Suryaa.co.in

Editorial

అవసరమైనప్పుడే తుమ్మల గుర్తొస్తారా?

– పొంగులేటి బీజేపీకి వెళ్లకపోతే తుమ్మలను గుర్తించేవారా?
– సభల కోసమే తుమ్మల సాయం కావాలా?
– ఇప్పటిదాకా ఆయన సీనియారిటీ గుర్తుకురాలేదా?
– పాలేరు టికెట్‌పై ప్రకటన ఇవ్వలేదేం?
– తుమ్మలను విమర్శిస్తున్నా నాయకత్వం మౌనమెందుకు?
– బీఆర్‌ఎస్‌ నాయకత్వం తీరుపై తుమ్మల అనుచరుల ఆగ్రహం
( మార్తి సుబ్రహ్మణ్యం)

దశాబ్దాల పాటు ఖమ్మం జిల్లా రాజకీయాలను శాసించి, శ్వాసించిన మాజీ మంత్రి, సీనియర్‌ నేత తుమ్మల నాగేశ్వరరావు పేరు అవరసమైనప్పుడే పార్టీకి గుర్తొస్తుందా? ఇన్నాళ్లూ ఆయన సీనియారిటీ- సిన్సియారిటీ గుర్తుకురాలేదా? సభలు సక్సెస్‌ చేయడం కోసమేనా ఆయన పనికొచ్చేది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోతే తప్ప, తుమ్మల ప్రాధాన్యమేమిటో గుర్తుకురాలేదా? ఆయనకు విలువ లేదా? పొంగులేటి నిష్ర్కమించిన తర్వాత గానీ తుమ్మల ఇల్లు పార్టీకి తెలియదా?.. ఇదీ బీఆర్‌ఎస్‌ నాయకత్వంపై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుల ఆగ్రహం.

పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిష్ర్కమణ నేపథ్యంలో.. ఖమ్మం జిల్లాలో పార్టీని కాపాడుకునేందుకు, బీఆర్‌ఎస్‌ నాయకత్వం రంగం లోకి దిగింది. బీఆర్‌ఎస్‌ ఆవిర్భవించిన తర్వాత, తొలిసారిగా ఖమ్మంలో ఈనెల 18న జరపతలపెట్టిన భారీ బహిరంగసభపై, కేసీఆర్‌ సీరియస్‌గా దృష్టి సారించారు. గత నెలలో అదే ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగసభతో, టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇవ్వడం బీఆర్‌ఎస్‌ను అప్రమత్తం చేసినట్టయింది. అంచనాలకు మించి చంద్రబాబు ఖమ్మం సభకు జనం రావడం, తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయింది.

ఈ నేపథ్యంలో ఖమ్మంలో నిర్వహించనున్న, బీఆర్‌ఎస్‌ తొలి బహిరంగసభ సక్సెస్‌పై దృష్టి సారించింది. అయితే .. ఆ జిల్లాకు చెందిన సీనియర్‌ నేత తుమ్మల నాగేశ్వరరావు ఇటీవలి కాలం, నాయకత్వంతో అంటీముట్టనట్లు ఉండటం, బీఆర్‌ఎస్‌ నాయకత్వాన్ని కలవరానికి గురిచేసింది.

ఒక దశలో ఆయన పాల్గొన్న ఆత్మీయ సమావేశాల్లో, సొంత పార్టీ నేతలపై తుమ్మల చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించారు. రాజకీయ శత్రువులను నమ్మవచ్చని, కానీ ద్రోహులు మాత్రం పార్టీలోనే ఉండి ద్రోహం చేసి ఓడిస్తారన్న వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. పాలేరు నుంచి తిరిగి పోటీచేస్తానని సంకేతాలిచ్చారు. దీనితో ఆయన అసంతృప్తిని తొలగించేందుకు నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఆ దిద్దుబాట చర్యల్లో భాగంగా.. సీనియర్‌ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వెళ్లడం చర్చనీయాంశమయింది.

దిద్దుబాటు చర్యల్లో భాగంగా తుమ్మల నివాసానికి వెళ్లిన హరీష్‌.. సీఎం కేసీఆర్‌ చేసిన ప్రతిపాదనలు వివరించారన్నది, పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఆ ప్రకారంగా తుమ్మలను తిరిగి యాక్టివ్‌గా ఉండాలని, మళ్లీ జిల్లాలో క్రియాశీలపాత్ర పోషించాలని, హరీష్‌ అభ్యర్ధించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే వాటిపై తుమ్మల ఎలాంటి హామీ ఇవ్వకుండా, ఖమ్మం జిల్లాలో జరిగే రెండు సభల విజయవంతానికి, సహకరిస్తానని మాత్రం హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే పాలేరు సీటుపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంపై తుమ్మల అనుచరుల్లో ఇంకా అసంతృప్తి తొలగినట్లు కనిపించడం లేదు.

కాగా హరీష్‌ వెంట ఇటీవల తుమ్మలను పరోక్షంగా విమర్శించిన, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా తుమ్మల నివాసానికి రావడాన్ని, తుమ్మల అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్నాళ్లూ తుమ్మలను పట్టించుకోని నాయకత్వానికి, ఆయన అవసరం ఇప్పుడొచ్చిందా? అని ఆయన అనుచరులు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ తుమ్మలపై నాయకత్వానికి ప్రేమ ఉంటే, రానున్న ఎన్నికల్లో పాలేరు నుంచి ఆయనే పోటీ చేస్తారని, ముందస్తుగా ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

బీఆర్‌ఎస్‌ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలోకి చేరుతున్నందుకే, ఇప్పడు తమ పార్టీ నాయకత్వానికి తుమ్మల గుర్తుకొచ్చారని, ఆయన అనుచరులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ పొంగులేటి బీఆర్‌ఎస్‌లోనే కొనసాగి ఉంటే, తుమ్మలను పట్టించుకునే వారు కాదు కదా? అని ప్రశ్నిస్తున్నారు. పాలేరు టికెట్‌పై పార్టీలో గందరగోళం, పోటీ నెలకొన్న నేపథ్యంలో .. తుమ్మల పేరు ప్రకటించడం ద్వారా, దానికి తెరదించే అవకాశం ఉందని వారు స్పష్టం చేస్తున్నారు. అయినా అప్పటికీ ఆ పనిచేయలేదంటే.. తుమ్మలను నాయకత్వం ఇంకా పరీక్షిస్తున్నట్లు భావించాల్సి వస్తోందని ఆయన అనుచరులు చెబుతున్నారు.

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడే నాయకత్వానికి తుమ్మల గుర్తుకొస్తుంటారని, ఆ తర్వాత నాయకత్వం పట్టించుకోదన్న విషయం, తమకు అనేకసార్లు అనుభవం అయిందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీలోనూ ఇదే జరిగిందని గుర్తు చేస్తున్నారు. తుమ్మల కళ్ల ముందు రాజకీయాల్లోకి వచ్చిన వారు సైతం.. ఆయనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే, నాయకత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఇటీవల తుమ్మలను పరోక్షంగా విమర్శిస్తే జిల్లా ఇన్చార్జి మంత్రి ఎందుకు స్పందించలేదని నిలదీస్తున్నారు. కేవలం కొత్తగూడెంలో సీఎం కేసీఆర్‌ సభ, 18న ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ తొలి బహిరంసభను విజయవంతం కోసమే, తుమ్మలను హరీష్‌రావు కలిశారే తప్ప, ఆయనపై ప్రేమతో కాదని తుమ్మల అనుచరులు స్పష్టం చేస్తున్నారు.

‘కారణాలు ఏవైనా నాయకత్వానికి ఇప్పుడు తుమ్మల అవసరం వచ్చింది. ఆయన సామర్థ్యంపై ఇప్పుడు నమ్మకం వచ్చినట్లుంది. అందుకే హరీష్‌రావును పంపించి, బుజ్జగించారు. మరి ఇన్నాళ్లూ ఆయనకు జరిగిన అవమానం, ప్రదర్శించిన నిర్లక్ష్యం అంతా ఏమైనట్లు? అంటే తుమ్మల పాత్ర కేవలం సభలు సక్సెస్‌ చేయడం వరకేనా? నిజంగా పార్టీ నాయకత్వానికి తుమ్మల సత్తాపై విశ్వాసం ఉంటే, రేపు ఖమ్మం సభలో పాలేరు సీటు ఆయనకే ఇస్తామని ప్రకటించాలి. ఎమ్మెల్సీ అభ్యర్ధులను ముందే ప్రకటిస్తున్న విధంగానే, పాలేరు అసెంబ్లీ సీటు కూడా తుమ్మలకు ఇస్తున్నట్లు ప్రకటించాలి. అప్పుడే పార్టీ నాయకత్వం ఎవరి వైపు ఉంటుందో తేలిపోతుంద’ని పాలేరు నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నేత ఒకరు వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE