– రేవంత్ రెడ్డి ప్రాధాన్యతలో విద్య లేకపోవడం శోచనీయం
-మాజీమంత్రి హరీష్ రావు
హైదరాబాద్: విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన గురుపూజోత్సవానికి హాజరయ్యే తీరిక మీకు లేదా విద్యాశాఖ పట్ల మీ చిత్తశుద్ధికి, ప్రాధాన్యతకు ఇది మరో నిదర్శనం. 9 నెలల మీ పాలనలో ధ్వంసమైన విద్యా వ్యవస్థ గురించి చెప్పాలంటే..టీచర్లు లేక పాఠశాలలు మూసేస్తున్నారు. పురుగుల అన్నం, గొడ్డుకారం తినలేక విద్యార్థులు ఏడుస్తున్నారు. ఫుడ్ పాయిజన్, పాము కాట్లు, కుక్క కాట్లు, ఎలుక కాట్లతో రోదిస్తున్నారు.
గురుకులాల ఖ్యాతిని రోజు రోజుకి దిగజార్చుతున్నారు. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులను నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తున్నారు . తరగతి గదుల్లో ఉండాల్సిన విద్యార్థులు రోడ్డెక్కి నిరసనలు తెలియజేస్తున్నారు.
తమ పిల్లల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఉన్న విద్యా వ్యవస్థను సక్రమంగా నిర్వహించరు కానీ సమీకృత గురుకులాలు, విద్యా కమిషన్ అంటూ భ్రమలు కల్పిస్తున్నారు. మీ నాయకత్వంలో పతనమవుతున్న విద్యా వ్యవస్థ గురించి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఏం సమాధానం చెబుతారు రేవంత్ రెడ్డి గారు?