Suryaa.co.in

Andhra Pradesh Crime News Editorial

ఖాకీల సేవ చూడతరమా?

– చెవిరెడ్డి తనయుడికి పోలీసు అధికారుల సీ- సేవ
– నవ్వుల పాలవుతున్న నాలుగో సింహం

( మార్తి సుబ్రహ్మణ్యం)

మనకు ఈ-సేవ తెలుసు. మీ-సేవ తెలుసు. కానీ సీ-సేవ గురించి తెలుసా? తెలియదు. ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే, కమ్ తుడా చైర్మన్ అయిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి ముద్దుల తనయుడు.. చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి అక్కడి పోలీసు అధికారులు చేస్తున్న సీ-సేవ గురించి, సోషల్‌మీడియా తెగ కోడై కూస్తోంది.

వచ్చే ఎన్నికల్లో మోహిత్‌రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఖరారయ్యారని, జిల్లాలో మరెవరికీ లేని వారసుల సర్టిఫికెట్, జగనన్న ఆయనకొక్కరికే ఇచ్చారన్నది సోషల్‌మీడియా టాక్. సీఎం జగనన్నకు ఉన్న అతి త క్కువమంది అత్యంత విశ్వాసపాత్రుల్లో ఒకరైన చెవిరెడ్డి .. ప్రస్తుతం ‘విశాఖ వ్యవహారాల్లో’ బిజీగా ఉన్నారన్నది, వైసీపీలో జరుగుతున్న చర్చ.

కాబట్టి.. చంద్రగిరి వ్యవహారాలన్నీ ఆయన తనయుడు, మోహిత్‌రెడ్డే చక్కదిద్దుతున్నారట. నియోజకవర్గంలో మంచి చెడ్డలన్నీ చిన్న సారే చూసుకుంటున్నారట. దానితో అధికారులంతా, యువరాజుకే రిపోర్టు చేస్తున్నారన్నది రాజకీయ ప్రత్యర్ధుల విమర్శ.

ఆ విమర్శలు, ఆరోపణల్లో నిజమెంతో తెలియదు గానీ.. ఈమధ్య ఆ నియోజకవర్గంలో బాధ్యతలు స్వీకరించిన పోలీసు అధికారులు, బొకేలతో వెళ్లి మరీ యువరాజు గారిని కలిసిన ఫొటోలు.. సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అవన్నీ రాజకీయ ప్రత్యర్ధులు పెట్టిన ఫొటోలనుకుంటే తప్పులో కాలసినట్లే. చెవిరెడ్డి సోషల్‌మీడియా బృందమే, అధికారికంగా ఆ ఫొటోలు పెట్టింది కాబట్టి, ఖాకీల స్వామి భక్తిని నమ్మితీరాలి మరి!
తిరుపతి రూరల్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన సుబ్రమణ్యంరెడ్డి, యువరాజు మోహిత్‌రెడ్డిని కలసి, బొకే సమర్పించుకుని తన భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. తర్వాత పాకాల సీఐగా బాధ్యతలు స్వీకరించిన ఓబులేసు కూడా, ఏ మాత్రం తగ్గకుండా మోహిత్‌రెడ్డి సారును కలసి బొకే సమర్పించుకున్నారు. ఈ రెండు ఫొటోలను చెవిరెడ్డి సమాచార విభాగం పేరుతో, స్వయంగా వారే ప్రపంచానికి అందించారు.

చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఎమ్మెల్యే కాబట్టి ప్రొటోకాల్ ప్రకారం, కొత్తగా వచ్చిన అధికారులు ఆయనను కలవడం రివాజు. కానీ ఎలాంటి ప్రొటోకాల్ గానీ, ఎలాంటి అధికార పదవి గానీ లేని ఆయన తనయుడు మోహిత్ సారును కలసి… బొకేలివ్వడం ఏమిటి చెప్మా అని, నియోజకవర్గ ప్రజలు ఆశ్చర్యపోతున్నారట. ఇప్పుడు ఇది సోషల్‌మీడియాలో హల్‌చల్ అవుతోంది.

బెల్లం చుట్టూ ఈగలు వాలడం అంటే ఇదే కామోసని, నెటిజన్లు తెగ సెటైర్లు సంధిస్తున్నారు. కనిపించని నాలుగో సింహం ఇలా తలదించుకుని, రాజకీయ నేతలకు సలాములు కొట్టడమే ట్రాజెడీ అన్నది నెటిజన్ల ఉవాచ.

 

LEAVE A RESPONSE