-ఐఆర్ బి ఇన్ ఫ్రా కంపెనీపై గతంలో సీబీఐ కేసు
-పూణే లోనేవాలాలో బిగ్ స్కామ్
-ఐఆర్ బి పై ఫిర్యాదు చేసిన జర్నలిస్టు సతీష్ చెట్టి దారుణ హత్య
-ఐఆర్ బి అధినేత వీరేంద్ర మహిస్కర్ మరో 17మందిపై సీబీఐ ఛార్జిషీటు
-2017లో సీబీఐ చార్జిషీట్
-ఏడాదిలోపే కేసు నుంచి బయటపడ్డ వీరేంద్ర
-అదే కంపెనీకి అవుటర్ రింగ్ రోడ్డు టోల్ కాంట్రాక్టు
-ఘనచరిత్ర ఐఆర్ బి ఇన్‌ఫ్రా ది
-158 కిలో మీటర్లు కాంట్రాక్టు
-7380 కోట్ల విలువ
-వెయ్యికోట్లు చేతులు మారాయన్నవిపక్షాల ఆరోపణలు
-ఇదీ ఐఆర్ బి ఇన్ ఫ్రా కంపెనీ చరిత్ర
( వేముల సత్యనారాయణ)
అది సర్కారుకు.. దాదాపు పదివేల కోట్ల రూపాయలకు పైగా, భారీ ఆదాయం వచ్చే భారీ ప్రాజెక్టు. హైదరాబాద్‌లో ఏడాదికేడాది వాహనాల సంఖ్య పెరుగుతోంది. మరి 30 ఏళ్లలో ఎన్ని వాహనాలు పెరుగుతాయో ఊహించుకోవచ్చు. అంటే ఆ మార్గంలో ఎన్ని వాహనాలు వెళితే, సదరు కంపెనీకి అంత లాభం. ఆ లాభం ఒక ఏడాదికే అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఏకంగా 30 ఏళ్ల కాంట్రాక్టు అది. ఆ లెక్కన సదరు కంపెనీ కూడబెట్టే సంపద ఎంతో ఊహించుకోవచ్చు. వాహనాలపై టోల్ విషయంలో సదరు కంపెనీ చెప్పిందే రేటు. ఆ డబ్బు కట్టి రోడ్డు దాటాల్సిందే ఎవరైనా!
దాదాపు పదివేల కోట్ల రూపాయలకు పైగా వచ్చే ఆదాయం ఉన్న, ఆ భారీ ప్రాజెక్టును 7380 కోట్లకే ఎందుకు కట్టబెట్టారు? సదరు కంపెనీపై పాలకులపై అంత ప్రేమెందుకు? నిజంగా విపక్షాలు ఆరోపిస్తున్నట్లు.. ఈ ప్రాజెక్టు కేటాయింపులో వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందా? రేవంత్‌రెడ్డి చెప్పినట్లు ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, ముడుపులపై విచారణ జరిపిస్తారా? దేశంలో ఎన్నో పెద్ద కంపెనీలు ఉండగా ఆ కంపెనీకే మూడు వేల కోట్లు తక్కువకు ఎందుకు కట్టబెట్టినట్లు? అసలు ఆ కంపెనీ చరిత్ర ఏమిటి? దాని గతం ఘనమేనా? మచ్చలేని కంపెనీయేనా? మచ్చలు లేకుంటే.. మరి గతంలో నమోదయిన సీబీఐ కేసు- ఆ తర్వాత దాని నుంచి బయటపడిన ఘరానా కథేమిటి? ఇదీ ఇప్పుడు అవుటర్ రింగ్‌రోడ్ టోల్ ప్రాజెక్టు పట్టేసిన ఐఆర్‌బి ఇన్‌ఫ్రా కంపెనీ గురించి తెలంగాణ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న హాట్ టాపిక్
హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు టోల్ కాంట్రాక్టును దక్కించుకున్న ఐఆర్ బి ఇన్ ఫ్రా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన పేరు…అసలీ ఐఆర్ బి ఇన్ ఫ్రా కంపెనీ ఎవరిది? ఎలా దక్కింది ఇంత పెద్ద కాంట్రాక్టు అనే విషయాల్లోకి వెళ్లే ముందు ఆ కంపెనీ గత చరిత్రను పరిశీలిస్తే నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పీసీసీ ఆధ్యక్షుడు రేవంత్ రెడ్డి పదే పదే ఆరోపణలు చేస్తున్న ఐఆర్ బి ఇన్ ఫ్రా కంపెనీ అధినేత పైనే, గతంలో సిబిఐ కేసు నమోదు చేసింది..ఓ భారీ కుంభకోణానికి సంబంధించి!
