విజయవాడ, కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు మండలంలోని నవాబుపేట చెంబులింగేశ్వరాలయం ముందున్న కాకతీయుల కాలపు (క్రీ.శ.13వ శతాబ్ధి) శాసనాలు, శిల్పాలు భూమిలోకి కూరుకుపోయాయని వాటిని పైకి తీసి, పీఠాలపై నిలబెట్టాలిని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిఆరెడ్డి అన్నారు.
వారసత్వ సంపదను కాపాడి భవిష్యత్తు తరాలకు అందించాలన్న నినాదంతో అవగాహన కల్పించే పనిలో భాగంగా ఆయన శుక్రవారంనాడు చెంబులింగేశ్వరాలయాన్ని సందర్శించారు. క్రీ.శ.13వ శతాబ్ధిలో కాకతీయ సామంతులైన నతవాడి పాలకులు ఈ ఆలయాన్ని కాకతీయ శైలిలో నిర్మించారని ఈ ఆలయం ముందు గణేషా, నంది మరో నాలుగు శాసనాలు సగానికి పైగా భూమిలోకి కూరుకుపోయాయని చెప్పారు.
అదేవిధంగా శాసననాలపై సున్నం కొట్టడంతో అక్షరాలు కనిపించడంలేదని ఆయన వాపోయారు. చారిత్రక ప్రాధాన్యత గల ఈ శాసనాలు, శిల్పాలపై సున్నాన్ని తొలగించి ఎత్తైన పీఠాలపై నిలబెట్టి చారిత్రక ప్రాధాన్యత గల పేరు పలకలను ఏర్పాటు చేసి కాపాడాలని ఆలయ పాలకమండలికి శివనాగిరెడ్డి సూచించారు. జాతీయ రహదారికి కూతవేటు దూరంలో ఉన్న ఈ చారిత్రక ఆలయం, శిల్పాలు పర్యాటక ప్రాధాన్యతను సంతరించుకుంటాయని తెలిపారు.