Suryaa.co.in

Andhra Pradesh

ప్రతిభకు పురస్కారాలే ప్రోత్సాహకాలు

– కస్టమ్స్,సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి

మూడు దశాబ్దాలుగా విశిష్ట వ్యక్తులకు, కళాకారులకు పురస్కారాలు అందచేస్తున్న గుంటూరులోని ప్రముఖ సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ ఇ.వి.వి.యువ కళావాహిని ఈ యేడాది విశ్వా వసు నామ సంవత్సర ఉగాది పురస్కారాన్ని కస్టమ్స్, సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి (ఐ.అర్.ఎస్) కి అందచేసారు.

బ్రాడిపేట లోని ఒక హోటల్లో జరిగిన కార్యక్రమంలో కళావాహిని అధ్యక్షుడు వెచ్చా కృష్ణమూర్తి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఏల్చూరి వెంకటేశ్వర్లు చేతుల మీదుగా కమిషనర్ నరసింహారెడ్డి ని ఉగాది విశిష్ట సేవా పురస్కారం తో సత్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ…ఉగాది పురస్కారం వ్యక్తిత్వానికి, నిబద్ధతకు సూచిక అని, ఇది మరింత బాధ్యతగా తమ ఉద్యోగంలో ముందుకు సాగటానికి దిక్చూచి గా పనిచేస్తుందని పేర్కొన్నారు.

వ్యక్తి పురోభివృద్ధికి ప్రోత్సాహకాలుగా పురస్కారాలు ఎంతో దోహదపడతాయన్నారు. ప్రభుత్వం అందించే అవార్డులు, సేవా సంస్థలు అందించే పురస్కారాలు ఉద్యోగుల ఉన్నతికి ప్రేరణ ఇస్తాయన్నారు. ఈ ఉగాది ఉషస్సులు నింపాలని, సత్ఫలితాలు ఇవ్వాలని కమిషనర్ ఆకాక్షించారు.

ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఏల్చూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కమిషనర్ నరసింహారెడ్డి ఉద్యోగ విధులతో పాటు, సామాజిక సేవకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమన్నారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు, అవయవదాన అంగీకార పత్రాల సేకరణ, వరద బాధితులను ఆదుకొనుట, స్వచ్చత కార్యక్రమాల నిర్వహణ వంటి సేవా కార్యక్రమాలను కమిషనర్ నిర్వహించటం జి.ఎస్.టి శాఖకు గర్వ కారణమన్నారు.

నిష్ణాతులైన, ప్రతిభ కలిగిన అధికారులను సత్కరించి, గౌరవించుకోవడం ఆనాది గా వస్తున్న తెలుగు సంప్రదాయమన్నారు. అందుకు జి.ఎస్.టి కమిషనర్ అన్ని విధాలుగా అర్హులన్నారు.

వెచ్చా కృష్ణమూర్తి మాట్లాడుతూ..ఉద్యోగ రంగంలో చూపిన అసాధారణ ప్రతిభ, సామాజిక సేవా రంగాలలో చేసిన కృషికి గుర్తింపుగా కమిషనర్ నరసింహారెడ్డికి తెలుగు ఉగాది పురస్కారాన్ని అందచేస్తున్నామన్నారు. సేవ, సంస్కారం, క్రమశిక్షణ, నిజాయితీ తో వ్యవహరించే అధికారులకు ప్రేరణ ఇవ్వడమే ఉగాది పురస్కార లక్ష్యమన్నారు. భవిష్యత్ లో ప్రభుత్వ కీర్తిని ఇమిడింపచేసాలా కమిషనర్ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాలని ఆకాక్షించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ, సామాజిక రంగాలలో కమిషనర్ చేసిన సేవలను సన్మాన పత్రం లో నిర్వాహకులు విశదీకరించారు. ఇది సమర్ధత కు, ప్రతిభ కు ఇచ్చిన ప్రశంస గా వారు పేర్కొన్నారు. తొలుత వేద పండితుల సమక్షంలో కమిషనర్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో కళావాహిని సభ్యులు టి. ఎల్.వి ఆంజనేయులు, ఉటుకూరు సుబ్బారావు, షరాబు కృష్ణ, ఏల్చూరి సత్యనారాయణ, చిట్టిప్రోలు రఘు, పి.కిరణ్, గార్లపాటి సత్యనారాయణ జి.ఎస్.టి అధికారులు మధుసూదనరెడ్డి, లక్ష్మీనారాయణ, వి.వెంకటేశ్వరరావు, ఎం. నాగరాజు, రవి కుమార్ చీదేళ్ళ ఈశ్వరరావు, గాదె శ్రీనివాసరెడ్డి, చిట్టే వెంకటేశ్వరరావు, కాకర్ల, పూర్ణసాయి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE