Suryaa.co.in

Andhra Pradesh

భలే.. భలే.. పిడకల యుద్ధం

– కైరుప్పలలో అద్భుత సమరం
– కర్నూలు జిల్లాలో ప్రాచీన ఆచారం
(బహదూర్)  

కర్నూలు జిల్లాలోని ఆస్పరి మండలం కైరుప్పలలో ఉద్రిక్తత నెలకొంది. సోమవారం రెండు వర్గాలుగా వీరభద్రస్వామి, కాళీకామాత భక్తులు విడిపోయారు. వీరి మధ్య హోరా హోరీగా పిడకల సమరం మొదలైంది. ఈ పిడకల సమరం చూసేందుకు భారీగా జనం తరలి వచ్చారు. శ్రీ వీరభద్రస్వామి, కాళికాదేవి మధ్య ప్రేమ వివాహం విజయవంతమైంది. అందుకు పిడకల సమరం దోహదపడటంతో ప్రతి ఏటా కైరుప్పల గ్రామంలో దీనిని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ వేడుకను నిర్వహించేందుకు గ్రామస్తులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలుత శ్రీవీరభద్రస్వామి, కాళీకాదేవికి గ్రామస్తులు పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి.. పిడకల సమరంలో పాల్గొన్నారు.

ఈ పిడకల సమరం చూసేందుకు కర్నూలు జిల్లా ప్రజలే కాకుండా పొరుగునున్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రజలు సైతం భారీగా కైరుప్పలకు చేరుకున్నారు. ఈ పిడకల సమరానికి చారిత్రక నేపథ్యంలో ఉందని గ్రామస్తులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు

చారిత్రక నేపథ్యం..

విహార యాత్రకు వెళ్లిన వీరభద్రస్వామిని చూసి కాళీకాదేవి ప్రేమలో పడింది. వివాహం చేసుకొంటానని ఆమెను వీరభద్రుడు మాట ఇస్తాడు. అయితే ఆ తర్వాత వీరభద్రస్వామి ఇచ్చిన మాట తప్పడంతో.. కాళీకా దేవి వర్గీయులకు ఆగ్రహం కట్టలు తెంచుకొంది. దీంతో వీరభద్రుడి వర్గీయులపై పిడకలతో దాడికి దిగారు. వీరభద్ర స్వామి వర్గీయులు సైతం ఎదురు దాడికి దిగారు.
ఈ నేపథ్యంలో ఈ పిడకల సమరాన్ని ఆపించి.. పెద్దలు పంచాయితీ చేసి.. వీరభద్రస్వామికి కాళీకాదేవికి వివాహం చేశారని గ్రామస్తులు ఈ సందర్భంగా వివరించారు. వీరభద్రస్వామి, కాళికాదేవి ప్రేమ వ్యవహారం కారణంగా భక్తులు పిడకల సమరం చేసుకోవడం శతాబ్దాలుగా ఆచారంగా వస్తోందని తెలిపారు.

పిడకల సమరం ఇలా

పుప్పాలదొడ్డి, చెన్నంపల్లి, అలారుదిన్నె, వెంగళాయదొడ్డి, కారుమంచి, కలపరి గ్రామాల ప్రజలు తమ కోరికలను తీర్చిన వీరభద్రుడికి మొక్కుబడి సమర్పించేందుకు ఒక నెల ముందు నుంచి పశువుల పేడతో ఈ పిడకలు తయారు చేస్తారని వివరించారు. ఉగాది వెళ్లిన మరుసటి రోజు ఆ పిడకలను దేవుడి సన్నిధిలో ఉంచుతారని.. ఆ క్రమంలో పిడకల సమరానికి ముందు భక్తులు రెండు వర్గాలుగా విడిపోతారని చెప్పారు. అనంతరం ఈ రెండు వర్గాలు పిడకలతో కొట్టుకుంటారని.. అయితే ఈ సమరంలో దెబ్బలు తగలకుండా తుండు గుడ్డలను గ్రామస్తులు తమ ముఖాలకు ముసుగు తొడుక్కుంటారని పేర్కొన్నారు.

దాదాపు అరగంట పాటు ఈ పిడకల సమరం జరుగుతోందని తెలిపారు. ఈ సమరంలో పలువురు భక్తులు గాయపడుతారని.. దీంతో వారంతా స్వామి వారి కుంకుమను ఆ గాయాలపై రాసుకుంటారని పేర్కొన్నారు.

ఇది ప్రాచీన ఆచారం..

కారుమంచి గ్రామానికి చెందిన పెద్దరెడ్డి వంశస్థుల్లో ఒకరు పిడకల సమరం రోజు శిరస్సున కిరీటం ధరిస్తారు. అలాగే ఖడ్గం చేత పట్టుకుని అశ్వంపై కైరుప్పల గ్రామానికి తన అనుచరులతో వారు కలిసి వస్తారు. అనంతరం వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కారుమంచి వైపు వెళ్తారు. ఆ తర్వాత పిడకల సమరం ప్రారంభమవుతోంది. అయితే కైరుప్పలలోని ఆలయం అభివృద్ధిలో పెద్దరెడ్డి వంశస్థులు కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబానికి స్వామి ఉత్సవాల్లో ప్రత్యేక స్థానం కల్పిస్తారని గ్రామస్తులు వివరించారు.

LEAVE A RESPONSE