-శాసనసభ మాజీ స్పీకర్ ప్రతిభా భారతి
తెలుగువాడి కీర్తిపతాకను అంతర్జాతీయస్థాయిలో ఎగువరవేసిన అన్న నందమూరి తారకరామారావు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేపట్టి నాలుగు దశాబ్ధాలు పూర్తిచేసుకున్న తరుణంలో యావత్ తెలుగుప్రజలకు అభినందనలు తెలియ జేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లాలో ఒ మారుమూల పల్లెలో పుట్టిన నాకు టిడిపి కారణంగానే శాసనసభ స్పీకర్ వంటి అత్యున్నతమైన అవకాశం లభించింది. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలను రాజ్యాధికారంలో భాగస్వాములను చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది.
ముఖ్యంగా వంటింటికే పరిమితమైన మహిళలకు ఆస్తిలో సమానహక్కు కల్పించి మహిళా సాధికారితకు పెద్దపీట వేసిన ఎన్టీఆర్ తోబుట్టువుగా నిలచి మహిళాలోకం మదిలో అన్నగా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. పేదవాడికి పట్టెడన్నం పెట్టలేని రాజకీయం దేనికంటూ రెండురూపాయల కిలోబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి పేదల హృదయాల్లో ఆరాధ్యదైవమయ్యారు.
డిల్లీ పాదాల చెంత బందీ అయిన తెలుగువాడి ఆత్మగౌరవాన్ని పునరుజ్జీవింపజేసి ప్రపంచం ముందు మేం తెలుగువారమని సగర్వంగా తలెత్తుకుని తిరిగేలా చేసిన మహనీయుడు అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ… తెలుగుజాతి ఉన్నంత కాలం ఈ తెలుగునేలపై అజరామరమై వెలుగొందుతుంది.