Suryaa.co.in

Features

డాలర్ @ Rs 80.60

26-9-2022న కూడా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 950 పోయింట్లు పడిపోయింది. గత శుక్రవారం వెయ్యుకి పైగా పాయింట్లు నష్టపోవడం తెల్సిందే. (శని, ఆదివారం ట్రేడింగ్ శెలవు) తర్వాత ఈరోజే ట్రేడింగ్ జరిగింది.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లని గత బుధవారం వరసగా మూడవసారి 75 బేసిస్ పాయింట్లు పెంచిన తర్వాత ఇండియన్ స్టాక్ మార్కెట్లు వరసగా దెబ్బ తింటున్నాయి. భారత్ రూపాయి కూడా తీవ్రంగా నష్ట పోతున్నది. ఈరోజు రూపాయి విలువ బాగా పడిపోయింది. ఈ రైటప్ రాసే టైమ్ కి ₹81.60 పైసలకి దిగజారింది.

గత సోమవారం మన రూపాయి విలువ 79.70 వద్ద ఉంది. వారం రోజుల్లో 190 పైసలు దిగజారింది. అంటే, సుమారు రెండు రూపాయలకు పడింది. భారతీయులు వివిధ రూపాల్లో నష్టపోతారు. అవేమిటో ఒకట్రెండు ఉదాహరణల్ని యిద్దాం.

ఒక భారతీయ విద్యార్థి అమెరికా యూనివర్సిటీ లో ఓ కోర్స్ లో చేరడానికి 50 వేల డాలర్ల ఫీజును చెల్లించాలని భావిద్దాం. గత శుక్రవారం అడ్మిట్ ఐనచో ఒక డాలరుకు 79.70 చొప్పున ఫీజు చెల్లించాలి. ఈ శుక్రవారం అడ్మిట్ ఐనచో డాలర్ కి 81.60 ఫీజు చెల్లించాలి.

మొదటి లెక్క ప్రకారం 39,85,000 రూపాయలు చెల్లించాలి. రెండో లెక్కన 40,80,000 రూపాయలు చెల్లించాలి. ఈ రెండింటి మధ్య తేడా 95,000 రూపాయలుంది. ఒక్క వారం తేడాతో సుమారు లక్ష రూపాయల అదనపు భారాన్ని భరించాలి. ఇది విద్యార్థుల తల్లిదండ్రులకి సంబంధం లేకుండా పెరిగే అదనపు ఆర్ధికభారమే.

ఈ ఏడాది జనవరి నుండి నేటి వరకు డాలర్ విలువతో పోల్చితే మన రూపాయి విలువ 8శాతం కంటే ఎక్కువే క్షీణించింది. ఈ లెక్కన చూద్దాం. ఈ ఏడాది జనవరి కంటే ముందు అమెరికా యూనివర్సిటీలో చేరే మన భారతీయ విద్యార్థి 50,000 డాలర్లకి చెల్లించే ఫీజు ఒక మొత్తం లోనిది. ఇప్పుడు చేరే భారతీయ విద్యార్థి చెల్లించే ఫీజు మరో మొత్తంలోనిది. వీటి మధ్య తేడాను చూద్దాం.

1-1-2022వ తేదీకీ, 26-9-2022వ తేదీకీ మధ్య రూపాయి విలువ 8 శాతం తగ్గింది. అంటే ఈనాటి 81.60 ల నుండి 8 శాతం తీసివేయాలి. ప్రతి రూపాయిలో 8 పైసలు తీసేయ్యాలి. 81 తో 8 పైసల్ని గుణిస్తే, 648 పైసలు అవుతుంది. ఆ పైన మరో 60 పైసలలో కూడా 8శాతం తీస్తే, అదో 4.8 పైసలు అవుతుంది. (ఐదు పైసలతో సమం) అంటే మొత్తం 653 పైసలు అవుతుంది. దీన్ని 81.60 నుండి తగ్గించాలి. ₹81.60 నుండి ₹6.53 తీస్తే, ₹75.07 వుంటుంది. అమెరికా యూనివర్సిటీ లో 31-12-2021 నాడు చేరిన భారతీయ విద్యార్థి ఒక్క డాలర్ కి ₹75.07 చొప్పున 50,000 డాలర్లకి ₹37,53,500 చెల్లించాలి. అదే యూనివర్సిటీలో అదే కోర్సులో అదే ఫీజుకి మరో భారతీయ విద్యార్థి నేడు చేరితే, డాలర్ కి 81.60 చొప్పున ₹40,80,000 చెల్లించాలి. ఈ రెండింటి మధ్య తేడా ₹3,26,500 వుంది. అమెరికాలో అదే విద్యకు వెచ్చించే బేసిక్ ఫీజులో మార్పు లేదు. కానీ మన భారతీయ విద్యార్థులు అదనంగా ఫీజు చెల్లించే పరిస్థితి ఏర్పడుతుంది. 2021లో చేరే విద్యార్థి తల్లిదండ్రుల కన్న ఈరోజు చేరే విద్యార్థి తల్లిదండ్రులు ఎందుకు ₹3,26,500 అదనంగా ఫీజు చెల్లించాలి?

