అమరావతి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోంది. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి శాసనపరమైన నిర్ణయాలు తీసుకోకూడదని తేల్చిచెప్పింది. ఒకసారి చట్టం చేసి అంత మంది రైతులను ఇన్ వాల్వ్ చేసి అన్ని వేల ఎకరాలు తీసుకున్న తర్వాత అంత తేలికగా నిర్ణయాన్ని మార్చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ ” రిట్ ఆఫ్ మాండమాస్ ” ఇస్తున్నామని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.
ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ తాము చట్ట పరంగా చేయాల్సిన తప్పనిసరి విధులను చేయకపోతే… ఆ పనులను చేసి తీరాల్సిందే అని ఉన్నత న్యాయస్థానం జారీ చేసే తప్పనిసరి ఆదేశాలను “మాండమస్”గా చెప్పుకోవచ్చు. హైకోర్టు, సుప్రీంకోర్టులకు మాత్రమే ఉండే అత్యున్నత అధికారం ఇది.
ఇలాంటి తీర్పులను కోర్టులు చాలా తక్కువ సందర్భాల్లో ఇస్తూంటాయి. 1962లో వెస్ట్ బెంగాల్ హైకోర్టు మాండమస్ ను వినియోగించి ఓ బాధితుడుకి న్యాయం చేసింది. ప్రత్యేకంగా ప్రైవేట్ వ్యక్తులకు, సంస్థలకు వ్యతిరేకంగా ఈ ఆదేశాలను హైకోర్టు లేదా సుప్రీంకోర్టు కోర్టు జారీ చేయలేవు. కేవలం ప్రభుత్వం అన్యాయం చేస్తున్నప్పుడు మాత్రమే మాండమస్ తీర్పు ఇవ్వగలవు.
మాండమస్ రిట్ ను అంతిమ ప్రత్యామ్నాయంగానే కోర్టులు వినియోగించాలనే నిబంధన ఉంది. అమరావతి విషయంలో ఇంతకు మించి రైతులకు న్యాయం చేయడానికి వేరే దారి లేదని హైకోర్టు భావించినట్లుగా కనిపిస్తోంది.