ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్
ముఖ్యమంత్రి,మంత్రులకు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీలు రవిచంద్ర, పార్థసారథి రెడ్డి, నాగేశ్వరరావు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఘనంగా ప్రారంభమైంది. సచివాలయం ప్రాంగణంలో ఆదివారం తెల్లవారుజామున రోడ్లు,భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు యాగం నిర్వహించారు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు యాగశాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు, వేద పండితుల మంత్రోచ్చరణాలు,మంగళ వాయిద్యాల మధ్య గుమ్మడికాయ, కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రధాన ద్వారాన్ని తెరిచారు.సచివాలయం ఆరవ అంతస్తులోని తన ఛాంబర్ ను ముఖ్యమంత్రి ప్రారంభించి వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు.
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర యాగశాలను సందర్శించి వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు,ఆ సమయంలో అక్కడే ఉన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారిలకు పుష్పగుచ్ఛాలిచ్చి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఆ తర్వాత రవిచంద్ర రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి,లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావులతో పాటు కేసీఆర్ ను కలిసి పుష్పగుచ్ఛాలిచ్చి హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు.
అదేవిధంగా ఎంపీలు రవిచంద్ర,పార్థసారథి రెడ్డి, నాగేశ్వరరావు మంత్రులు తన్నీరు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్ కుమార్,గంగుల కమలాకర్,వీ.శ్రీనివాస్ గౌడ్,జీ.జగదీష్ రెడ్డిల ఛాంబర్లను సందర్శించి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా అజయ్ కుమార్ ఛాంబర్ లో ఆయన తండ్రి,మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు కలవగా ఎంపీలు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఎంపీలు రవిచంద్ర, పార్థసారథి రెడ్డి, నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య,మెచ్చా నాగేశ్వరరావు,బేతి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీలు నవీన్ రావు,తాతా మధు,శేరి సుభాష్ రెడ్డి, ఆర్థిక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, దేవాదాయ,ధర్మాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఐఎఎస్ అధికారి అశోక్ రెడ్డి తదితర ప్రముఖులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఆ తర్వాత ఎంపీలు రవిచంద్ర, పార్థసారథి రెడ్డి, నాగేశ్వరరావు సచివాలయం ప్రాంగణంలో జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో పాల్గొన్నారు.