– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్
అమరావతి : ఈ నెల 26 న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు పటిష్టమైన విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అధికారులను ఆదేశించారు. గణతంత్ర దినోత్సవ సన్నాహక ఏర్పాట్లను గురువారం రాష్ట్ర సచివాలయం నుండి వర్చువల్ గా సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 26వ తేదీ ఉదయం 9.గం.లకు మున్సిపల్ స్టేడియంలో జరిగే రాష్ట్ర స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ముఖ్య అతిధిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించ నున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఇతర న్యాయమూర్తులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొననున్న దృష్ట్యా పటిష్టమైన బందో బస్తుతో పాటు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఈవేడుకలకు హాజరయ్యే ప్రముఖులతో పాటు ప్రతి ఒక్కరికీ తగిన సీటింగ్ ఏర్పాట్లు, అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు. ఈవేడుకల ప్రాంగణంలో తగిన త్రాగునీటి వసతి, పారిశుద్ధ్య నిర్వహణ, తాత్కాలిక మరుగు దొడ్లు, బారీ కేడింగ్, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
గణతంత్ర దినోత్సవ వేడుకల నేపధ్యంలో రాజ్ భవన్, హైకోర్టు, అసెంబ్లీ, రాష్ట్ర సచివాలయం,సీఎం క్యాంపు కార్యాలయం సహా ఇతర ముఖ్య భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని సిఎస్ అధికారులను ఆదేశించారు. ఈసారి గణతంత్ర దినోత్సవం ఆదివారం వచ్చినందున ఈ వేడుకలకు పాఠశాల పిల్లలను తరలించే అంశంపై విద్యాశాఖ అధికారులు, విజయవాడ జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. వివిధ శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించి తగు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
అంతకు ముందు పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేష్ కుమార్ వివిధ శాఖల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై వివరించారు. వాటిలో ముఖ్యంగా పోలీస్ శాఖ తరపున స్టేడియం లోపల వెలుపల తీసుకోవాల్సిన బందోబస్తు ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ వంటి ఏర్పాట్లపై సూచనలు జారీ చేశారు. సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా ముఖ్య అతిధి వారి గణతంత్ర దినోత్సవ సందేశం తయారీ మరియు ప్రచురణతో పాటు సరిపడిన ప్రతులు సిద్ధం చేసి అందరికీ పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
అలాగే పటిష్టమైన పబ్లిక్ అడ్రస్ సిష్టం, మీడియా లైవ్ కవరేజికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు వీలుగా కనీసం 14 శాఖలకు సంబంధించిన శకటాల ప్రదర్శనకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వేడుకల అనంతరం ఆయా శకటాలను విజయవాడ నగర ప్రధాన రహదారిపై ప్రదర్శనగా వెళ్ళేందుకు వీలుగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని విజయవాడ నగర పోలీస్ కమీషనర్కు ఆయన సూచించారు.
అదే విధంగా ప్రధాన వేదిక అలంకరణ ఇతర ఏర్పాట్లు సహా స్టేడియంలో ఇతర వసతులపై తగిన చర్యలు తీసుకోవాలని ఎన్టిఆర్ జిల్లా కలక్టర్, మున్సిపల్ కమీషనర్ లను ఆదేశించారు. వివిధ శాఖలవారీగా చేయాల్సిన ఏర్పాట్లపై సకాలంలో తగు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్. సురేష్ కుమార్, విజయవాడ 8 ఏఐఆర్ ఎన్.సి.సి. వింగ్ కమాండర్ ఎ.ఎస్.రాథీ, ప్రోటోకాల్ డైరెక్టర్ మోహన్ రావు, అడిషనల్ సెక్రెటరీ (జనరల్) కాళీ కుమార్, ఐఅండ్ పిఆర్ అదనపు సంచాలకులు ఎల్ స్వర్ణలత తదితర అధికారులు ప్రత్యెక్షంగా పాల్గొనగా, డిజిపి కార్యాలయపు ఐజిలు శ్రీకాంత్, రాజకుమారి, ఎన్టిఆర్ జిల్లా కలక్టర్, విజయవాడ పోలీస్ కమీషనర్ తదితరులు వర్చువల్ గా పాల్గొన్నారు.