జగన్ గారూ.. భార్యతో తిరుమలకు రండి

– డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సిందే
– లేకపోతే మీకు హిందూ సంప్రదాయాలపై నమ్మకం లేనట్టే
– అన్యమతస్తుడిగానే హిందూ సమాజం గుర్తిస్తుంది
– హైందవంపై నమ్మకం ఉంటే డిక్లరేషన్‌పై సంతకం పెట్టండి
– ఇవి చేయకుండా ఎన్ని మఠాలకు తిరిగినా హిందువులు నమ్మరు
– బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్‌ నాయుడు

తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళుతున్న ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఈసారైనా తన సతీమణి భారతిని తీసుకువెళ్లకపోతే, ఆయనకు హిందూ సంప్రదాయాలపై విశావసం లేనట్లు భావించాల్సి వస్తుందని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది. తనకు హిందూ మతంపై విశ్వాసం ఉందని సీఎం డిక్లరేషన్‌పై సంతకం చేయాలని డిమాండ్ చేసింది. గుళ్లకు వెళ్లినప్పుడు భార్యను తీసుకువెళ్లడం హిందూ మత సంప్రదాయమన్న విషయాన్ని ఇప్పటికయినా గుర్తించి, తన సతీమణిని తిరుమలకు తీసుకువెళ్లాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు సూచించారు.

విశాఖ శారదా పీఠం, హైదరాబాద్ జీయర్ పీఠం వద్దకు వెళ్లే జగన్.. తిరుమల స్వామి వారి బ్రహోత్మవాలకు భార్యను తీసుకువెళ్లకపోతే, ఆయన పీఠాల పర్యటనను హిందూ సమాజం నమ్మదని స్పష్టం చేశారు. ‘మీరు ఎన్ని పీఠాలకు తిరిగి నేను హిందువునని ప్రచారం చేసుకున్నా ఉపయోగం లేదు. మీ భార్యను శ్రీవారి బ్రహోత్మవాలకు తీసుకువెళితేనే మిమ్మల్ని హిందూ సమాజం విశ్వసిస్తుంది. లేకపోతే మీ పీఠాల పర్యటనకు అర్ధం ఉండదు. మిమ్మల్ని అన్యమతస్తుడిగానే గుర్తిస్తుంది. హిందువులను నమ్మించడానికే మీరు పీఠాలకు వెళుతున్నారని నమ్మే ప్రమాదం ఉంది. ఇప్పటివరకూ అందరు ముఖ్యమంత్రులు తమ భార్యలతోనే బ్రహ్మోత్సవాలకు వెళ్లారు. మరి మీరెందుకు ఆ సంప్రదాయం పాటించరు’ అని రమేష్‌నాయుడు ప్రశ్నించారు.

అదేవిధంగా తనకు హిందూ సంప్రదాయాలపై నమ్మకం ఉందని సీఎం జగన్ డిక్లరేషన్‌పై సంతకం పెట్టాలని రమేష్‌నాయుడు డిమాండ్ చేశారు. టీటీడీ అధికారులు కూడా సంప్రదాయం పాటించాలన్నారు. ‘సోనియాగాంధీ, అబ్దుల్‌కలామ్‌తోపాటు చాలామంది అన్యమతస్తులు డిక్లరేషన్‌పై సంతకం పెడితే మీరెందుకు పెట్టరు? అంటే మీకు హిందూ సంప్రదాయాలపై నమ్మకం లేదా? కేవలం కంటితుడుపు కోసం హిందువులను నమ్మించేందుకు పట్టువస్త్రాలు తీసుకువెళుతున్నారన్న అనుమానం హిందూ సమాజంలో కనిపిస్తోంది. కాబట్టి డిక్టరేషన్‌పై సంతకం చేయడం ద్వారా, ఈ గంద రగోళానికి మీరే తెరదించడం మంచిది’ అని హితవు పలికారు. టీటీడీ అధికారులు డిక్లరేషన్‌ను సీఎం ముందు ఉంచాలని, అలా చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మూడురోజుల క్రితం కాకినాడ జిల్లాలో వైసీపీ మీటింగు కోసం శివలింగానికి తాళ్లు కట్టడం బరితెగింపుగా రమేష్‌నాయుడు అభివర్ణించారు. ‘ఈ ఘటనతో వైసీపీకి హిందూమతమంటే ఎంత గౌరవం ఉందో స్పష్టమవుతోంది. ఘటన జరిగి ఇన్ని రోజులయి, శివలింగానికి తాళ్లు కట్టిన వీడియో వైరల్ అవుతున్నా ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదంటే.. ఆంధ్రప్రదేశ్‌లో హిందూమతానికి ఏ స్థాయిలో ప్రమాదం పొంచి ఉందో, హిందువులు అర్ధం చేసుకుంటున్నార’ని రమేష్‌నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.

Leave a Reply