Suryaa.co.in

Telangana

ఆందోళనకరంగా విద్యా విధానం

– ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ ప్రక్షాళన చేయలేం.
– 10 వేల మంది టీచర్ ఉద్యోగాలను భర్తీ చేశాం
– యువతలో నైపుణ్యం కొరవడి వెనుకబడిపోతున్నారు
– ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి ఆ రంగంలో సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ దీన్ని ఒక సామాజిక బాధ్యతగా గుర్తించినప్పుడే వ్యవస్థలో అవసరమైన ప్రక్షాళన చేయడం సాధ్యపడుతుందని చెప్పారు.

విద్యా రంగంపై శాసనమండలిలో జరిగిన ప్రత్యేక చర్చకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. 2021 నేషనల్ అచీవ్‌మెంట్ సర్వేలో పేర్కొన్న గణాంకాలను సభలో వివరించారు. సబ్జెక్టుల వారిగా తెలంగాణలో ఏ స్థానానికి పడిపోయిందీ తెలిపారు. ఏ సబ్జెక్టులోనూ కనీస ప్రాథమిక సామర్థ్యాన్ని ప్రదర్శించలేని వారి సంఖ్య పెరగడం, ప్రభుత్వ పాఠశాలల్లో చేరికల సంఖ్య తగ్గడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

“విద్యా విధానం కొంత ఆందోళనకరంగా మారింది. ఎవరు అవునన్నా కాదన్నా ఇందులో వాస్తవం ఉంది. విద్యా రంగంలో పడిపోతున్న ప్రమాణాలను పెంచాలంటే కేవలం నిధుల కేటాయింపు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. అందరూ ఒక సామాజిక బాధ్యతగా భావించినప్పుడే సమస్యను పరిష్కరించగలుగుతాం.

విద్యా వ్యవస్థలో అవసరమైన మార్పులు, ప్రక్షాళన చేయడానికి సూచనలు, సలహాలు ఇవ్వండి. అందరి సూచనలతో సమగ్రమైన ఒక పాలసీ డాక్యుమెంట్‌ను రూపొందించి చర్చిద్దాం. పడిపోతున్న ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికీ మేల్కొనకపోతే భవిష్యత్తు తరాలకు మనం ద్రోహం చేసిన వారిమవుతాం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ ప్రక్షాళన చేయలేం.

విద్యా రంగంలో ప్రమాణాలు పెంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అధికారంలోకి రాగానే, డీఎస్సీ నిర్వహించి 10 వేల మంది టీచర్ ఉద్యోగాలను భర్తీ చేశాం. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న టీచర్ల బదిలీలు, ప్రమోషన్లను పూర్తి చేశాం.

అయితే, విద్యా ప్రమాణాలు పడిపోవడంలో కేవలం ప్రభుత్వానిదే కాకుండా సమాజంపైన కూడా బాధ్యత ఉంది. సామాజిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యం పెంచాల్సిన అవసరం ఉంది. రాజకీయ కోణంలో ఆలోచనలు చేసినన్ని రోజులు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయలేం.

యువతలో నైపుణ్యం కొరవడి వెనుకబడిపోతున్నారు. నైపుణ్యతలను పెంచడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (#YISU) ని ఏర్పాటు చేశాం. అలాగే, మూస పద్ధతిలో సాగుతున్న ఐటీఐలను సంస్కరిస్తూ కాలం చెల్లిన కోర్సులకు స్వస్తి పలుకుతూ వాటిని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా (#ATC) అప్‌గ్రేడ్ చేస్తున్నాం. వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ఏటీసీలను ఏర్పాటు చేస్తున్నాం.

క్రీడాకారులను తయారు చేయడం, ఒలింపిక్స్ క్రీడలు లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, అకాడమీలను ప్రారంభించబోతున్నాం. దీనికి సంబంధించి త్వరలోనే విధివిధానాలను ప్రకటిస్తాం. కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం” అని వివరించారు.

ఇవీ.. చదువుల్లో మన ర్యాంకులు!

2021 నేషనల్ అచీవ్ మెంట్ సర్వే జరిగింది. ఈ సర్వేలో మూడో తరగతి, ఐదో తరగతి చదివేవారిలో 75 శాతం మంది విద్యార్థులు ఏ సబ్జెక్టులో కనీస ప్రాధమిక సామర్థ్యం కూడా చూపలేదు. సబ్జెక్టుల వారీగా దేశంలో 37 ర్యాంకుల్లో తెలంగాణ ఏ స్థానంలో ఉందో గమనిస్తే… మూడో తరగతికి సంబంధించి తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో తెలంగాణది 36 వ ర్యాంకు, గణితంలో 35 గా ర్యాంకు,ఈవీఎస్ లో 36 వ ర్యాంకు, ఐదవ తరగతికి సంబంధించి తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో తెలంగాణది 36 వ ర్యాంకు, గణితంలో 35 వ ర్యాంకు, ఈవీఎస్ లో 36 వ ర్యాంకు, మూడో తరగతిలో ఉండి కనీసం రెండో తరగతి పుస్తకాలు చదవగలిగినవారు.

2018 లో 18.1 శాతం, 2022 లో 5.2 శాతం, 2024 లో 6.3… 5 వ తరగతిలో ఉండి కనీసం రెండో తరగతి పుస్తకాలు చదవగలిగిన వారు. 2018 లో 43.6 శాతం, 2022 లో 31.7 శాతం, 2024 లో 31.5. 3 వ తరగతిలో ఉండి కనీసం 2 వ తరగతి లెక్కలు చేయగలిగిన వారు… 2018 లో 34.5 శాతం, 2022 లో 28.7 శాతం, 2024 లో 31.0… 5 వ తరగతిలో ఉండి కనీసం 2 వ తరగతి లెక్కలు చేయగలిగిన వారు… 2018 లో 48.7 శాతం, 2022 లో 44.6 శాతం, 2024 లో 41.1 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక సంఖ్య 6.50 లక్షలు తగ్గింది. 10 వేల మంది టీచర్ల ఉద్యోగాలు భర్తీ చేశాం. 36 వేల మంది టీచర్లను బదిలీలు ఎలాంటి ఆరోపణలు లేకుండా పూర్తి చేశాం.

రాష్ట్రంలో 26, 100 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల్లో ఒక్కో డే స్కాలర్ విద్యార్థిపై 1,08000 ఖర్చు పెడుతుంది. 98000 రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదివే ఒక్కో విద్యార్థిపై ఖర్చు పెడుతున్నాం. మరి ప్రభుత్వం ఎక్కడ విఫలమైందో చెప్పండి? మన విద్యా ప్రమాణాలు పడిపోవడంపై కేవలం ప్రభుత్వమే కాదు.. తెలంగాణ సమాజం కూడా బాధ్యత వహించాలి. విద్యా ప్రమాణాల విషయంలో ప్రక్షాళన మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది

తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వ్యక్తి జైపాల్ రెడ్డి

పాలమూరు రంగారెడ్డికి గతంలో ఏ పేరు లేదు. అందుకే పాలమూరు ఎత్తిపోతలకు జైపాల్ రెడ్డి పేరు పెట్టాం. హైదరాబాద్ కు మెట్రో రావడానికి కారణం జైపాల్ రెడ్డి. వారు కోరుకుంటే హైదరాబాద్ మెట్రోకు కూడా జైపాల్ రెడ్డి పేరు పెట్టినా తప్పులేదు. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వ్యక్తి జైపాల్ రెడ్డి. ఉత్తమ పార్లమెంటేరియన్ అయిన ఆయన సేవలు మరువలేం. ఆయన పేరును పాలమూరు ఎత్తిపోతలకు పెట్టుకోవడం సహేతుకం. ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చ్ 31, 2026 లోగా 12 వాయిదాలలో గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలు చెల్లిస్తాం. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ ను సమయానుగుణంగా ఎప్పటికప్పుడు చెల్లిస్తాం. కొందరు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పెండింగ్ పెట్టి… రిటైర్డ్ లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. రిటైరైన వారి లయబిలిటీస్ ను తీసుకుని బకాయిలు చెల్లించే బాధ్యత మాది.

LEAVE A RESPONSE