2021-22 లో మన సరుకుల ఎగుమతుల విలువ 422 బిలియన్ డాలర్లు. దిగుమతుల విలువ 613 బిలియన్ డాలర్లు. రెండింటి మధ్య వాణిజ్య లోటు 191 బిలియన్ డాలర్లు. ఈ లెక్కన విదేశాల నుండి దిగుమతి చేసే సరుకులకి 8 శాతం చొప్పున వచ్చే ఏడాదికి అదనంగా ఖర్చు చేయాలి. ఎగుమతులకి ఆమేరకి అదనపు రాబడి వుండే మాట నిజమే. ఐతే మనది ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువ చేసుకునే దేశం. మనం రాబట్టుకునేది జానెడైతే, పోగొట్టుకునేది బారెడు.

ఉదాహరణకు, 2022-23 వ ఏడాదిలో మన దేశ సరుకుల ఎగుమతులకీ, దిగుమతులకీ మధ్య తేడా లేదని మాటవరసకి అనుకుందాం. తిరిగి 191 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు యధాతధంగానే కొనసాగిదని ఊహిద్దాం. ఐనా గత ఏడాది కంటే వచ్చే ఏడాది 8 శాతం ఎక్కువ లోటుకి వెళ్తాం. నికర విలువ లెక్కన ప్రతి డాలరుకి 8 సెంట్లు లేదా ప్రతి రూపాయికి 8 పైసల చొప్పున అదనపు భారం మన దేశంపై పడుతుంది. అది మరో 15 బిలియన్ డాలర్ల లోటుతో సమం. మన దేశ ఆర్థిక వ్యవస్థపై అదనపు భారం పడితే, అది ఆచరణలో మన దేశ ప్రజలపై పడినట్లే!

విదేశాల నుండి మనం దిగుమతి చేసుకునే ప్రతి సరుకుకు అంతర్జాతీయ మార్కెట్ ధర మారకుండా మన ప్రజలపై 8 శాతం ధర పెరుగుతుంది. ఒకవేళ అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఈ ఏడాదిలో ధర పెరిగితే, అది అదనమే. సామ్రాజ్యవాద యుగ స్వభావం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడో న్యూయార్క్ ని ఆర్ధిక సంక్షోభం కుదిపితే, ఇక్కడ న్యూఢిల్లీ కూడా కుదుపుకి గురౌతుంది. సామ్రాజ్యవాద మార్కెట్ల కి అనుసంధాన పాలనా వ్యవస్థలు ఉన్నంత కాలం ఇలాంటి దుస్థితి తప్పదు. సామ్రాజ్యవాద వ్యవస్థతో తెగదెంపులు చేసుకొని సర్వ స్వతంత్య పాలనా వ్యవస్థలు ఏర్పడనంత కాలం ఇలాంటి దుస్థితి తప్పదు. ద్రవ్యోల్బణం వల్ల గానీ, డాలర్ విలువతో మన భారత్ రూపాయి విలువ దిగజారడం వల్ల గానీ, ఒక్కొక్క రోజులో కూడా భారతీయులు ఎలాంటి నష్టాలకు గురౌతున్నారో అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దృష్ఠితో కూడా మనం చైతన్యం పొందుదాం.

గమనిక:- ఈ వ్యాసాన్ని ప్రారంభించే సమయంలో డాలర్ @ 81.60 వద్ద ఉంది. మిత్రులకి పంపే ముందు చూస్తే డాలర్ @81.50 వద్ద ఉంది. మరో గంటలో తిరిగి పెరగవచ్చు. ఈ స్వల్ప హెచ్చుతగ్గులు ముఖ్యం కాదు. స్థూలంగా రూపీ క్షీణించే దిశలో ఉండడం గమనార్హం!

– వెలగపూడి గోపాలకృష్ణ

LEAVE A RESPONSE