భవిష్యత్తులో నీటి కొరకు యుద్ధాలు తప్పవు
ముఖ్యమంత్రికి అమరావతి బహుజన ఐకాస బాలకోటయ్య లేఖ
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంతో, పరిపాలనా అనుభవ బాల్యారిష్టాలతో కృష్ణా జలాలను కూడా ఎత్తుకు పోతున్నారని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ డిమాండ్ కు అనుకూలంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నీటి కేటాయింపులను తిరిగి పరిశీలించి, మళ్లీ కొత్తగా కేటాయింపులకు వీలు కల్పిస్తూ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు అధికారాలు కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో గురువారం ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు. లేఖ పూర్తి సారాంశం ఇది.
ముఖ్యమంత్రి గారూ..!
1976 లో బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 811 టిఎంసిల కృష్ణా జలాలను కేటాయించారు. 2004లో ఏర్పాటైన బ్రిజేష్ కుమార్ ట్యూబునల్ కూడా బచావత్ అవార్డుకు రక్షణగా నిలిచింది. ఈ ఒప్పందంలో భాగంగా ఏపీకి 512 టిఎంసిలు, తెలంగాణకు 299 టీఎంసీలు నీరు కేటాయించారు. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తరువాత కూడా ఏ ప్రాజెక్టుకు ఎంత నీటి కేటాయింపులు ఉన్నాయో నోటిఫై చేశారు.
వివాదాలను పరిష్కరించుకునేందుకు కృష్ణా ,గోదావరి బోర్డులను ఏర్పాటు చేశారు. మధ్యవర్తిత్వం కోసం కేంద్ర జల శక్తి ఆధ్యర్యంలో ఎఫెక్ట్స్ కమిటీ ఏర్పాటు చేశారు. అయినా తెలంగాణ ప్రభుత్వం కొత్త వాదన తెరపైకి తెచ్చి, కొత్తగా నీటి కేటాయింపులు చేయాలని, ఇందుకు కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని అటు కేంద్ర ప్రభుత్వం పైనా, సుప్రీంకోర్టులోనూ వాదనలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వారి వాదనలకు దీటుగా సమాధానం చెప్పలేని పరిస్థితిని సానుకూలంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం తన తెలంగాణా ఎన్నికల ఎత్తుగడలో భాగంగా కృష్ణా జలాల పునః పరిశీలనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం దుర్మార్గం .
ముఖ్యమంత్రి గారు,
కేంద్రం నుంచి పోరాడి సాధించుకోవాల్సిన అన్ని హక్కులను ఇప్పటికే పక్కన పెట్టారు.22 మంది ఎంపీలను ఇచ్చినా, ఏ దశలోనూ కేంద్రంపై పోరాట పటిమను చూపలేకపోయారు. ప్రత్యేక హోదాను వదిలేశారు.పోలవరం నిధులను రాబట్ట లేకపోయారు. విశాఖ రైల్వే జోన్ మరిచారు. వెనుకబడ్డ ప్రాంతాల ప్యాకేజీ గాలి కొదిలారు. రాజధాని నిధులను కాలదన్నారు. ఆఖరికి విశాఖ ఉక్కును అమ్ముతాం అని ప్రకటించినా కార్మికులకు అభయం ఇవ్వలేక పోయారు. తాజాగా కృష్ణా జలాల హక్కులకు భంగం వాటిల్లే ప్రమాదం తెచ్చారు.
ముఖ్యమంత్రి గారూ, మూడు రాజధానులు లేకపోయినా, పరిశ్రమలు రాకపోయినా బలుసాకు తినైనా బతకొచ్చేమో కానీ, నీరు లేకపోతే బతకలేం. అన్నపూర్ణ లాంటి ఆంధ్ర రాష్ట్రానికి నీరే జీవనాధారం. కృష్ణా జలాల ఆధారంగానే కృష్ణా డెల్టా లోని 13 లక్షల ఆయకట్టు సాగు జరుగుతుంది. ఈ నీటి హక్కులను కాపాడుకో లేకపోతే, భవిష్యత్తులో గ్రామాల్లో , పట్టణాల్లో త్రాగు నీరు కూడా దొరకదు. రాయలసీమతో పాటు మూడు ప్రాంతాల ప్రజలకు కరువు కోరలే చిరునామాలుగా మారతాయి.
పార్లమెంట్ లో నాలుగవ అతిపెద్ద పార్టీగా ఉన్న మీరు, ఇప్పటికైనా, రాష్ట్ర ప్రయోజనాల గూర్చి ,సాగునీటి హక్కుల గూర్చి కలబడండి.ధీటుగా వాదన వినిపించండి. అవసరమైతే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి, కలిసికట్టుగా పోరాడండి. ఏపీ హక్కులకు భంగం వాటిల్లితే, భవిష్యత్తులో తెలుగుజాతి మీ ప్రభుత్వాన్ని క్షమించదు . ‘సంకెళ్లు వేసిన వాడినే వచ్చి సంకెళ్లు తీయమని అడగటం కంటే, మన సత్తా పెంచుకొని వాటిని ఛేదించటం మంచిది’ అంటారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. ఆయన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర హక్కుల కోసం బలంగా నిలబడతారని ఆశిస్తూ …..
పోతుల బాలకోటయ్య ,
అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు