Suryaa.co.in

Andhra Pradesh

విద్యుత్ చార్జీలు పెంచం!

– ఆ ఆలోచన కూటమి ప్రభుత్వానికి లేదు
– సాధారణ ఎన్నికల నాటికి విద్యుత్ ఛార్జీల త‌గ్గింపే ల‌క్ష్యం
– ఉత్త‌మ సాంకేతిక‌త‌, శిక్ష‌ణ‌తో విద్యుత్ ప్ర‌మాదాల తగ్గుదల
– దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ శిక్ష‌ణా కేంద్రంగా సూప‌ర్ ఈసీబీసీ
– రాష్ట్ర వ్యాప్తంగా 13 నెలల్లో 180 కారుణ్య నియామకాలు
– విశాఖలో ఒక్క రోజే 20 మందికి నియామక పత్రాలు అందజేత
– విశాఖ సూప‌ర్ ఈసీబీసీ శిక్ష‌ణా కేంద్రం ప్రారంభోత్స‌వంలో మంత్రి గొట్టిపాటి

విశాఖ‌ప‌ట్నం: ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల‌ను త‌గ్గించ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకెళ్తున్నామ‌ని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్ప‌ష్టం చేశారు. ఏపీఈపీడీసీఎల్ ఆధ్వ‌ర్యంలో విశాఖ‌ప‌ట్నంలో రూ.14 కోట్ల వ్యయంతో నిర్మించిన సూప‌ర్ ఈసీబీసీ భ‌వ‌నాన్ని శుక్ర‌వారం మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ ప్రారంభించారు. కార్యక్రమ అనంత‌రం మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ… విద్యుత్ ఉద్యోగుల శిక్ష‌ణ కోసం ప్ర‌త్యేకంగా నిర్మించిన సూప‌ర్ ఈసీబీసీ భ‌వ‌నం దేశంలోనే అత్యుత్త‌మ శిక్ష‌ణ కేంద్రంగా నిలుస్తుంద‌ని ఆకాంక్షించారు. ఈసీబీసీ నిబంధనలకు అనుగుణంగా నిర్మించిన ఈ భ‌వ‌నం ద్వారా సుమారు 40 శాతంపైగా విద్యుత్ ఆదా అవుతుండ‌టం ఆద‌ర్శ‌ప్రాయమ‌ని కొనియాడారు.

విద్యుత్ శాఖలో వివిధ ప్రమాదాలతో విధుల్లో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. ఈపీడీసీఎల్ పరిధిలోని సుమారు 20 మందికి సంస్థలో ఉద్యోగం కల్పిస్తు ఉత్తర్వులు అందజేశారు. విద్యుత్ శాఖలో ఉద్యోగులు చనిపోతే వారి కుటుంబాలు ఏళ్ల తరబడి ఉద్యోగం కోసం ఆఫీసుల చుట్టూ తిరగకుండా వీలైనంత తక్కువ రోజుల్లోనే నియామక పత్రాలు అందజేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్ర‌మాదాల్లో మ‌ర‌ణించిన వారికి కూట‌మి ప్ర‌భుత్వం అన్ని విధాలా అండ‌గా ఉంటుంద‌ని మంత్రి గొట్టిపాటి తెలిపారు.

24 గంట‌లూ నాణ్య‌మైన గ్రీన్ ఎన‌ర్జీని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు అందించే ల‌క్ష్యంతో ముందుకెళ్తున్న‌ట్లు చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వ స‌హ‌కారంతో 20 ల‌క్ష‌ల సోలార్ విద్యుత్ క‌నెక్ష‌న్ల‌ను ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు, ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ క‌నీసం 10 వేల సోలార్ విద్యుత్ క‌నెక్ష‌న్లు ఇచ్చేందుకు కృషి చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. సోలార్ క‌నెక్ష‌న్ల‌ను వేగ‌వంతం చేసే క్ర‌మంలో ఎదుర‌య్యే ఇబ్బందులను అధిగ‌మించేందుకు స్థానిక సోలార్ త‌యారీదారుల‌ను ప్రోత్స‌హిస్తున్నామ‌న్నారు. అదే విధంగా పీఎం కుసుమ్ ప‌థ‌కంలో భాగంగా… వ‌చ్చే వ్య‌వ‌సాయ సీజ‌న్ నాటికి… రైతుల‌కు ప‌గ‌టి పూటే 9 గంట‌ల నాణ్య‌మైన విద్యుత్ ను అందిస్తామ‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. దీనితో పాటు రాష్ట్రంలోని మూడు ల‌క్ష‌ల వ్య‌వ‌సాయ పంపు సెట్ల‌కు సోలార్ క‌నెక్ష‌న్ల‌ను అనుసంధానించే ప్ర‌క్రియ వేగ‌వంతం చేసిన‌ట్లు మంత్రి గొట్టిపాటి తెలిపారు.

ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మాట్లాడుతూ, ఈ సూపర్ ఈసిబీసి భవనం ఇంధన సామర్థ్య నిర్మాణానికి ప్రతీకగా నిలిచే విధంగా ఉండటమే కాకుండా, ఈసిబీసి ప్రమాణాలను ప్రజలలో, సమాజంలో చైతన్యం కలిగించే ప్రత్యక్ష నమూనాగా పనిచేస్తుందని చెప్పారు.

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఏపీఈపీడీసిఎల్ పరిధిలోని విశాఖపట్నం జిల్లాలో విద్యుత్ పిల్ఫరేజ్ అత్యల్పంగా ఉందని తెలిపారు. నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో నాణ్యమైన విద్యుత్ అవసరమని చెప్పారు. ఎంపీ ఎం. భరత్ మాట్లాడుతూ రూఫ్ టాప్ సోలార్ అమలును వేగవంతం చేయాలని కోరుతూ, సూపర్ ఈసిబీసి భవనాన్ని విజయవంతంగా నిర్మించిన ఈపీడీసిఎల్ను అభినందించారు.

ఎంఎల్సీ వి. చిరంజీవిరావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో ప్రారంభమైన విద్యుత్ రంగ సంస్కరణలను గుర్తు చేస్తూ, జన్ మన్ పథకం అమలు, విద్యుత్ పంపిణీ నష్టాలను తగ్గించడం లో ఏపీఈపీడీసిఎల్ చేసిన కృషిని ప్రశంసించారు. ఏపీఈపీడీసిఎల్ సిఎండీ ఐ. పృథ్వీ తేజ్ మాట్లాడుతూ, 5.54 లక్షల ఫిర్యాదుల్లో 97% ఫిర్యాదులను పరిష్కరించామని తెలిపారు.

మంత్రి గొట్టిపాటి రవి కుమార్, సీఎస్ విజయానంద్, సీఎండీ ఫృథ్వీతేజ ఇమ్మడి పెద వాల్తేరు లో ఏర్పాటు చేసిన స్కాడా భవనాన్ని, విశాఖ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్‌ను సందర్శించి మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో విశాఖపట్నం కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్, ఏపీఈపీడీసిఎల్ డైరెక్టర్లు, సీనియర్ అధికారులు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE