-పన్నుల పేరుతో పరిమితికి మించిన భారం
– రెండున్నరేళ్ల పరిపాలనలో అస్తవ్యస్తంగా విద్యుత్ రంగం
– శాసనసభ సభ్యులు ఏలూరి సాంబశివరావు
వైసీపీ ప్రభుత్వం ట్రూ అప్ అనే కొత్త పద్దతిలో విద్యుత్ వినియోగదారులను దొడ్డిదారిన దోపిడీ చేస్తోందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విమర్శించారు. విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారాలు మోపడాన్ని ఆయన ఒక ప్రకటనలు తీవ్రంగా ఖండించారు. విద్యుత్ వినియోగంతో సంబంధం లేకుండా ట్రూ అప్ ఛార్జీల పేరుతో కరెంటు చార్జీలను రెట్టింపు చేయడం దారుణమన్నారు. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవడం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఉదాహరణ అన్నారు. సంక్షేమం పేరుతో రూపాయి ఇచ్చి పన్నుల పేరుతో వేల రూపాయలు లాక్కొంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి ప్రజలపై భారాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. లేకుంటే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. జగన్ ప్రభుత్వం ఈ రెండేళ్ల పాలనలో నాలుగుసార్లు విద్యుత్ ఛార్జీలను పెంచిందని మండిపడ్డారు.
పాదయాత్ర సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఊరు ఊరు తిరిగి ప్రజలకు వాగ్దానాలు చేసి ఇప్పుడు విద్యుత్ చార్జీలు పెంచడం ఏమిటని ప్రశ్నించారు? ప్రమాణ స్వీకారం రోజు విద్యుత్ ఛార్జీలు పూర్తిగా తగ్గించేస్తాం అంటూ ఆవేశ పూరిత ప్రశంగం చేసిన ముఖ్యమంత్రి ఇచ్చిన మాట తప్పారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల రూపంలో పేదలపై భారం మోపిందని ఊదరగొట్టి వైసీపీ నాయకులు అబద్ధపు ప్రచారం సాగించారు. అధికారంలోకి వచ్చింది మొదలు… విద్యుత్ బిల్లుల మోత మోగిస్తున్నారు. ఒకవైపు పన్నుల బాదుడు, మరోవైపు ఛార్జీల పెంపు బాదుడుతో సామాన్యుడికి మోత మోగిపోతోంది.
జగన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, చేతకాని పరిపాలనతో విద్యుత్ రంగం మొత్తం భ్రష్టుపట్టిపోయింది. టీడీపీ హయంలో సౌర మరియు పవన విద్యుత్ ప్రోత్సాహించాం. 10వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పతి పెంచాం.డిమాండుకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి చేసి.. 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించాం. విద్యుత్ ఛార్జీలు పెంచబోయేది లేదు అని బహిరంగంగా.. సగర్వంగా ప్రకటించాం.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక.. సౌర, పవన విద్యుత్ రంగాన్ని దెబ్బతీశారు. సోలార్ విద్యుత్ కొనుగోళ్లకు సంబధించి కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేశారు. ఫలితంగా విద్యుత్ కోతలు తీవ్రమయ్యాయి. ప్రైవేట్ వ్యక్తుల నుండి అధిక ధరలు కోనుగోలు చేస్తుండడంతో ఆభారం ప్రజలపై పెనుభారమైంది. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి.. విద్యుత్ ఛార్జీల రూపంలో ప్రజలపై రూ.9000 కోట్ల భారమేశారు. కరోనా సమయంలో ప్రజలు అవస్థలు పడుతున్న సమయంలో స్లాబ్ రేట్లు మార్చి ధరలు పెంచారు.
