– బొమ్మూరు సీఐ, రాజానగరం సీఐ మధ్య ఫోన్ సంభాషణతో బట్టబయలు
– లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ ఆరోపణ
అమరావతి : ఏపీలో పరిస్థితులు కంచే చేను మేస్తుందన్న చందంగా ఉన్నాయి.. ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి మాఫియా వల్ల ప్రజలు నష్టపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఇక్కడ శనివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. పోలీసు శాఖలోని కొన్ని కలుపు మొక్కల కారణంగా డ్రగ్స్, గంజాయి మాఫియా విస్తరించి యువత జీవితాలను నాశనం చేస్తోందని అన్నారు.
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఇద్దరు పోలీసు అధికారులు అమాయకులను గంజాయి కేసుల్లో ఇరికించి లెక్కలు చూపించుకోవడానికి యత్నించిన విషయం నా దృష్టికి వచ్చింది. గంజాయి కేసుల్లో అమాయికులను బలిచేసి కోట్లు సంపాదించాలనే స్కెచ్ వేస్తున్నారు.. దృశ్యం సినిమాను మించిన ఘటనలు ఏపీలో చోటు చేసుకుంటున్నాయి.. బొమ్మూరు సీఐ లక్ష్మణరెడ్డి, రాజానగరం సీఐ సుభాష్ కు మధ్య జరిగిన సంభాషణ సంచలనం రేపుతోంది.. పేదలను, నిరపరాధులను గంజాయి కేసుల్లో ఇరికించి వారి కేసుల లెక్కలు చూపిస్తున్నారు.. బొమ్మూరు సీఐ, రాజానగరం సీఐ మధ్య ఫోన్ సంభాషణ వింటే అమాయకులను అక్రమ కేసుల్లో ఎలా ఇరికిస్తారనేది స్పష్టంగా అర్థమవుతోంది.
రాజానగరం సీఐకి.. బొమ్మూరు సీఐ.. ఎలా కేసులు బుక్ చేయాలి, ఎలా అరెస్ట్ చేయాలని వివరించడం దుర్మార్గం. ఆరు ఫోన్ నంబర్లు తీసుకొని తాడేపల్లి ప్రేమ్ కుమార్, దాసరి సురేష్ కుమార్(ఎస్సీ), లంకా పవన్, పట్నాల చిన్నసత్యనారాయణ(బీసీ), దారపు దుర్గ, తమ్మకట్ల అశోక్ కుమార్ అనే యువకులకు ఈ నంబర్లు ఇచ్చి..
వారితో జగ్గంపేట-రాజమండ్రి నుంచి ప్రయాణం చేయించి అరగంటకు ఒకసారి కాల్ చేస్తూ.. కాల్ ట్రాక్ రికార్డు చేయడంతో పాటు ఆ యువకుల దగ్గర గంజాయి పెట్టి వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. అక్రమ కేసుల్లో ఇరికించారని విజయకుమార్ ఆరోపించారు.
ఈ ఆరుగురు యువకుల ఫోన్ నంబర్లను తీసుకొని క్రైమ్ కి ముందే స్క్రీన్ ప్లే రాసి అమలు చేసి అమాయకులను గంజాయి కేసులో ఇరికించారు. ఓవైపు రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం జరుపుతూ డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.. ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో గంజాయి లేకుండా చేస్తామని ప్రకటనలు కూడా చేసి మాట నిలబెట్టుకోలేకపోతున్న ప్రభుత్వం.. అమాయకులపై అక్రమ కేసులు పెడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ శాఖలో ఉన్న డ్రగ్స్ మొక్కలు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అమాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు.
తెనాలి ఘటనలోనూ ఎస్సీలు, మైనార్టీలను నడిరోడ్డుపై దారుణంగా కొట్టిన ఘటన చోటు చేసుకుంది. దేశ భవిష్యత్తుకు వెన్నముక అయిన యువతను అక్రమ కేసుల్లో ఇరికిస్తూ వారి జీవితాలను నాశనం చేస్తోంది. ఇంత జరుగుతుంటో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది? ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదని మిమ్మల్ని గెలిపిస్తే మీరు చేస్తున్నదేంటి..? కొత్త దారుల్లో గంజాయి సరఫరా అవుతుంటే ప్రభుత్వం నిద్రపోతోందా? మహానగరాల్లో డ్రగ్స్ మాఫియా విక్రయించే కొకైన్.. మంగళగిరిలాంటి పట్టణంలో ఎలా దొరికింది? దీని వెనుక ఎవరున్నారో ఎందుకు తేల్చలేదు.
విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగు నిర్మూలకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యం. గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల్లో ఒక్క డీ-అడిక్షన్ సెంటర్ లేదు. యువతకు ప్రత్యామ్నాయ జీవనోపాయం లేదంటే మళ్లీ అదే పని చేస్తారు. ముఖ్యంగా గిరిజనులకు సరైన ఉపాధి మార్గాలు చూపించి, వారికి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే ఈ పరిస్థితి రాదని ఆయన సూచించారు. సీఎం సొంత నియోజకవర్గం కుప్పంలో గంజాయి మత్తులో తెలుగుదేశం కార్యకర్తలు కొట్టుకున్న పరిస్థితి.. రాయదుర్గంలో స్థానిక టీడీపీ నేత మామిడి తోటలో గంజాయి పండిస్తుంటే ఏం చేస్తున్నారు?
రాష్ట్రంలో నెలకు రూ.2వేల కోట్ల గంజాయి వ్యాపారం నడుస్తోందనే అంచనా ఉంది.
లిక్కర్ స్కామ్ అంటూ హడావుడి చేస్తున్న ప్రభుత్వం అంతకుమించిన స్థాయిలో గంజాయి వ్యాపారం జరుగుతుంటే ఏం చేస్తోంది? అని విజయకుమార్ నిలదీశారు. నెలకు రూ.2000 కోట్లు చొప్పున ఇప్పటికి 20వేల కోట్లకు పైగా గంజాయి వ్యాపారం జరిగింది. దీనిపై ప్రభుత్వం విచారణ చేపట్టాలి.. జ్యూడీషియల్ ఎంక్వైరీ వేసి నిజానిజాలు తేల్చాలి.
గత ప్రభుత్వం స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో తెస్తే.. ఈ ప్రభుత్వం ఈగల్ అంటూ కొత్త విభాగాన్ని తీసుకొచ్చినా అందులోని అధికారులకు ఎలాంటి పవర్స్, ఫండ్స్ ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఈవెంట్లు, స్టేట్మెంట్లకే పరిమితవుతోంది తప్ప ప్రజాసమస్యలు పట్టించుకోవడం లేదు. డ్రోన్లు, పీ-4, టూరిజం, సుపరిపాలన అంటూ ఈవెంట్లు చేస్తున్నారు తప్ప గంజాయి లాంటి సమస్యను పట్టించుకోవడం లేదు.
కమిషన్ల కోసం పెత్తందారీ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి.. పెత్తం దారుల పార్టీలకు మనం ఓట్లు వేసినంత కాలం జీవించే హక్కులను కోల్పోతున్నాం. పేదలకు అధికారం వస్తేనే ప్రజలకు, రాష్ట్రానికి మంచి జరుగుతుంది.. రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. గంజాయి మాఫియా నుంచి అందుతున్న కమిషన్ల కోసమే ప్రభుత్వంలోని కొందరు పెద్దలు వారిపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఈ మాఫియాలో 30 శాతం పోలీసులకు వెళ్తుంటే.. మిగిలినది అధికారంలో ఉన్న నాయకులకు వెళ్తోంది. రెవెన్యూ ఇంటెలిజెన్స్ నార్కోటిక్ బ్యూరో గంజాయి స్మగ్లింగ్ లో ఏపీ ప్రధమ స్థానంలో ఉందని నివేదిక ఇచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వం పరువు పోయినట్లే.. పోలీసులు, నాయకులు, గంజాయి మాఫియా కుమ్మక్కై రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. రాజకీయ నాయకులకు ఓట్లు మాత్రమే కావాలి.
రాష్ట్ర భవిష్యత్తు అవసరం లేదు. ప్రభుత్వ పాలనను ప్రజల ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థను కూటమి ప్రభుత్వం నాశనం చేస్తోంది. ప్రజల సంక్షేమం కోసం, వారి అవసరాల కోసం తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వాలు కొనసాగించాలి. ప్రజలపై, చిన్న ఉద్యోగులపై రాజకీయ కక్షలు తీర్చుకోవడం మానుకోవాలి. సచివాలయ వ్యవస్థను పటిష్ఠంగా నిర్వహించాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. యువత కోసం, వారి భవిష్యత్తు నిర్వీర్యం కాకుండా ఉండేందుకు పోరాటం చేస్తాం. ప్రభుత్వం మెడలు వంచి యువతకు ఇచ్చిన హామీలు అమలు చేసేలా కార్యాచరణతో ముందుకు వెళ్తాం.