Suryaa.co.in

Andhra Pradesh

సీఎం ఉస్కో అనడం…సీఐడీ అధికారులు అరెస్టు చేయడం

– సీఐడీ పత్రిక ప్రకటనలో అన్నీ అవాస్తవాలే
– టీడీపీ జాతీయ అధికారప్రతినిధి మహమ్మద్ నసీర్

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంపై ఉస్కో అంటుంటే…సీఐడీ అధికారులు ప్రతిపక్ష నాయకులను అడ్డగోలుగా, నిబంధనలకు విరుద్దంగా అరెస్టు చేసి వేధిస్తున్నారని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి మహమ్మద్ నసీర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ…‘‘సీఐడీ చేప్పే మాటలన్నీ బూటకాలేనని సీఐడీ వికృత చర్యలు నిరూపిస్తున్నాయి. సీఐడీ వీటికి సమాధానం చెప్పాలి.

ప్రశ్న: మీరు నిజంగా చట్టపరంగా, చట్టబద్దంగా పనిచేస్తున్నారా? ఐపీసీ నిబంధనలు పాటిస్తున్నారా?
వాస్తవం: ఇటీవల కాలంలో సీఐడీ నమోదు చేసేవన్నీ కేసుల్లో మెజారిటీ సోషల్ మీడియా కేసులే. ఇవన్నీ ఐపీసీ 153-A, 505(2) కింద నమోదు చేస్తున్నారు. రెండు మతాలు లేక కులాల లేదా ప్రాంతాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన ప్పుడు మాత్రమే ఈ కేసులు నమోదు చేయాలి. ఈ విషయాన్ని హైకోర్టు కూడా రంపచోడవరం వైసీపీ ఎమ్మెల్యే కేసులో స్పష్టంగా చెప్పింది. ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శించినప్పుడు కులాలు, మతాలు, గొడవలు వచ్చే ప్రసక్తే లేదు. ఈ సెక్షన్ ల కింద కేసులు పెట్టడం అనుచితమని, అనైతికం అని హైకోర్టు చెప్పింది.అలానే పోస్టులు పెట్టేవారు ఒక గ్రూపు, మంత్రులు, ప్రభుత్వం ఒక గ్రూపుగా భావించి . ఐపీసీ 153-A, 505(2) సెక్షన్ల కింద కేసులు పెట్టడం చెల్లదని, చట్ట విరుద్ధమని హైకోర్టు చెప్పింది. ఇప్పటిదాక సోషల్ మీడియాపై పెట్టిన కేసులన్నీ ఈ సెక్షన్ కిందనే పెట్టారు. స్పష్టంగా ఐసీపీ నింధనలను అనుసరించలేదని పేర్కొంది.

ప్రశ్న : సీఐడీ తమను ఇబ్బంది పెట్టినట్లు మీడియా, జడ్జిలు ముందు ముద్దాయిలు ఆరోపణ చేయలేదు అనేది నిజమా?
వాస్తవం:
1)వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ అధికారులు ఇబ్బందిపెట్టారని, కొట్టారని జడ్జికి, మీడియాకు చెప్పారు. ఈ విషయాన్ని ఆర్మీ ఆసుపత్రి కూడా 18-05-2021న నిర్ధారించింది. ఏపీ సీఐడీపై హైకోర్టుకు నమ్మకం లేకే కదా కేసును గౌరవకోర్టు సీబీఐ ని ఆశ్రయించింది.
2) సీఐడీ అధికారులు తీవ్రంగా కొట్టారని సోషల్ మీడియా కార్యకర్త వెంగళరావు 27-08-2022న బహిరంగంగా చెప్పారు.
3) ఇంటిదగ్గర్నుండి సీఐడీ అధికారులు కొట్టుకుంటూ తీసుకెళ్లారని గార్లపాటి వెంకటేష్ 30-06-2022న జడ్జి, మీడియాకు తెలిపారు.
4) టీడీపీ నేత చింతకాయల విజయ్ ఇంటిమీద, లాయర్ మరియు డ్రైవర్ మీద దాడి చేసి, చిన్నపిల్లలు, ఆడవారిని కూడా బెదిరించారు. సీఐడీ వికృత చేష్టలపై విజయ్ 01-10-2022న కేసు కూడా పెట్టారు.
5) మీడియా కో ఆర్డిరేటర్ దారపనేని నరేంద్రను కస్టడీలో హింసించారని జడ్జి, మీడియాకు వివరించారు.
6) కొల్లి అంకమాబు, రంగనాయకమ్మ తదితర వృద్దులను ఇబ్బందిపెట్టారు.
ఇలా అనేకమందిని వేధించి ఎవర్నీ ఇబ్బందిపెట్టలేదంటూ సీఐడీ అధికారులు నంగనాచి కబర్లు చెబుతున్నారు. సీఐడీ విచారణ నుండి బయటకు వచ్చిన వారిలో 90శాతం మంది తమను కస్టడీలో హింసించారని మీడియాకు, న్యాయమూర్తికి చెప్పడం జరిగింది. జడ్జి రిమాండ్లను తిరస్కరించారు. నిజంగా మీరు చట్టబద్దంగా, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తే రిమాండ్లను జడ్జిలు ఎందుకు తిరస్కరిస్తారో సీఐడీ సమాధానం చెప్పగలదా?

