వాస్తవాలు వక్రీకరించిన విజయసాయిరెడ్డి
– బీజేపీ నేత లంకా దినకర్
ఏపీ ఆర్థిక పరిస్థితి బీహార్ కంటే అధ్వానంగా తయారయిందని బీజేపీ నేత లంకా దినకర్ విమర్శించారు. ఘోరంగా ఉన్న ఆర్థిక పరిస్థితిని కూడా సమర్ధించుకోవడం విజయసాయిరెడ్డికే చెల్లిందని ఎద్దేవా చేశారు. ఆ మేరకు ఆయన వివిధ రాష్ట్రాల ఏపీ సర్కారు చేసిన అప్పుల వివరాలు, మిగిలిన రాష్ట్రాలతో పోల్చుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. పరిపాలించడం చేతకాక, అప్పులతోనే బండి లాగిస్తున్న ఈ ప్రభుత్వాన్ని నడిపేందుకు జగనే అవసరం లేదు. ఎవరున్నా చాలు అని వ్యాఖ్యానించారు. ఆయనేమన్నారంటే..
కోవిడ్19 సంక్షోభం వల్ల అన్ని రాష్ట్రాలు ,కేంద్రం అదనపు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది అన్నది ఎంత సత్యమో, మిగతా రాష్ట్రాలకన్నా పరిమితులకు లోబడి ఆంధ్రప్రదేశ్ అప్పులు చేసింది అన్న మీ వ్యాఖ్యలు పూర్తి అసత్యం.
నిజంగా ఆంధ్రప్రదేశ్ అప్పులు అదుపులోనే ఉంటే కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్ధిక సంవత్సరం లో 17,924 కోట్లు గత సంవత్సరపు ఎఫ్ఆర్బీఏం మించి చేసిన అదనపు అప్పులకు కత్తెర వేస్తామంటే, జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రాబోయే మూడు సంవత్సరాలలో ఆ కత్తెర వేయమని కోరిందా, లేదా?
మీరు ప్రస్తావించిన రాష్ట్రాల అప్పులు ఆ రాష్ట్రాల జీఎస్డీపీ నిష్పత్తి ప్రకారం చూస్తే, ఆంధ్రప్రదేశ్ అంత అధ్వాన పరిస్థితి మన కన్నా, వెనుకబడిన బీహార్ లో కూడా లేదు.
ఇది రాష్ట్ర అప్పులు అదుపు తప్పడమా కాదా?
జీఎస్డీపీ తో అప్పుల నిష్పత్తి:
2020-21 ఆర్థికసంవత్సరం :
రాష్ట్రం జీఎస్డీపీ-అప్పుల నిష్పత్తి:
ఏపీ 35.20%
బీహార్ 34.30%
తెలంగాణ 22.00%
తమిళనాడు 24.98%
కర్నాటక 22.10%
వాస్తవాల లెక్కలు స్పష్టంగా ఉన్నా వక్రీకరణ ఎందుకు విజయసాయి రెడ్డి గారు ?