– ఎంపీ విజయసాయిరెడ్డి
దేశంలో చట్టవ్యతిరేకంగానేగాక అక్రమ, ఆధునిక పద్ధతుల్లో జరుగుతున్న బెట్టింగులు, గ్యాంబ్లింగ్ పై శుక్రవారం మీడియాలో వచ్చిన వార్త తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ అనైతిక వ్యాపార ప్రక్రియలు లేదా కార్యకలాపాల ద్వారా ఏటా రూ.8.2 లక్షల కోట్ల మేర సొమ్ము అక్రమ క్రీడల బెట్టింగ్ మార్కెట్‌లోకి వస్తోందని స్వతంత్ర ఆలోచనాపరుల వేదిక ‘థింక్ ఛేంజ్ ఫోరం’ (టీసీఎఫ్) తన తాజా నివేదికలో వెల్లడించింది. దీని వల్ల ప్రభుత్వానికి రూ.2,29,000 కోట్లు పన్ను నష్టం వాటిల్లుతోందని కూడా ఈ రిపోర్టులో వివరించారు.
డబ్బుతో పందేలు కట్టడం (బెట్టింగ్స్) ప్రధానంగా క్రికెట్ వంటి అత్యధిక ప్రచారం ఉన్న క్రీడలు, ఇంకా ఇతర అంశాల ఆధారంగా ఇండియాలో సాగుతోందన్న విషయం కొత్తదేమీ కాదు. క్రికెట్ ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు, ప్రస్తుత ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు జరిగే సమయంలో ఈ బెట్టింగులు భారీ స్థాయిలో ఉంటాయనేది కూడా ప్రజలకు తెలిసిన విషయమే.
అయితే, గ్రుర్రప్పందాలు (హార్స్ రేసింగ్) క్రీడలో ఫలానా గుర్రం గెలుస్తుందని డబ్బుతో పందేలు కట్టడం ఎప్పటి నుంచో చట్టబద్ధంగా నడుస్తోందిగాని క్రికెట్ బెట్టింగ్ వంటివి మాత్రం చట్ట విరుద్ధమే. స్పోర్ట్స్ బెట్టింగ్ దేశంలో ‘అజ్ఞాత ప్రపంచంలో’ లక్షలాది డాలర్ల విలువైన పరిశ్రమలా కొన్ని దశాబ్దాలుగా దిగ్విజయంగా సాగుతోంది.
ప్రభుత్వ నియంత్రణలోని చట్టాలను అమలు చేసే సంస్థలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ బెట్టింగ్ పరిశ్రమ సైజు పెరుగుతోందేగాని అది మటుమాయం కావడం లేదు. అనైతికంగా, చట్టవ్యతిరేకంగా సాగే ఈ బెట్టింగ్ మార్కెట్ లో ఆర్థిక లావాదేవీల విలువ సంవత్సరానికి రూ.10 లక్షల కోట్లకు పైనే ఉందని 2016లో భారత వాణిజ్య, పారిశ్రామిక మండలుల సమాఖ్య (ఫిక్కీ) 2016లోనే అంచనా వేసింది.
లక్షలాది మంది పందెపురాయళ్లతో నగరాలు, పట్టణాలకు విస్తరించిన బెట్టింగ్
గడచిన కొన్ని దశాబ్దాలుగా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు, నగరాలు, పట్టణాలకు ఈ క్రికెట్, ఇతర క్రీడల బెట్టింగ్ మార్కెట్ విస్తరించింది. ఈ అనైతిక, చట్ట విరుద్ధ క్రీడా వ్యాపార జూదంలో ఎక్కువ మంది ఆటగాళ్లు, పాత్రధారులు ఉండడం, ఈ అక్రమ పరిశ్రమ అత్యంత ఆధునిక టెక్నాలజీతో వ్యాపార కార్యకలాపాలు సాగించడం వల్ల ప్రభుత్వంలోని లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీలు ఏమీ చేయలేకపోతున్నాయి.
అక్కడక్కడా, అప్పుడప్పుడూ కొందరు బెట్టింగ్ ఏజెంట్లను, పందెపురాయళ్లను పట్టుకున్నా నేరాన్ని కోర్టుల్లో నిరూపించలేకపోతున్నారు. ఈ బెట్టింగ్ జూదంలా వ్యాపించి లక్షలాది మంది జీవితాలను నాశనం చేస్తోంది. పబ్లింగ్ గ్యాబ్లింగ్ చట్టం–1867 ప్రస్తుత చట్ట, న్యాయ వ్యవస్థ కింద జూదాన్ని నిషేధిస్తోంది. ఈ చట్టం ప్రకారం లాటరీలు నిషేధిత జూదం కిందకు రావు. క్రికెట్ బెట్టింగ్ అనేది దాదాపు మూడు దశాబ్దాల నుంచి విస్తరించింది.
ఈ బెట్టింగ్ సిండికేట్ల నుంచి అక్రమంగా డబ్బు రహస్యంగా తీసుకునే క్రికెటర్లు తమ జట్ల ఓటమికి కారకులయ్యారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ బెట్టింగ్ అభియోగాల వల్ల కొందరు ఆటగాళ్ల క్రీడా జీవితాలే నాశనమయ్యాయి. ప్రభుత్వాలు ఎంతగా ప్రయత్నించినా బెట్టింగ్ అధోజగత్తు అదుపులోకి రావడం లేదు. పైన ముందే అనుకున్నట్టు ఎక్కువ మంది ఈ అక్రమ జూదంలో పాత్రధారులు కావడం వల్ల దాన్ని నిర్మూలించడం కుదరని పని అని తేలిపోయింది.
మరి క్రీడలకు సంబందించిన ఈ బెట్టింగ్ లేదా గ్యాంబ్లింగ్ అక్రమ వ్యాపార క్రీడగా సాగకుండా నివారించడానికి ఏం చేయాలి? అనే ప్రశ్నకు సరైన జవాబులు దొరకడం లేదు. పాశ్చాత్య దేశాల్లో మాదిరిగా స్పోర్ట్స్ బెట్టింగ్ ను చట్టబద్ధం చేయాలని కొందరు సూచిస్తున్నారు. మరి ఇలా చేయడం అంత తేలిక కాదు. చట్టబద్ధం చేశాక బెట్టింగ్ ప్రక్రియను ఎలా పద్ధతిగా సాగేలా చేయాలి?
అనే సమస్య ఎదురవుతుంది. అందుకే, కేంద్ర ప్రభుత్వం స్పోర్ట్స్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్రజల జీవితాలను నాశనం చేయకుండా నివారించడానికి అవసరమైన చట్ట సంబంధ సవరణలపై అందరితో సంప్రదించి, ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది.