-ఏపీ సీఎంకి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ
రైతుల పంటలు కొనుగోలు బాధ్యత ప్రభుత్వానిదే అని ప్రకటించిన ముఖ్యమంత్రి పట్టించుకోవడంలేదని, తక్షణమే తాను సీఎంనని గుర్తు చేసుకుని మద్దతు ధరతో రైతుల వద్ద నుంచి పసుపు, మొక్కజొన్న మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. సీఎంకి రాసిన లేఖని మంగళవారం మీడియాకి విడుదల చేశారు.
లేఖలో ముఖ్యాంశాలు
– ఈ ఏడాది దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డు నుంచి మీ ప్రభుత్వం చేసిన పసుపు కొనుగోలు సున్నా.
– టిడిపి ప్రభుత్వం 2017లో క్వింటా రూ.6500 చొప్పున మొత్తం పసుపు కొనుగోలు చేసింది.
– వైకాపా అధికారంలోకి వచ్చాక 2020లో క్వింటాకి రూ. 6850 మద్దతు ధరతో కేవలం వైసీపీకి చెందిన వారివద్దే పసుపు కొనుగోలు చేయడం చాలా దారుణం.
– వైకాపా పాలనలో కరెంటు చార్జీలు, పెట్రోల్-డీజిల్ రేట్లు, కూలీ ఖర్చులు, ఎరువులు, పురుగుమందుల ధరలు విపరీతంగా పెరిగి పెట్టుబడి వ్యయాలు రెండింతలయ్యాయి.
– ఈ ఏడాది వర్షాల వల్ల పసుపు(కటుకు) రంగు మారడంతో మరీ దారుణంగా క్వింటా రూ.3500-4500 రేటు అంటూ రైతుల్ని నిలువునా దోచుకుంటున్నారు.
– ఎకరాకి 75వేలు పెట్టుబడి అయినప్పుడు మద్దతు ధర రూ. 6850 ఉంటే, అన్ని రేట్లూ పెరిగి ఎకరాకి లక్షా 50 వేలు పెట్టుబడి పెట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో గిట్టుబాటు ధర గరిష్టంగా రూ.4500 దాటడంలేదు.
– గరిష్టంగా పసుపు క్వింటాకి రూ.10వేలు మద్దతు ధరకి పార్టీలు చూడకుండా రైతులందరి వద్ద నుంచీ కొనుగోలు చేయాలి.
– ఏప్రిల్ మొదటివారం నుంచి పసుపు కొనుగోలు చేస్తామని, ఆర్బీకేలో నమోదు చేసుకోవాలని పసుపు రైతులని కోరుతూ జాయింట్ కలెక్టర్ ఇచ్చిన పత్రికాప్రకటన ప్రకటనకే పరిమితమైంది.
– మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు మూడు వేల ఎకరాలలో పసుపు పండిస్తే, ఒక్క క్వింటా పసుపు కొనుగోలు చేసిన పాపాన పోలేదు. దుగ్గిరాల మార్కెట్ పరిధిలో 20 వేల ఎకరాలలో పండే 4 లక్షల బస్తాల పసుపు ఇంకెప్పుడు కొంటారో?
– మా మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు 25 వేల ఎకరాలలో మొక్కజొన్న పండింది. ఎకరాకి పెట్టుబడి రూ.30 వేలు దాటిపోయింది. పంట దిగుబడి తగ్గిపోయింది. వర్షాలకు మొక్కజొన్న నాణ్యత తగ్గిందని, ధర తగ్గించి రూ.1500నుంచి రూ.1600కి కొంటున్నారు.
– ఈ సంక్షోభ సమయంలో మొక్కజొన్నకి ప్రభుత్వం నిర్ణయించి కనీస మద్దతు ధర రూ.1962 ఇచ్చి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది.
– వైసీపీ సర్కారు ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాల వైఫల్యం రైతుల పాలిట శాపంగా మారింది.
– పార్టీలు చూడకుండా రైతులందరి నుంచీ పసుపు, మొక్కజొన్న పంటలని మద్దతు ధరతో కొనుగోలు చేసి వెంటనే చెల్లింపులు చేయాలని కోరుతున్నాను.