ప్రశ్న: నిబంధన ప్రకారం మీరు విధులు నిర్వహిస్తున్నారా?
వాస్తవం: 1996లోనే డాక్టర్ డి కె బసు వర్సస్ వెస్ట్ బెంగాల్ కేసులో సుప్రీం కోర్టు చెబుతూ క్రిమినల్ కేసును దర్యాప్తు చేసే పోలీసు అధికారి తప్పనిసరిగా యూనిఫాం, పేరుతో కూడిన బ్యాడ్జీ ధరించాలని స్పష్టంగా చెప్పినా సీఐడీ పాటించడంలేదు. నోటీసు ఇవ్వకుండా, యూనిఫాం కూడా లేకుండా నేరుగా ఇళ్లల్లోకి వెళ్లి దౌర్జన్యం చేస్తూ తనిఖీలు చేస్తున్నారు. ఇళ్లల్లో తల్లులు పిల్లలకు పాలు ఇస్తున్నారన్న కనీస అవగాహన లేకుండా తనిఖీలు నిర్వహించడం చట్ట విరుద్ధం కాదా? మూడున్నర సంవత్సరాల్లో ఒక్క ఛార్జిషీట్ కూడా సీఐడీ ఎందుకు వేయలేదు? సీఐడీ పెడుతున్న సోషల్ మీడియా కేసుల్లో సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ , 41ఏ నోటీసులను సక్రమంగా నిర్వహించలేదని కోర్టులు రిమాండ్లను తిరస్కరిస్తున్నా సీఐడీ వైఖరిలో మార్పు ఎందుకు రావడం లేదు?

ప్రశ్న: నేరస్తుడు ఆధారాలు మాయం చేయవచ్చు..నేరస్తుడు తిరిగి నేరం చేయవచ్చా?
వాస్తవం: విచారణ పూర్తి చేయకుండా ముద్దాయిని నేరస్తుడని ఏ విధంగా నిర్ధారిస్తారు? క్రిమినల్ కోర్టు విచారణ జరిపి, వాస్తవాలను తెలుసుకుని ఆ తరువాత ముద్దాయి నేరస్థుడో కాదో నిర్ధారిస్తుంది. కానీ విచారించక ముందే నేరస్థుడని సీఐడీ ఏ విధంగా నిర్ధారించి చెబుతుంది? సీఐడీ అధికారులేమైనా ఏమైనా న్యాయమూర్తులా? మీరు చెప్పిన ప్రకారం క్రిమినల్ కేసులో ముద్దాయిగా ఉన్నవాడు నేరస్థుడైతే ముఖ్యమంత్రి కూడా నేరస్థుడేనా? రాజకీయ నాయకుల్ని, మీడియా వారిని టెర్రరిస్టుల్లా చూడడం అధికారపక్షానికి లొంగడం కాదా? సీఐడీ చీఫ్ కు అంత ధైర్యం ఉంటే ఐపీసీ కి కట్టుబడాలనే కాని, వైసీపీ చెప్పినట్లు గుడ్డిగా ఎందుకు చేస్తున్నారు? ప్రతిపక్షాలపైనే ఎందుకు కేసులు పెడుతున్నారు? వైసీపీ సోషల్ మీడియా వారు ప్రతిపక్ష నేతలను బండ బూతులు తిడుతూ పోస్టులు పెడుతున్నారు వారిపై కేసులు ఎందుకు లేవు? విచారణ పూర్తి చేయకముందే ముద్దాయిని నేరస్తుడుగా నిర్ధారించడం చట్టవిరుద్దం అని తెలియని అధికారులు సీఐడీలో ఉన్నారు. 498-A కింద తెలంగాణలో సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ పై కేసు నమోదైంది. దీని ప్రకారం సీఐడీ చీఫ్ నేరస్తుడేనా? నేరస్తుడు, ముద్దాయికి మధ్య తేడా సీఐడీకి తెలియకపోతే ఎలా?

