వంగవీటి రాధాకు బాబు ఫోన్..

ఏపీ రాజకీయాల్లో వంగవీటి రాధా ఎపిసోడ్ హాట్ టాపిక్ అవుతోంది. తన హత్యకు కుట్ర జరుగుతోందని, రెక్కి నిర్వహించారని రాధా కామెంట్ చేయడంతో అసలేం జరుగుతుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. తాజాగా వంగవీటి రాధా వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. వంగవీటి రాధాకు చంద్రబాబు ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాధాపై రెక్కీ నిర్వహించిన వ్యవహారంపై ఆరా తీశారు చంద్రబాబు.

రాధా తనకు కేటాయించిన గన్ మెన్లను తిరస్కరించడం సరి కాదన్నారు చంద్రబాబు. వ్యక్తిగత భద్రత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాధాకు సూచనలు చేశారు. భద్రత విషయంలో అశ్రద్ద వద్దన్నారు చంద్రబాబు. వంగవీటి రాధాకు పార్టీ పూర్తి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. కుట్ర రాజకీయాలపై పార్టీపరంగా పోరాడదామన్నారు చంద్రబాబు. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు బాబు లేఖ రాశారు.

డీజీపీ సవాంగ్‌కు చంద్రబాబు లేఖ..

టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు లేఖ రాసారు. వంగవీటి రాధా హత్యకు జరిగిన రెక్కీపై సమగ్ర విచారణ జరుపాలని చంద్రబాబు కోరారు.దోషులపై చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్‌ చేశారు. రాధాకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని, ఏపీలో శాంతిభద్రతల పరిస్థితి భయంకరంగా ఉందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. బెదిరింపుల పరంపరలో వంగవీటి రాధాను లక్ష్యంగా చేసుకున్నారని ఆయన అన్నారు. ఇలాంటి చర్యలు ఆటవిక పాలనను తలపిస్తున్నాయని, హింసాత్మక ఘటనలపై చర్యలు లేకే ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆయన తెలిపారు.

Leave a Reply