-మోసపోతే గోస పడతాం — జాగ్రత్తగా ఉండాలి
-రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్
కాంగ్రెస్, బిజెపి పార్టీల నాయకులు చేసే మోస పూరిత మాటలను నమ్మవద్దని, కాంగ్రెస్, బిజెపి నాయకుల మాటలు విని ఆగం కావద్దని, వారి మాటలకు మోసపోతే గోస పడతాం అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ప్రజలకు సూచించారు.
శుక్రవారం బోయినపల్లి, చందుర్తి మండల కేంద్రాలలో జరిగిన బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో వినోద్ కుమార్ మాట్లాడారు.అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చి దిద్దిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని వినోద్ కుమార్ అన్నారు.
60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని, ఈ ఎన్నికలలో ఒక్క అవకాశం ఇవ్వమని కాంగ్రెస్ నాయకులు కోరడం హాస్యాస్పదంగా ఉందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
కేంద్రంతో సహా 19 రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయనేలేదని, కొత్తగా రాష్ట్రంలో చేసేది కూడా ఏమీ లేదని, బిజెపి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేదే లేదని వినోద్ కుమార్ అన్నారు.
ఎన్నికల సమయంలో మాత్రమే కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్, బిజెపి పార్టీల నైజం అని, ఆ పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని వినోద్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ లీడర్ కాదని కేవలం రీడర్ మాత్రమేనని వినోద్ కుమార్ అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రాసిచ్చే స్క్రిప్టును చదివే రీడర్ మాత్రమే రాహుల్ గాంధీ అని, ఆయన మాట్లాడే ప్రతి విషయం తప్పుల తడికేనని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వరకు కాంగ్రెస్ పార్టీది కుటుంబ పాలన పార్టీ అని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కే.టి.ఆర్, కవిత తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ప్రజలతో కలిసి పోరాటాలు చేసి ప్రజల ఆశీర్వాదాలతో చట్టసభలకు ఎన్నికైన వ్యక్తులు అని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.బిజెపి పార్టీలో కూడా అనేకమంది కుటుంబ సభ్యులు అధికార హోదాలో ఉన్నారని ఆయన తెలిపారు.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగ అని చెప్పారని, అతని శిష్యుడే రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉంటూ ఇటీవల అమెరికా పర్యటన సందర్భంలో వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చాలు అని చెప్పారని, ఇలాంటి కాంగ్రెస్ నాయకుని మాటలు విని మోసపోవద్దని వినోద్ కుమార్ ప్రజలకు సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో, నీటిపారుదల రంగంలో, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలో సాధించిన ప్రగతిని వినోద్ కుమార్ వివరించారు.
ఈ సమావేశంలో వేములవాడ అసెంబ్లీ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహరావు, బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, జడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి, ఎంపీపీ లావణ్య రమేష్, సెస్ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఫ్యాక్స్ చైర్మన్ కిషన్ రావు, శ్రీనివాస్, పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఎల్లన్న, సీనియర్ నాయకులు మనోహర్ రెడ్డి, అశోక్, కమలాకర్ రావు, వేణు, తదితరులు పాల్గొన్నారు.