కరోనా కష్టాలు తొలగిపోవాలని శ్రీవిఘ్నేశ్వర స్వామిని వేడుకుంటున్నా

– రాష్ట్ర ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు
– ఎదురవుతున్న విఘ్నాలన్నీ తొలగిపోవాలి
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, సెప్టెంబర్ 9: గత రెండేళ్ళుగా కొనసాగుతూ వస్తున్న కరోనా కష్టాలు తొలగిపోవాలని శ్రీవిఘ్నేశ్వర స్వామిని వేడుకుంటున్నానని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. వినాయకచవితి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి కొడాలి నాని శుభాకాంక్షలు తెలిపారు. భారతీయుల అతి ముఖ్యమైన పండుగల్లో వినాయకచవితి పర్వదినం ఒకటని అన్నారు. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుడు పుట్టినరోజును వినాయకచవితిగా జరుపుకుంటారని తెలిపారు. ఏదైనా పూజ, వ్రతం చేసేటపుడు ముందుగా ఎటువంటి విఘ్నాలు కలుగకుండా వినాయకుడిని పూజిస్తుంటారని చెప్పారు. పెళ్ళి, పుట్టినరోజు, శంఖుస్థాపన, గృహ ప్రవేశం, కొత్త వాహనాలు కొనడం, పరీక్షలకు సిద్ధం కావడం, వ్యాపారాలు మొదలు పెట్టడం, ముహూర్తాలు నిర్ణయించడం వంటి ఎన్నో సందర్భాల్లో విఘ్నేశ్వరుడిని స్మరించుకుంటారని చెప్పారు. ముందుగా వినాయకుడిని పూజిస్తే ఎటువంటి ఆటంకాలు రాకుండా కార్యసిద్ధి, అప్లైశ్వర్యాలు లభిస్తాయని, కష్టాలు దూరంగా ఉంటాయని భక్తులు నమ్ముతుంటారన్నారు.
ఇదిలా ఉండగా కరోనా మొదటి, రెండవ వేవ్ ల్లో అనేక కష్టనష్టాలను ఎదుర్కొన్నామని, మూడవ వేవ్ వస్తుందనే హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నామన్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ, రాత్రి వేళల్లో కర్ఫ్యూను అమలు చేస్తున్నామన్నారు. వినాయకచవితి పండుగకు రాష్ట్రంలో కొత్తగా ఎటువంటి నిబంధనలు అమల్లో లేవని, కేంద్రం సూచించిన మార్గదర్శకాలు మాత్రమే అమలవుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి వినాయకచవితి వేడుకలను వైభవోపేతంగా జరుపుకోవాలని సూచించారు. మార్కెట్లలో దుకాణాలను సందర్శించేటపుడు, పూజా సామాగ్రిని కొనుగోలు చేసేటపుడు కోవిడ్ నిబంధనలను పాటించాలని, తప్పనిసరిగా మాలు ధరించాలన్నారు. దేవాలయాల్లో కూడా కోవిడ్ మార్గదర్శకాలకనుగుణంగా పూజలు జరుగుతున్నాయని, భక్తులు గుమికూడి ఉండకుండా భౌతిక దూరం పాటించాలన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సీఎం జగన్మోహనరెడ్డి ప్రభుత్వం, అధికార యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తున్నాయని చెప్పారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖశాంతులతో విలసిల్లాలని కోరుకున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, సంక్షేమ పథకాల అమలుకు ఎదురవుతున్న విఘ్నాలు తొలగిపోవాలని మంత్రి కొడాలి నాని విఘ్నేశ్వరుడిని ప్రార్ధించారు.

Leave a Reply