– నేను ఒక్కడినే పరిగెత్తుతూ పనిచేస్తే సరిపోదు
– లీడర్‌గా ఉండండి. ఫాలోవర్‌గా కాదు
– మంత్రులు, ఎమ్మెల్యేలను గౌరవించండి
– పెట్టుబడుదారులకు ఇబ్బందులు కలిగించకండి
– నాలా చట్టం రద్దు
– 3వ జిల్లాల కలెక్టర్ల సదస్సులో రెండవ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
విజయవాడ: నాలా చట్టాన్ని రద్దు చేస్తున్నాం. వచ్చే సదస్సుకు మరిన్ని మార్పులు చేద్దాం. ఇకపై మీటింగ్‌లలో నేరుగా సమస్యపైనే చర్చిద్దాం. సమస్య పరిష్కారం అనే విధానంలో చర్చిద్దాం.
సమస్యలకు పరిష్కారం చూపాలనే లక్ష్యంతో కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్నాం. జిల్లాలో వచ్చే సమస్యలను సెక్రటరీలు, మంత్రులు పరిష్కరించాలి. అక్కడ పరిష్కారం కాకపోతే నా వద్దకు రావాలి. అన్నిటికీ డబ్బులే కాదు. ఆలోచనల ద్వారా అనేక సమస్యలకు పరిష్కారం చూపాలి.
నేను నాలుగు సార్లు సీఎం అయ్యాను. కానీ ఇన్ని సార్లు కేంద్ర ఆర్థిక మంత్రిని కలవలేదు. కేంద్రం మనకు వివిధ రకాలుగా సాయం చేస్తోంది. అభివృద్ధి చేయాలి. దానితో పాటు ఇచ్చిన హామీల మేరకు పథకాలు అమలు చేయాలి. అప్పులు, వడ్డీలు చెల్లించే విషయంలో క్రెడిబిలిటీ పోకుండా వ్యవహరించాల్సి ఉంది.
నిధుల కోసం, అప్పుల కోసం ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలు అన్వేషిస్తున్నాం. అప్పులు తెచ్చేది అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల కోసం. ఇలాంటి సమయంలో అందరం కలిసి పనిచేయాలి. నేను ఒక్కడినే పరిగెత్తుతూ పనిచేస్తే సరిపోదు. నాతో పాటు అంతా పరిగెత్తాలి. అప్పుడే సత్ఫలితాలు వస్తాయి.
గుంతలు పడిన 20 వేల కి.మీ రోడ్లు బాగు చేశాం. ఇంకా రూ.1000 కోట్లు కావాల్సి ఉంది. వాటిని కూడా విడుదల చేస్తాం. పథకాలు, కార్యక్రమాలపై ప్రజలు ఏం అనుకుంటున్నారు అనేది తెలుసుకుంటున్నాం. ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని నాణ్యమైన సేవలు అందించవచ్చు. ప్రభుత్వం పీ4ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఉగాది రోజున దీనికి నాంది పలుకుతున్నాం.
జీరో పావర్టీ అనేది మన అందరి లక్ష్యం కావాలి. నేను 1995లో విజన్ డాక్యుమెంట్ గురించి చెబితే ఎగతాళి చేశారు. కానీ కళ్ల ముందు ఫలితాలు ఉన్నాయి. త్వరలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లను మనం ప్రారంభిస్తున్నాం. వీటి ద్వారా కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుదాం. గోదావరి పుష్కరాలకు మనం కమిటీ వేశాం. పనులపై దృష్టిపెట్టాలి. అధికారులు ఫీల్డ్‌లో ఎక్కువ ఉండాలి. అప్పుడే ప్రజల సమస్యలు తెలుస్తాయి.
మంత్రులు, ఎమ్మెల్యేలను గౌరవించండి. వారు మీ దృష్టికి తెచ్చిన సమస్యలను పరిష్కరించండి. ప్రజాస్వామ్యంలో అధికారులు, నాయకులు కలిసి పనిచేయాలి. అప్పుడే సమస్యలు వెంటనే పరిష్కారమవుతాయి. లీడర్‌గా ఉండండి. ఫాలోవర్‌గా కాదు. కొత్తగా ఆలోచనలు చేసి అమలు చేయండి.
జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలకు వెళ్లండి. మీ నిర్ణయాలు, చర్యలు మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయండి. రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నాం. ఇవన్నీ గ్రౌండ్ అయ్యేలా కలెక్టర్లు చొరవ చూపాలి. పెట్టుబడుదారులకు ఇబ్బందులు కలిగించకండి.