మళ్ళీ ఎవరి పంచాంగం వారిదే! ఎవరికి గ్రహాలు అడ్డు రాలేదు! హైదరాబాద్ రవీంద్రభారతిలో రేవంత్ రెడ్డి ని ఒక పంతులు కీర్తిస్తే, ఆటు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇంకో పంతులు కెసిఆర్ ను కెటిఆర్ ను కలిపి పొగడ్తల్లో ముంచెత్తారు! బిజెపి కార్యాలయంలో బండి సంజయ్, కిషన్ రెడ్డి లను ఆకాశానికి ఎత్తారు ఇంకో పంతులు గారు!
అటు బెజవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం లో మరీ పీక్స్ పొగడ్తలు! కేసులు ఏమయ్యాయో ఏమో గానీ పద్మశ్రీ కైవసం చేసుకున్న మాడుగుల నాగ ఫణి శర్మ పంతులు గారు అందరికన్నా ఒకడుగు ముందుకేసి ఆరవ సారి కూడా చంద్రబాబు సిఎం అవుతారని జోస్యం చెప్పారు. అన్నింట్లోను ఈ పంచాంగం కిక్ వేరయా! ఇటు వైసీపీ కేంద్ర కార్యాలయంలో కాబోయే ముఖ్యమంత్రి జగన్ అని ప్రకటించారు ఇంకో పంతులు! జనసేన కార్యాలయంలో తదుపరి ముఖ్యమంత్రి కొణిదెల వారే అని కీర్తించారు మరో పంతులు!
అన్నానని కాదు కానీ, పంచాంగం పార్టీ పార్టీకి, జెండా జెండాకు మారుతుందా? పంతులు పంతులుకు మారిపోతుందా? ఈ మాయ ప్రపంచంలో ఏది నిజం? ఏది అబద్ధం? ఒకే పంచాంగం ఉండాలిగా! వుంటుందిగా! ఎవరు చూసినా ఎవరు రాసినా ఆ రాశుల సంచారం బట్టి రాయాలిగా! ఎవరికైనా అదే కనిపించాలిగా! ప్రజల గురించి ఎవ్వరు చెప్పరు! ఎవరు ఏర్పాటు చేసి వారికి సంభావన ఇచ్చేస్తే కీర్తించి పడేస్తారు! ఆ మాటలకు ఆ నేతలు మురిసిపోతారు! అఫ్ కోర్స్ ప్రేక్షకులు కూడా నవ్వుకుంటారనుకోండి! ఆ నవ్వులు పలు రకములు!
– రవికుమార్