Suryaa.co.in

Telangana

ఢిల్లీ గద్దల నోట చిక్కకండి

-మళ్లీ గెలుపు బీఆర్‌ఎస్‌దే
-మంత్రి తలసాని

ఈ నెల 25 వ తేదీన పరేడ్ గ్రౌండ్ లో BRS పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ను నిర్వహిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం పరేడ్ గ్రౌండ్ లో సభ నిర్వహణ ఏర్పాట్లపై పర్యవేక్షణ జరిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బహిరంగ సభ కు ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు.

నగరంలోని అన్ని నియోజకవర్గాల కు చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అభిమానులు ఈ సభకు వస్తారని తెలిపారు. 24 ప్రాంతాలలో పార్కింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదిన్నర సంవత్సరాలలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచామని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాన్ని దేశంలోని ప్రధాన నగరాలలో ఒకటిగా తీర్చిదిద్దామని చెప్పారు. GO 58, 59 ల క్రింద నగరంలో వేలాదిమందికి ఇంటి స్థలాలను రెగ్యులరైజేషన్ చేశామని తెలిపారు.

సొంత ఇల్లు లేని సుమారు 70 వేల మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఉచితంగా అందజేశామని చెప్పారు. చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తిరిగి మూడోసారి అధికారంలోకి వస్తామని, హ్యాట్రిక్ ముఖ్యమంత్రి గా శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బాద్యతలు చేపడతారని స్పష్టం చేశారు. కాంగ్రెస్, BJP పార్టీల నాయకులు డిల్లీ నుండి గద్దల్లా వాలారని, ప్రజలను తప్పుడు ప్రచారం, ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 40 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించలేదని, ఇప్పుడు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులకే గ్యారెంటీ లేని పరిస్థితుల్లో ఆరు గ్యారెంటీ లకు దిక్కెక్కడ ఉందని ప్రశ్నించారు. తిరిగి BRS ప్రభుత్వం వచ్చిన వెంటనే వంట గ్యాస్ సిలెండర్ ను 400 రూపాయలకు ఇస్తామని, రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా 15 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతుందని ముఖ్యమంత్రి మేనిఫెస్టో లో తెలిపారని వివరించారు.

మంత్రి వెంట MLC లు ప్రభాకర్, బొగ్గారపు దయానంద్, MLA ముఠా గోపాల్, బెవరేజేస్ కార్పోరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్, కంటోన్మెంట్, నాంపల్లి నియోజకవర్గ MLA అభ్యర్ధులు లాస్య నందిత, ఆనంద్ గౌడ్, కంటోన్మెంట్ బోర్డ్ మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి, నాయకులు MN శ్రీనివాస్, గుర్రం పవన్ కుమార్ గౌడ్ తదితరులు ఉన్నారు.

LEAVE A RESPONSE