– రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు వెళ్తామంటే తీవ్ర పరిణామాలు
– జనవరి 3న ఇందిరా పార్కు వద్ద భారీ సభ
– రానున్న జనగణనలో భాగంగా బీసీ కులగణన చేపట్టాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కవిత డిమాండ్
– ఎమ్మెల్సీ కవితతో భేటీ అయిన 40కిపైగా బీసీ కుల సంఘాల నేతలు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచకుంటే తాము ఎన్నికలు జరగనివ్వబోమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ మేరకు రిజర్వేషన్లు పెంచిన తర్వాతే ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించడంపై ఆలోచన చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీల అమలు కోసం జనవరి 3న ఇందిరా పార్కు వద్ద భారీ సభను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
దాదాపు 40కిపైగా బీసీ కుల సంఘాలకు చెందిన నాయకులు శుక్రవారం నాడు ఎమ్మెల్సీ కవితతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీసీల సమస్యలు, హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తడి తెచ్చే కార్యచరణపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
అనంతరం ఎమ్మెల్సీ కవిత విలేకరులతో మాట్లాడుతూ… స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిండానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, కానీ ప్రధాన డిమాండ్ గా ఉన్న బీసీల రిజర్వేషన్ పెంపుపై స్పష్టత ఇవ్వకుండా ఎన్నికలు జరపడానికి వీలు లేదని తేల్చిచెప్పారు.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో పేర్కొందని గుర్తు చేశారు. రిజర్వేషన్లు పెంచకుండానే ఎన్నికలు నిర్వహిస్తారా అన్న అనుమానాలు కలుగుతున్నాయని, రిజర్వేషన్లు పెంచకుంటే ఎన్నికలు జరగనివ్వబోమని ప్రకటించారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. మండల కేంద్రాల్లో, జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు చేస్తామని స్పష్టం చేశారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చాకా, బీసీ జనాభాను వెల్లడించిన తర్వాతే ప్రభుత్వం ఎన్నికలపై ఆలోచన చేయాలని, అంత వరకు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రభుత్వం ఆలోచన చేయకూడదని సూచించారు.
రానున్న జనగణనలో భాగంగా బీసీ కులగణన చేపట్టాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. బీసీలకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వాల వైఖరిని ఎండగడుతామని చెప్పారు.
ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ను యధాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇది ట్రైలర్ మాత్రమే… జనవరి 3న సినిమా చూపిస్తామని వ్యాఖ్యానించారు. జనవరి 3 నాటి సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కావాలని పిలుపునిచ్చారు.
బీసీల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ హాయంలో ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడం పట్ల ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు, ముఖ్యంగా పేద ప్రజలకు ఎంతగానో లబ్దీ చేస్తున్న పథకాలను నిలిపివేయడం సరికాదని సూచించారు. బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో బొల్లా శివశంకర్, సుమిత్ర ఆనంద్, మఠం భిక్షపతి, అనంతుల ప్రశాంత్ , పెంట రాజేష్, ఆలకుంట హరి, ఆర్వి మహేందర్, గోవర్ధన్ యాదవ్, గొరిగే నరసింహ, గోప సదనందు, కోట్ల యాదగిరి, ఎం నరహరి, దుగట్ల నరేష్, ఇతరి మారయ్య, కుమార స్వామి, గంధాల శ్రీనివాస్ చారి, రమేష్ బాబు, జి హరిప్రసాద్, సురేందర్, విజేందర్ సాగర్, శ్రీధర్ చారి, రవీంద్రనాథ్, కే శ్రీనివాస్, ప్రవీణ్, భారత అఖిల్, హరి దేవ్ సింగ్, సురేష్, మురళీకృష్ణ, నిమ్మల వీరన్న, మందుల శ్రీనివాస్, కే నరసింహ రాజు, ప్రవీణ్, పార్వతయ్య, నరసింహ, కడెకేకర్ రాకేష్, ఆవుల మహేష్, ఎంగులూరి శ్రీను, హుస్సేన్, రామచందర్, వాడేపల్లి మాధవ్, శ్యాంసింగ్ లోదే, దామ శివ కుమార్, వేణుమాధవ్, ఎండి నవీద్, వరలక్ష్మి, స్వప్న, లావణ్య యాదవ్ పద్మా గౌడ్ సూర్య పల్లి పరశురాం, ఏ చాలా దత్తాత్రేయ, జిల్లా నరేందర్, డాక్టర్ కీర్తి లతా గౌడ్, వింజమూరి రాఘవాచారి, సాల్వా చారి, రూపా దేవి, అప్ప సతీష్ మరియు తదితరులు పాల్గొన్నారు