ప్రశ్న : చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు చర్యలు తీసుకోవడం సీఐడీ విధి?
వాస్తవం : సోషల్ మీడియాలో అసభ్యకర, అశ్లీలకర పోస్టులు, ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా కామెంట్లు, పోస్టులు పెట్టినవారిపై చర్య తీసుకోమని తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో మూడున్నరేళ్లలో 300కు పైగా ఫిర్యాదులిచ్చినా ఒక్కరిపై కూడా కేసు ఎందుకు నమోదు చేయలేదు? టీడీపీ నేతలు పంచుమర్తి అనురాధ, వర్ల రామయ్య, అచ్చెన్నాయుడు ..ఇలా అనేకమందిపై వైసీపీ నేతల అసభ్యకర పోస్టులను సాక్ష్యాధారాలతో సహా సీఐడీ అధికారులకు అందించినా ఎటువంటి చర్యలూ తీసుకోలేదు? సీఐడీ వాళ్లు వైసీపీ నేతలు ఫిర్యాదులు ఇవ్వకముందే కేసులు పెట్టి ప్రతిపక్ష నేతలను వేధించడం నిబంధనల ప్రకారం నడుచుకున్నట్లా?

ప్రశ్న : సీఐడీ అరెస్టు చేసిన వారిని కొట్టినట్లు వైద్యాధికారులు ఎక్కడా నిర్ధారించలేదా?
వాస్తవం : సీఐడీ అరెస్టు చేసి కస్టడీలో తీవ్రంగా కొట్టారని న్యాయమూర్తి వద్ద చెప్పిన ప్రతి కేసులోనూ వైద్య పరీక్షలకు జడ్జి ఆదేశించారు. ఆ సమయంలో సీఐడీ పోలీసులు వైద్యులను కూడా మేనేజ్ చేసి, తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నాలు చేశారు. గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి వైసీపీ నేతల బంధువు కాదా? తన దగ్గర్నుండి తప్పుడు రిపోర్టులు తెచ్చుకున్న విషయం వాస్తవం కాదా? 90శాతం కేసుల్లో రిమాండ్లను జడ్జిలు ఎందుకు తిరస్కరించారో సీఐడీ ఎందుకు సమాధానం చెప్పలేకపోతుంది?

సీఐడీ తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు సజ్జల రాసి ఇచ్చిన స్క్రిప్టును ప్రజల్లోకి పంపితే…దాన్ని ప్రజలెవరూ నమ్మే పరిస్థితులు లేవు. మీ దుశ్చర్యలన్నింటినీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. చట్టాన్ని, ఐపీసీ నిబంధనలను, సుప్రీకోర్టు తీర్పులను మంటగలిపి వ్యవహరిస్తున్న సీఐడీ ప్రజల దృష్టిలో తమ తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలా నిన్న విడుదల చేసిన పత్రికా ప్రకటన అనిపిస్తోంది. జగన్ రెడ్డి, సజ్జల చేతిలో సీఐడీ కీలుబొమ్మలా వ్యవహరిస్తోందని ప్రజలే చెబుతున్నారు. సీఐడీ దుశ్చర్యలను రాష్ట్ర ప్రజలంతా ఖండించాలి. సీఐడీ ఇప్పటికైనా చట్టబద్దంగా నడుచుకుని, ప్రజలకు సేవచేసే విధంగా పనిచేయాలని టీడీపీ కోరుతోంది’’ అన్నారు.

LEAVE A RESPONSE