రాజాసింగ్ వ్యాఖ్యలపై ఈసీ నోటీసులు

ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకపోతే బుల్డోజర్లతో తొక్కించేస్తామని యూపీ ఓటర్లను బెదిరించిన తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఐపీసీ, ఆర్‌పీ చట్టం, ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు అతనిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఈసీ స్పష్టం చేసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసే పేరున్న ఎమ్మెల్యే రాజాసింగ్.. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ వీడియో షేర్ చేశారు.

హిందువులందరూ ఏకం కావాలి.. హిందువులంతా యోగి ఆదిత్యనాథ్‌కు ఓటు వేయాల్సిందేనని పిలుపునిచ్చాచ్చారు. ఎన్నికల్లో యోగి ఆదిత్యానాథ్‌కు ఓటు వేయనివారంతా ద్రోహులు అని.. వారికి ఉత్తర ప్రదేశ్‌లో స్థానం లేదని హెచ్చరించారు. యోగికి ఓటు వేయని వారిని తరిమి తరిమి కొడతామని వార్నింగ్‌ ఇచ్చారు. యోగీకి ఓట్లు వేయనివారిని గుర్తిస్తామని.. ఇప్పటికే వందల సంఖ్యలో బుల్‌డోజర్లు, జేసీబీలకు ఆర్డర్ ఇచ్చారన్నారు. బుల్‌డోజర్లు, జేసీబీలను ఎందుకు తెప్పిస్తున్నారో.. తెలుసా? యోగికి ఓటు వేయని వారిని గుర్తించి.. వారి ఇంటికి వందల సంఖ్యలో బుల్‌డోజర్లు, జేసీబీలతో ఇళ్లను కూల్చి వేస్తామని ప్రకటించారు.

రాజా సింగ్‌ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై స్పందించిన రాజాసింగ్ తన వ్యాఖ్యలపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అఖిలేష్ ప్రభుత్వంలో మాఫియా రాజ్యం నడిచిందని..యోగి ప్రభుత్వం వచ్చాక ఆ మాఫియాను బుల్డోజర్లతో ఎత్తేశారని, ఆ ఉద్దేశంతోనే తాను బుల్డోజర్ వ్యాఖ్యలు చేశానన్నారు. తన వ్యాఖ్యలు వైరల్ కావడంతో రాజా సింగ్ మరో వీడియో విడుదల చేశారు. ఈసీకి కూడా ఇదే సమాధానం పంపే అవకాశం ఉంది.

Leave a Reply