Suryaa.co.in

Features

దానగుణంలో కర్ణుడుని మించిపోయారు

యాభైఏళ్లుగా కష్టపడి కూడబెట్టిన తన యావదాస్తినీ తృణప్రాయంగా దానం చేసేశారు ఒక మహిళా వైద్యురాలు. కర్ణుడి దానగుణాన్ని వర్ణించిన మహాభారత ఘట్టాన్ని ఆధునిక భారతంలో గొప్పగా ఆవిష్కరించారు. భర్త మూడేళ్ల కిందట మృతి చెందటం, వారసులు లేకపోవడంతో డాక్టర్‌ ఉమ గవిని తన ఆస్తినంతా గుంటూరు జీజీహెచ్‌కు ఇచ్చేశారు. చివరికి బ్యాంక్‌ బ్యాలెన్స్‌ కూడా మిగుల్చుకోలేదు.

మొత్తం రూ.20 కోట్ల (2.50 లక్షల డాలర్లు) ఆస్తిని జీజీహెచ్‌లో కొత్తగా నిర్మిస్తున్న మాతా శిశు సంక్షేమ భవనానికి విరాళంగా ప్రకటించారు. గుంటూరు జిల్లాకు చెందిన ఉమా ప్రస్తుతం అమెరికాలోdr-umaఇమ్యునాలజిస్ట్‌, ఎలర్జీ స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఆమె గుంటూరు వైద్య కళాశాలలో 1965లో మెడిసిన్‌ చేశారు. అనంతరం ఉన్నతవిద్య పూర్తి చేసి నాలుగు దశాబ్దాల కిందట అమెరికా వెళ్లి.. స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా అక్కడే స్ధిరపడ్డారు.

గత నెలలో డల్లాస్‌లో జరిగిన గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం, ఉత్తర అమెరికా (జింకానా) 17వ రీ యూనియన్‌ సమావేశాల్లో ఉమా పాల్గొన్నారు. తాను మెడిసిన్‌ చేసిన జీజీహెచ్‌కు భారీ విరాళం ఇవ్వాలన్న నిర్ణయాన్ని ఆమె అక్కడి వేదిక మీదే ప్రకటించారు. ఆస్తిలో 80 శాతం, 90 శాతం దానంచేసే పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు అమెరికాలో కనిపిస్తారు. అలాచూస్తే… ఉమా ఔదార్యం వారిని కూడా మించిపోయింది. చేతిలో డాలర్‌ కూడా దాచుకోకుండా తన తరపున, తన భర్త తరపున వచ్చిన ఆస్థి మొత్తాన్ని ఇచ్చేశారు.

ఆమె అందించిన విరాళంతో నిర్మాణం అవుతున్న జీజీహెచ్‌లోని ఎంసీహెచ్‌ బ్లాక్‌కు ఆమె పేరును పెడతామని జింకానా సభ్యులు సూచించారు. ఈ ప్రతిపాదనను ఆమె సున్నితంగా తిరస్కరించారు. చివరికి డాక్టర్‌ ఉమా భర్త.. డాక్టర్‌ కానూరి రామచంద్రరావు పేరును ఈ బ్లాక్‌ను పెట్టాలని నిర్ణయించారు. డాక్టర్‌ కానూరి రామచంద్రరావు కర్ణాటకలోని గుల్బర్గాలో మెడిసిన్‌ చేసి, ఎనస్థటిస్ట్‌గా సేవలు అందించారు. మూడేళ్ల కిందట ఆయన మృతి చెందారు.

సహ వైద్యుల్లోనూ స్ఫూర్తి:
జింకానా రీ యూనియన్‌ సమావేశాల్లో డాక్టర్‌ ఉమా గవిని రగిల్చిన స్ఫూర్తితో ఇతర వైద్యులు సైతం ముందుకు వచ్చారు. డాక్టర్‌ మొవ్వా వెంకటేశ్వర్లు తన వంతుగా రూ.20 కోట్లు (2.50 లక్షల డాలర్లు), డాక్టర్‌ సూరపనేని కృష్ణప్రసాద్‌, షీలా దంపతులు రూ.8 కోట్లు (మిలియన్‌ డాలర్లు), తేళ్ల నళిని, వెంకట్‌ దంపతులు రూ.8 కోట్లు (మిలియన్‌ డాలర్లు) ఇచ్చేందుకు అంగీకరించారు. మరికొంతమంది పూర్వ విద్యార్థులు కూడా విరాళాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఈ రోజుల్లో కూడా ఇలాంటి గొప్ప మానవత్వం కలిగిన మనుష్యులు మన మధ్య ఉన్నందుకు గర్వపడాలి, జింకాన లాంటి సంస్థల కృషిని గుర్తించాలి. ఆమె విరాళం ఎంతో మంది శిశువులకు ప్రాణం పోస్తుందని, తల్లులకు సేవ చేస్తుందని GGH,Guntur సేవల్లో మరింత నాణ్యత చూపుతుందని ఆశిద్దాం.

– దామోదర్ ప్రసాద్ పటకమూరు

LEAVE A RESPONSE