కిలో వాట్ రూ.10, యూనిట్ 50 పైసల చొప్పున రెండు సార్లు అప్రకటితకంగా స్లాబ్ రేట్లు మార్చి.. రూ.6000 కోట్లు భారం మోపారు. ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీల పేరుతో గతంలో వాడిన కరెంటుకు ఇప్పుడు ధరల మోత మోగిస్తూ.. రూ.3,660 కోట్ల భారం మోపారు. గతంలో ట్రూ ఆఫ్ భారం ప్రజలపై పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వమే ఆ భారాన్ని భరించింది. కానీ.. నేడు.. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని అధికారంలోకి వచ్చి ట్రూ అప్ పేరుతో భారాలు వేయడం దుర్మార్గం. ప్రస్తుతానికి ఇళ్ళకే పరిమితం అయినప్పటికీ రానున్న రోజులలో రైతులపై కూడ భారం పడనుంది.
పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. ట్రూఅప్ పేరుతో అదనపు భారాన్ని ప్రజలపై వేయడం మానుకోవాలి. పక్క రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో విద్యుత్ బిల్లులు అధికం…. టెక్నాలజీ పరంగా దేశ వ్యాప్తంగా విద్యుత్ చార్జీలు తగ్గుతుంటే ఏపీలో పెరుగుతున్నాయి.
రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచకపోవడం దురదృష్టకరం. పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో ఉన్న విద్యుత్ ధరలు చూసి పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. కరోనా సమయంలో ప్రజలు అల్లాడుతున్నా దొడ్డిదారిన విద్యుత్ సర్ చార్జీల పెరుతో దోపిడి చేశారు. విద్యుత్ చార్జీలు తగ్గించి, ప్రజలపై పన్నుల భారాన్ని ఆపాలి, లేకుంటే తిరుగుబాటు తప్పదు. 2020 ఫిబ్రవరిలో 500 యూనిట్లు దాటిన వారిపై 90 పైసలు పెంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ 1300 కోట్ల భారాన్ని ప్రజలపై మోపింది. 2020 ఏప్రిల్ మే నెలల్లో స్లాబులు మార్చి కరోనాతో అతలాకుతలమైన ప్రజల పై మరోసారి విద్యుత్ చార్జీలు పెంచి రూ.1500 కోట్ల భారం మోపింది.
2021 ఏప్రిల్ 1 నుంచి కొత్త టారీఫ్ ఆర్డర్ ను తీసుకొచ్చి కిలోవాట్ కు రూ.10 చార్జీలతో 20 శాతం చార్జీలను పెంచింది. స్థిర చార్జీలు లేవు అంటూనే కిలోవాట్ కు రూ.10 వడ్డన తో 20% బిల్లులు పెంచారు. దీంతో వినియోగదారులపై దాదాపు రూ.2600 కోట్లు వరకు భారాన్ని మోపారు. ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్ మెంట్ పేరుతో ప్రతి మూడు నెలలకు ఒకసారి పెరిగిన విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని ప్రజల నుండి వసూలు చేయాలని నిర్ణయించడం సరికాదు.
ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో వినియోగదారుల నుంచి రూ. 3669 కోట్లు వసూలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి డిస్కమ్లకు అనుమతినిచ్చింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.24,491 కోట్లు అప్పు తెచ్చినా ఆ అప్పు తన అవినీతికి, దుబారాకు జగనార్పణం చేశారు. ప్రజలపై రూ. 9069 కోట్ల అదనపు భారం మోపి మోసం చేశారు. వైసీపీ నేతల లూటికి, దుబారాకు విద్యుత్ వినియోగదారులు మోయలేని భారాలు మోయాలా.?
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నెట్ వర్క్ ను వినియోగించుకున్నందుకు వసూలు చేసే ఛార్జీలు మెగావాట్ కు రూ.5.5 లక్షల నుండి రూ 3.5 లక్షలు తగ్గించింది. దీని ద్వారా రాష్ట్రానికి రూ.400 కోట్ల ఆదా అయింది. కేంద్ర ఎనర్జీ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వం 625 మెగావాట్ల థర్మల్ పవర్ భారాన్ని ఉపసంహరించుకోవడంతో ఏపీ డిస్కమ్ లకు మరో రూ.1007 కోట్ల ఆర్థిక భారం కూడా తగ్గిందని గుర్తు చేశారు. తక్షణమే ప్రభుత్వం ప్రజలపై మోపిన విద్యుత్ భారాన్ని ఉపసంహరించుకోవాలి.