వచ్చే ఆరు నెలలు మీరు ఇంటర్నెట్ వాడొద్దు

– సోషల్ మీడియాకు దూరంగా ఉండి సీరియస్‌గా చదవండి
– మహబూబ్ నగర్ పర్యటనలో ఉద్యోగార్ధులకు కేటీఆర్ సలహా

ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాస్తున్న విద్యార్ధులు, నిరుద్యోగులు ఒక ఆరునెలల పాటు సోషమల్ మీడియాకు దూరంగా ఉంటి, అనుకున్న లక్ష్యం సాధించాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ సలహా ఇచ్చారు. ఆయన తన మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో విద్యార్ధులకు ఈ సందేశం ఇచ్చారు.

ఈ సందర్భంగా మహబూబ్‌నగర్‌ లోని బస్టాండ్ ఎదురుగా ఉన్న ఎక్స్‌ పో ప్లాజా సమీపంలో టీఆర్ఎస్ పార్టీ జెండాను మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి లక్ష్మా రెడ్డితో కలిసి కేటీఆర్‌ ఆవిష్కరించారు. ఎక్స్ పో ప్లాజాలో శాంతానారాయణ గౌడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏర్పాటు చేసిన ఫ్రీ కోచింగ్ సెంటర్‌లో ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంత్రి కేటీఆర్ కాంపిటిటివ్ పరీక్షల పుస్తకాలు అందించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న యువకులను ఉద్దేశించి మాట్లాడారు. నిరుద్యోగ యువత వచ్చే 6 నెలల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండి సీరియస్‌గా చదవాలని సూచించారు. అందరూ మంచి ఉద్యోగాలు సాధించాలని సూచించారు. అనంతరం ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ వేగంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి మేరకు మహబూబ్ నగర్ పట్టణానికి అవసరమైన నిధులు మున్సిపల్ శాఖ ద్వారా మంజూరు చేస్తామని ఆయన వెల్లడించారు.

పట్టణ అభివృద్ధికి అవసరమైన మేర తమ సహకారం ఉంటుందని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సుమారు 90 వేల ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియ చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply