– బీఆర్‌ఎస్ నేతలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చురక
హైదరాబాద్ : పదేళ్లు అధికారంలో ఉండి, ఇప్పుడు అధికారం పోయేసరికి ఎప్పుడు రైతుల మధ్యకురాని నేతలు ఇప్పుడు బయటికి వచ్చి రైతాంగ సమస్యల మీద మాట్లాడటం చూసి, తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు.
ఈ సంవత్సర కాలంలో రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, వాటికోసం ఖర్చు చేసిన నిధులు రూ. 55,256 కోట్లు. ఇప్పటివరకు ప్రత్యక్షంగా రైతులకు నేరుగా ఖాతాలలో జమ చేసింది రూ. 40,000 కోట్లు. దేశంలో ఏ రాష్ట్రంలోనైన, ఏ ప్రభుత్వంలోనైన స్వాతంత్ర్యం వచ్చిననాటి నుండి ఈ రోజు వరకు ఇన్ని నిధులు ఒక్క రైతు సంక్షేమం కోసమే ఖర్చు పెట్టిన ప్రభుత్వాన్ని చూపెట్టగలరా?
పావలా రుణమాఫీ అని ప్రతిసారి విమర్శించే నాయకులు, 2018 రుణమాఫీ ఏ సంవత్సరం మొదలుపెట్టి ఏ సంవత్సరం వరకు ఎంత మందికి చేశారో చెప్పి ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఒక్క విశ్వసనీయత ఉండేది. 2018 లో చేయాల్సిన రుణమాఫీని ఎలక్షన్లలో లబ్ధి కోసమే ఆఖరి సంవత్సరమైన 2023 సంవత్సరంలో సగం మందికి చేసిన మీరా ఈ ప్రభుత్వాన్ని విమర్శించేది.
4 సంవత్సరాల పాటు చారానా చొప్పున చేయడంతో 2014లో రుణమాఫీతో రైతులపై రూ. 2630 వడ్డీభారం పడింది నిజమా, కాదా అని మీ దీక్షలలో అడిగి తెలుసుకోండి. 2018 రుణమాఫీ, 4 సంవత్సరాలు ఆగి ఆఖరి సంవత్సరములో చేయడం వలన రూ. 8315 కోట్లు వడ్డీ భారం రైతులపై వేసింది కూడా మీరా, కాదా అని అడిగితే అప్పుడు సమాధానాలు మీకు సరిగ్గా వస్తాయి.
ఓఆర్ఆర్ ని కుదువపెట్టి మరీ ఎన్నికలలో లబ్ధి పొందాలనే ఆలోచన చేసిన బిఆర్ఎస్ పెద్దలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన మొదటి పంటకాలంలోనే 25,35,964 మంది రైతులకి రూ.20,616.89 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన విషయాన్ని దాచిపెట్టడానికి, అర్థం పర్థం లేని చవాకులతో, అవాస్తవాలతో మాటల గారఢీలతో దీక్షలు చేస్తూ, తెలంగాణ సమాజానికి ముఖ్యంగా రైతాంగాన్ని మభ్యపెట్టడానికి పడుతున్న కుస్తీలను చూసి అందరూ నవ్వుకుంటున్నారు.
అధికారంలో ఉన్న 10 సంవత్సర కాలంలో రైతుబంధు, రుణమాఫీకి మీరు చేసిన ఖర్చెంత? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక్క సంవత్సరంలోనే ఖర్చు పెట్టింది ఎంతో బేరీజు వేసుకుంటే మీరు రైతుల మధ్యకు వచ్చి మాట్లడగలరా.?
వాళ్ల పదవికాలంలో విపత్తులు సంబవించి పంటలు పూర్తిగా నష్టపోయి సందర్భంలోను రైతులను ఆదుకునే ప్రయత్నం ఏనాడైనా చేశారా మ్యాచింగ్ గ్రాంటు విడుదల చేయకుండా, ఒక్క రైతు బంధు పేరు చెప్పి రైతులను మిగతా అన్ని పథకాలకు దూరం చేసింది మీరు కాదా? మీరు చేసిన నిర్వాకం వలన రాష్ట్ర రైతాంగం నష్టపోయిన రూ. 3000 కోట్లకు మీరు సమాధానం చెప్పగలరా?
వరి ఏస్తే ఉరి అని చెప్పినా బిఆర్ఎస్ నాయకులు, బోనస్ గురించి మాట్లాడటం చూస్తుంటే ఏటి ఇసుక ఎంచలేం, తాటి మాను తన్నలేం, బిఆర్ఎస్ నాయకుల బుద్ధి మార్చలేం అన్నట్లు ఉంది. కందులు ఒక్కటే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరకాలంలో రైతులు పండించే ప్రతి పంటను మద్ధతు ధరతో కొనుగోలు చేస్తున్నాము.
ఈ సంవత్సర కాలంలో రూ. 412.62 కోట్లు వెచ్చించి రైతుల వద్ద నుంచి వివిధ పంటలను సేకరించాము. బిఆర్ఎస్ నాయకులు ఆరోపించినట్లు కందుల కోసం 4 సెంటర్లు కాదు, 41 సెంటర్లు ఇప్పటికే ఆరంభించాము. రూ. 7.21 కోట్లతో 954.95 మెట్రిక్ టన్నుల కందులను మద్ధతు ధరకు కొనుగోలు చేశాము.
ఇప్పటికైనా బిఆర్ఎస్ నాయకులు అవాస్తవాలు మాట్లాడటం మానకపోతే, తెలంగాణ సమాజం మరొకసారి కర్రుకాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉందని గ్రహిస్తే వారికే మంచిది.