– విద్యా సంస్కరణలు మంచి ఫలితాలిస్తున్నాయి.
– అందరికీ అవగాహన కోసమే సదస్సులు
– విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్
జాతీయ విద్యా విధానంలో భాగంగా చేపడుతున్న పాఠశాలల మ్యాపింగ్ కార్యక్రమంపై విపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ఒకవైపు అవగాహన కల్పిస్తూ ఉంటేనే కొందరు ఈ విధానాన్ని విద్యా విధ్వంసం అని సంబోధించడాన్ని మంత్రి ఖండించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని, వాటి వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని మంత్రి చెప్పారు.
జాతీయ విద్యా విధానం లో భాగంగా స్కూల్స్ మ్యాపింగ్ పై విద్యాశాఖ రాష్ట్రంలోని అందరు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లకు నిర్వహిస్తున్న అవగాహన సదస్సు సచివాలయంలోని 5 వ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. శుక్రవారం రెండోరోజు సదస్సు కు పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లు విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరు కాగా రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిదులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ స్కూళ్ల మ్యాపింగ్ ద్వారా ఏవో అనర్ధాలు జరుగుతాయని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నారని, దీనిపై ప్రజాప్రతినిధులకు అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ఈ సదస్సును ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యా రంగంలో తీసుకు వచ్చిన విప్లవాత్మక మార్పుల వల్ల ఎన్నో మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు.
పాఠశాలల్లో జరిగిన అభివృద్ధి వల్ల రెండు లక్షలకు పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని చెప్పారు. గతంలో పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం కేంద్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి ఉండేదని మంత్రి చెప్పారు. కానీ వైసీపీ ప్రభుత్వం నాడు- నేడు పేరుతో కోట్లాది రూపాయలను నేరుగా పేరెంట్స్ కమిటీ ఖాతాల్లో వేసి పాఠశాలలను అభివృద్ధి చేసిన విషయాన్ని గమనించాలన్నారు. నాడు-నేడు తరహాలోనే తెలంగాణలో కూడా మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని చేపడుతున్న సంగతిని మంత్రి గుర్తు చేశారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా చేపడుతున్న స్కూళ్ల మ్యాపింగ్ వల్ల ఏ ఒక్క పాఠశాల మూత పడదని ఉపాధ్యాయ పోస్టులకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడవని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయుల ద్వారా నాణ్యమైన విద్యాబోధన జరుగుతుందన్నారు.
త్వరలో శాసన సభ్యులు సూచన మేరకు జిల్లాల వారీగా కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయని స్థలాల సరిహద్దులు తెలియకుండానే ప్రహరీ గోడల నిర్మాణం జరిగిందని కందుకూరు శాసనసభ్యులు మహీదర్ రెడ్డి చేసిన సూచనలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ పాఠశాలల స్థలాలను గుర్తించి హద్దులు ఏర్పాటు చేసి రక్షణ కల్పిస్తామని మంత్రి చెప్పారు.
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యా రంగంలో తీసుకు వచ్చిన విప్లవాత్మక మార్పులు రాబోయే తరాలకు మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. సదస్సుకు హాజరైన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు పాఠశాలల మ్యాపింగ్ ప్రక్రియను స్వాగతిస్తూ మెరుగైన ఫలితాల కోసం ఇంకా చేపట్టాల్సిన కొన్ని సూచనలను చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల విద్య స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్, కమిషనర్ సురేష్ కుమార్, ఎస్పీడి వెట్రిసెల్వి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వైజర్ మురళి, అడిషనల్ డైరెక్టర్లు పార్వతి, సుబ్బారెడ్డి, ప్రసన్నకుమార్, ప్రతాప్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, జేడీ రామలింగం, మున్సిపల్ కమిషనర్ లు, స్పెషల్ ఆఫీసర్ లు, ఆర్ జే డీ లు, డీఈఓ లు పాల్గొన్నారు.