన నోటీసులలో పేర్కొన్నట్టుగా కాకుండా, అవసరమైతే తరువాత మళ్లీ నోటీస్ ఇచ్చి పిలుస్తామని పేర్కొన్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. తాను సిట్ విచారణకు హాజరవుతారని చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్న జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి లకు ఈ వార్త నిరాశ కలిగించి ఉంటుందని అపహస్యం చేశారు . సిట్ విచారణకు హాజరయ్యేందుకు, చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా తన షెడ్యూల్ ను మార్చుకున్నానని తెలిపారు. సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కు అనుమానం వచ్చిందని తనకు నోటీసులు జారీ చేసి ఉంటారన్నారు. ఇందులో మతం కోణం ఉన్నందున, సనాతన ధర్మాన్ని గౌరవించే వ్యక్తిని కాబట్టి తనకు సిట్ పోలీసులు ఏదైనా అపోహతో ఇంతకు ముందు నోటీసులు జారీ చేసి ఉండవచ్చునన్నారు .