– ప్రభుత్వాసుపత్రిలో 10 రకాల ఓపీ, ఐపీ విభాగాలు
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, సెప్టెంబర్ 9: వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల స్థితిగతులపై దృష్టి పెట్టడం వల్లే కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని ఏరియా ప్రభుత్వాసుపత్రికి రూ. 10.70 కోట్ల నిధులు మంజూరయ్యాయని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో జరుగుతున్న నూతన భవన నిర్మాణ పనులను మంత్రి కొడాలి నాని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా 1983 లో గుడివాడ పట్టణంలో 100 పడకల ప్రభుత్వాసుపత్రి నిర్మాణం జరిగిందన్నారు. ఈ భవనం శిథిలమైందని, స్లాబ్ పెచ్చులు ఊడి రోగులు, వైద్యులపై పడుతున్నాయన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ మూడు అంతస్థుల భవనాన్ని తొలగించి కొత్త భవన నిర్మాణం చేసేందుకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు.
గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో నూతన భవన నిర్మాణం అవసరాన్ని గుర్తించిన సీఎం జగన్మోహనరెడ్డి వెంటనే రూ. 10.70 కోట్ల నిధులను మంజూరు చేస్తూ దీనికి సంబంధించిన జీవోను విడుదల చేశారన్నారు. అప్పటి వరకు ఈ విషయం తనకు గాని, ఇక్కడి వైద్యులకు గాని తెలియదన్నారు. ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధి, ఆధునికీకరణ విషయంలో సీఎం జగన్మోహనరెడ్డి ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడడం లేదని అర్ధం చేసుకోవచ్చన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ విలేజ్ క్లినిక్ లను నిర్మించడం జరుగుతోందన్నారు. దీనిలో భాగంగా గుడివాడ నియోజకవర్గానికి 27 హెల్త్ క్లినిక్ లు మంజూరయ్యాయన్నారు. వీటిలో కొన్నింటి నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రారంభించామని, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. ఈ హెల్త్ క్లినిక్ ల్లో ప్రత్యేకంగా ఏఎన్ఎం క్వార్టర్స్ ను కూడా నిర్మించడం జరుగుతోందన్నారు. గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో పాత భవనం స్థానంలో కొత్త భవనం నిర్మాణం జరుగుతుండడంతో ఓపీ, ఐపీ విభాగాలను వేరే భవనంలోకి మార్చారు. నూతన భవన నిర్మాణం పూర్తయితే పిడియాట్రిక్ , నెఫ్రాలజీ , ఆప్తమాలజీ, కార్డియాలజీ వంటి 10 రకాల ఓపీ, ఐపీ విభాగాలు అందుబాటులోకి రానున్నాయి. సీఎం జగన్మోహనరెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని పేదప్రజలకు అవసరమైన అన్నిరకాల వైద్య సేవలను అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్టు మంత్రి కొడాలి నాని తెలిపారు.