Suryaa.co.in

Andhra Pradesh

గుడివాడ – కంకిపాడు రోడ్డు విస్తరణ,అభివృద్ధి పనులు ప్రారంభం 

– 10 మీటర్ల సీసీ, బీటీ రోడ్లను నిర్మిస్తున్నాం
– బెడ్ లెవల్‌కు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, సెప్టెంబర్ 8: గుడివాడ ప్రాంత ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న గుడివాడ – కంకిపాడు ప్రధాన రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు బుధవారం ప్రారంభమయ్యాయని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. కృష్ణాజిల్లా గుడివాడలో రూ. 16. 10 కోట్ల వ్యయంతో నిర్మించే సీసీ, బీటీ రోడ్లకు సంబంధించి మంత్రి కొడాలి నాని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడ పట్టణం మీదుగా విజయవాడకు వెళ్ళే వాహనదారులు గుడివాడ – కంకిపాడు ప్రధాన రహదారిపై అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ రోడ్డుకు ఇరువైపులా పంటకాల్వలు ఉండడంతో రోడ్డు నిర్మించిన కొద్ది కాలంలోనే అక్కడక్కడా రోడ్డు మార్జిన్లు కుంగి పోతున్నాయని చెప్పారు. సింగిల్ రోడ్డు కావడంతో గుంటలు ఏర్పడిన ప్రాంతంలో ఎదురెదురుగా వచ్చే వాహనాలు ఒక్కోసారి ప్రమాదాల బారిన పడుతున్నాయన్నారు.
గుడివాడ నియోజకవర్గానికి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగిందని, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి గుడివాడ – కంకిపాడు రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనుల నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చానని తెలిపారు. అయితే ఈ రోడ్డు ఒక్కో ప్రాంతంలో ఒక్కో వెడల్పుతో ఉందని చెప్పారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న పంటకాల్వలు చాలా లోతుగా ఉన్నాయన్నారు. దీంతో రిటైనింగ్ వాల్స్ ను కూడా నిర్మించాల్సి వచ్చిందన్నారు. రోడ్డును పటిష్టంగా నిర్మించడంపై దృష్టి పెట్టానని తెలిపారు. గుడివాడ పట్టణంలోని పెదకాల్వ సెంటర్ నుండి కేటీఆర్ మహిళా కళాశాల, ఆంధ్ర నలంద మున్సిపల్ ఉన్నత పాఠశాల, జీవీఆర్ కళ్యాణ మండపం మీదుగా మందపాడు రైల్వే గేటు వరకు 10 మీటర్ల మేర నిర్మించే సీసీరోడ్డు పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఇప్పటి వరకు ఈ రోడ్డు ఐదున్నర మీటర్ల వెడల్పు మాత్రమే ఉందన్నారు. అలాగే పట్టణంలోని ఓవర్ బ్రిడ్జి దగ్గర నుండి బేతవోలులోని మంచినీటి రిజర్వాయర్ వరకు 10 మీటర్ల మేర బీటీ రోడ్డును నిర్మిస్తామన్నారు. అక్కడి నుండి అక్కినేని నాగేశ్వరరావు కళాశాల సమీపంలో ఉన్న పెదపారుపూడి మండలం భూషణగుళ్ళ వరకు ఉన్న 6.7 మీటర్ల రోడ్డును 10 మీటర్ల రోడ్డుగా నిర్మిస్తామన్నారు. ఈ రోడ్డుకు ఎడమ వైపున ఉన్న పంటకాల్వకు కూడా రిటైనింగ్ వాల్ ను నిర్మిస్తున్నామన్నారు. భూషణగుళ్ళ దగ్గర నుండి మండల కేంద్రమైన పెదపారుపూడి వంతెన వరకు కుడివైపున ఉన్న పంటకాల్వకు రిటైనింగ్ వాల్, ఐదున్నర మీటర్లు ఉన్న రోడ్డును 10 మీటర్లకు విస్తరించి అభివృద్ధి చేస్తామన్నారు. ప్రస్తుతం రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు బెడ్ లెవల్ కు చేరాయన్నారు. గుడివాడ – కంకిపాడు ప్రధాన రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత వాహనాల రద్దీ కారణంగా ఎదురవుతున్న సమస్యలన్నీ తొలగిపోతాయన్నారు. రిటైనింగ్ వాల్స్ ను కూడా నిర్మించడం వల్ల గుడివాడ – కంకిపాడు రోడ్డు పటిష్టంగా ఉంటుందని మంత్రి కొడాలి నాని తెలిపారు.

LEAVE A RESPONSE