శ్రీకృష్ణుని విశ్వరూపం మనం చూసేది పంచరంగుల కాలండర్లో..
కరోనా విజృంభణ వేళ
మనం కాంచడం లేదా మనిషి విశ్వరూప దర్శనం
కలి”కాలం”డర్లో..
ప్రతి వైద్యుడు
“కోవైడ్”యుడై
కరోనాపై సాగుతున్న పోరులో
తానే ఆద్యుడై..ఆరాధ్యుడై
జగమెల్ల విస్తరించి
ఆంబులెన్సు సైరనే శంఖారావమై..
స్టెతస్కోప్,సిరంజి తదితరాలే
గద,చక్రములై పోరాడుతుండె
రక్షకుడై,ప్రాణ సంరక్షకుడై..!
నువ్వు ఎప్పుడు గుర్తిస్తావు నీలాంటి ఓ మనిషిలో దేవుడిని
నీ ఎదురుగా రోజూ తిరిగే
భగవంతుడిని..
శిష్టరక్షణకు
ఉపక్రమించి భూమిపైకి దిగివచ్చిన దేవుడే
మనిషి గొప్పదనాన్ని గుర్తించి
మానవ రూపంలో
వైద్యుడిగానే
అరుదెంచినాడేమో…!
కరోనా విలయతాండవం చేస్తున్న వేళ
ఊరూరా దేవుళ్ళు..
గుళ్ళలో కాదు..
ఆస్పత్రులలో
డాక్టర్ బాబులుగా,
నర్సులుగా,ఆయాలుగా..
వారి ప్రాణాలను
ఫణంగా పెట్టి
ఇంటిపై ధ్యాస వదిలిపెట్టి
ఫోనులో ఛాటింగులూ విడిచిపెట్టి..
మాస్కులు కూడా రిస్కుల నుంచి కాపాడలేని
గడ్డు స్థితిలో నీ ప్రాణాలకు వారి ప్రాణాలను అడ్డుపెడుతున్న
వైద్య నారాయణులు.. స్టెతస్కోపు భూషణులు..!
దిక్కు లేని వారికి
వైద్యుడే దిక్కై..
నీ రక్షకుడై..లోక్ రక్షకుడై..
ఫీజులు..చెడు రోజులు అంటూ గగ్గోలు పెట్టకు..
దోచేది కొందరే..
కాచేది ఎందరో..
ఒక్కొక్కరిది ఒక్కో గుణం..
ఏమిచ్చినా..ఎంతిచ్చినా
తీర్చలేనిది
ప్రాణం కాపాడే
వైద్యుడి రుణం..
దేవుడికైతే గుడిలో దీపం..
డాక్టరుకు ప్రతి గుండె
గుడిలో దీపమే..!
డాక్టర్స్ డే సందర్భంగా
ప్రతి వైద్యుడికి నమస్సులతో..
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286