158 కిలో మీటర్ల అవుటర్ రింగ్ రోడ్డు టోల్ కాంట్రాక్టు..అదీ 30 ఏళ్లకు . తెలంగాణ ప్రభుత్వానికి దక్కేది 7,380 కోట్ల రూపాయలు.. ముంబాయికి చెందిన ఓ కంపెనీకి పెద్ద కాంట్రాక్టును అప్పగించడంలో వేయి కోట్ల రూపాయలు చేతులు మారాయని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు.. ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్న సంస్ధ కాబట్టే, ఐఆర్ బి ఇన్ ఫ్రా కి ఈ కాంట్రాక్టు అప్పగించారని రేవంత్ ఆరోపించారు.
అయితే ఐఆర్ బి ఇన్ ఫ్రా కంపెనీ గత చరిత్ర ను పరిశీలిస్తే అనేక వివాదాలు ..కేసులు సాక్ష్యంగా కన్పిస్తున్నాయి. బి ఇన్ ఫ్రా చైర్మన్,మేనేజింగ్ డైరక్టర్ వీరేంద్ర మహిస్కర్.. దేశంలోని అనేక ప్రాంతాల్లో టోల్ కాంట్రాక్టులు దక్కించుకోవడంలో ఘనాపాఠి..ఆయనపై మహరాష్ట్రలో సిబిఐ అధికారులు కేసు నమోదు చేశారు..అదీ ఓ బడా కుంభకోణానికి సంబంధించి..పూణే లోనేవాలా ప్రాంతంలో జరిగిన భూ కుంభకోణాన్ని 2010 ప్రాంతంలో జర్నలిస్టు సతీష్ చెట్టి బహిర్గతం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు..ఎఫ్ఐఆర్ చేయించారు..అంతవరకు బాగానే ఉంది.. ఆ తర్వాతే ఏడాది లోపే సతీష్ చెట్టిని దారుణంగా హత్య చేశారు కొందరు వ్యక్తులు.సతీష్ చెట్టి హత్య తర్వాత ఐఆర్ బి ఇన్ ఫ్రా పై సతీష్ చెట్టి పెట్టిన కేసును స్ధానిక పోలీసులు క్లోజ్ చేశారు.
విషయాన్ని కొన్ని సంస్ధలు ఉన్నత న్యాయస్ధానాల దృష్టికి తీసుకుని వెళ్లడంతో సిబిఐ దర్యాప్తుకు అప్పగించింది న్యాయస్ధానం. ఐఆర్ బి కార్యాలయాల్లో, చైర్మన్ ఇళ్లల్లో పలుమార్లు సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు.ఎట్టకేలకు సుదీర్ఘ దర్యాప్తు తర్వాత ఐఆర్ బి ఇన్ ఫ్రా చైర్మన్ వీరేంద్రతో పాటు మరో 17మందిపై సిబిఐ అధికారులు చార్జీషీట్ దాఖలు చేశారు.
ఏడాది పాటు సాగిన విచారణ తర్వాత 2018లో ఈ కేసు నుంచి, వీరేంద్ర ఆయనకు చెందిన కంపెనీల పాత్రను కేసు నుంచి మినహయిస్తూ సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తర్వాత ఈ కేసు ఇంకా అనేక మలుపులు తిరుగుతూనే ఉంది.
ఇదీ ఐఆర్ బి కంపెనీకి సంబంధించిన కథ..ఇలాంటి చరిత్ర ఉన్న కంపెనీ…దాదాపు పదివేల రూపాయల విలువైన కాంట్రాక్టును 7380 కోట్లకు దక్కించుకోవడం వెనుక, వెయ్యికోట్ల రూపాయల మేర ముడుపులు చేతులు మారాయన్న విపక్షాల ఆరోపణలు ప్రస్తుతం తెలంగాణలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.