మీల్ మేకర్, సోయా చంక్స్… ఈ రెండూ ఒక్కటేనా? ఈ సందేహం మీకు ఉందా? అయితే స్పష్టంగా చెబుతున్నాం వినండి… ఆ రెండూ ఒక్కటే. ఒకప్పుడు మీల్ మేకర్ అనే పేరే వాడుకలో ఉండేది. ఇప్పుడు సోయా చంక్స్ పేరుతో బ్రాండెడ్ మీల్ మేకర్ మార్కెట్లో దొరుకుతుంది.
నిజానికి ఈ రెండూ తయారయ్యేది సోయా గింజలతోనే. కాకపోతే నాణ్యతలో మాత్రం తేడాలుంటాయి. తక్కువ నాణ్యత కలవి వండితే చాలు మెత్తగా మారిపోతాయి, మంచి నాణ్యమైనవి వండినా కూడా తినడానికి వీలైనంత మెత్తగా మాత్రమే ఉడుకుతాయి. రుచి కూడా బావుంటుంది. ఇది పూర్తి శాకాహార వంటకం. ఎవరైనా తినవచ్చు.
తయారీ ఇలా…
సోయా చిక్కుడు గింజల నుంచి ఆయిల్‌ను ముందుగా వేరుచేస్తారు. అప్పుడు సోయా పిండి మిగిలిపోతుంది. సోయా నూనెను తయారు చేస్తున్నప్పుడు ఏర్పడే ఉప పదార్థమే సోయా పిండి. ఆ పిండిని మీల్ మేకర్ గా మారుస్తారు. దీనిలో కూడా పోషకాలు అధికంగానే ఉంటాయి. ముఖ్యంగా కొవ్వు ఉండదు. దీన్ని వెజిటేరియన్ మీట్ అని చెప్పుకోవచ్చు. అందుకే పాశ్చాత్యదేశాల్లో సోయా మీట్ అని కూడా పిలుస్తారు.
సోయా చంక్స్ లేదా మీల్ మేకర్… ఎలా పిలుచుకోవాలన్నది మీ ఇష్టం. వీటితో చేసిన వంటకాలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. గుండెజబ్బులు, క్యాన్సర్లు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని చాలా మేరకు తగ్గిస్తుంది. వీటిలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి కాబట్టి మాంసాహారం తినని వారికి ఇది ఉత్తమ ఎంపిక. 100 గ్రాముల సోయా చంక్స్ లో 50 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. శక్తి బాగా అందుతుంది.
వీటిని తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొవ్వు శాతం పెరుగుతుంది. అందుకే వీటిని తినడం వల్ల బరువు కూడా పెరగరు, పైగా తగ్గుతారు కూడా. ఇవి ఫైబర్ తో నిండి ఉంటాయి కాబట్టి మధుమేహం ఉన్న వారు వీటిని తమ ఆహార మెనూలో చేర్చుకోవచ్చు. సులభంగా జీర్ణం అవుతాయి. ఎలాంటి అజీర్తి సమస్యలు రావు. చర్మం, జుట్టు ఆరోగ్యంగా పెరుగుతాయి.
– సేతు వేణుమాధవ్
రాజమండ్రి